
Dhanteras Puja Time Telugu: 2026 నవంబర్ 6, శుక్రవారం ధంతేరస్ పండుగను దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ రోజున ఆరోగ్యానికి అధిదేవతగా భావించే ధన్వంతరి స్వామి, సంపదకు ప్రతీక అయిన లక్ష్మీదేవి, కుబేరుడిని భక్తులు ప్రత్యేకంగా పూజిస్తారు. కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ప్రార్థిస్తారు. అలాగే అపమృత్యు భయం తొలగి, కుటుంబానికి రక్షణ లభించాలని కోరుకుంటూ సాయంత్రం దక్షిణ దిశలో యమ దీపాన్ని వెలిగిస్తారు. ఈ రోజున బంగారం, వెండి, కొత్త పాత్రలు కొనుగోలు చేయడం శుభప్రదమని చాలామంది విశ్వసిస్తారు.
ధంతేరస్ రోజున లక్ష్మీ పూజకు సాయంత్రం 6:02 గంటల నుంచి 7:57 గంటల వరకు శుభ సమయంగా పేర్కొన్నారు. మొత్తం 1 గంట 56 నిమిషాల పాటు పూజ చేసుకోవచ్చు. ఇక ప్రదోష కాలం సాయంత్రం 5:33 నుంచి రాత్రి 8:09 గంటల వరకు ఉంటుంది.
ధంతేరస్ రోజున బంగారం, వెండి, వెండి నాణేలు, ఆభరణాలు కొనడం శుభప్రదంగా భావిస్తారు. కొత్త ఇత్తడి, రాగి లేదా స్టీల్ పాత్రలు, చీపురు, కొత్తిమీర విత్తనాలు కూడా కొనుగోలు చేస్తారు. కొందరు ఈ రోజున లక్ష్మీదేవి-గణేశుడి విగ్రహాలు, అలాగే కొత్త వాహనాలను కొనుగోలు చేయడం ఆనవాయితీగా పాటిస్తారు.
కొన్ని సంప్రదాయాల ప్రకారం ధంతేరస్ రోజున ఇనుప, పదునైన వస్తువులు, నల్ల రంగు వస్తువులు, గాజు సామగ్రి, నూనె, నెయ్యి కొనకుండా ఉంటారు. ఇవి ప్రాంతం, కుటుంబ ఆచారాలను బట్టి మారవచ్చు.
ముందుగా ఇంటిని, పూజా స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. అనంతరం చౌకీపై ఎరుపు లేదా పసుపు వస్త్రాన్ని పరచి, లక్ష్మీదేవి, కుబేరుడు, ధన్వంతరి స్వామి విగ్రహాలు లేదా చిత్రాలను ప్రతిష్ఠించాలి. ముందుగా గణేశుడిని పూజించి, సంకల్పం తీసుకోవాలి. తర్వాత ధన్వంతరి, లక్ష్మీదేవి, కుబేరుడికి పంచామృతం, అనంతరం శుద్ధజలంతో అభిషేకం చేయాలి. పసుపు, కుంకుమ, అక్షతలు, పూలు, గంధం సమర్పించి దీపం, ధూపం వెలిగించాలి. లక్ష్మీ, కుబేర మంత్రాలను జపిస్తూ నైవేద్యంగా పండ్లు, మిఠాయిలు సమర్పించి హారతి ఇవ్వాలి.
ధంతేరస్ సాయంత్రం ప్రదోష సమయంలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద లేదా తులసి మొక్క దగ్గర యమరాజుకు అంకితంగా దీపం వెలిగించే సంప్రదాయం ఉంది. దీపాన్ని దక్షిణ దిశ వైపు ఉంచి అకాల మరణ భయం తొలగి కుటుంబానికి రక్షణ కలగాలని ప్రార్థిస్తారు. కొన్ని సంప్రదాయాల్లో ఈ రోజున 13 దీపాలు వెలిగించే ఆచారం కూడా ఉంది.
(Disclaimer: ఈ కథనంలోని పూజా విధానాలు, ఆచారాలు, నమ్మకాలు సంప్రదాయాలు, ప్రాంతాలను బట్టి మారవచ్చు. ఇవి భక్తి, ఆధ్యాత్మిక విశ్వాసాల ఆధారంగా అందించిన సమాచారం మాత్రమే.)