
Auspicious Items for Dhanteras: హిందూ సంప్రదాయంలో ధంతేరస్ పండుగకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ/కార్తీక మాసంలోని కృష్ణ పక్ష త్రయోదశి తిథి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున ఆరోగ్యానికి అధిదేవతగా భావించే శ్రీ ధన్వంతరి స్వామిని, సంపదకు ప్రతీకలైన లక్ష్మీదేవి, కుబేరుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ధంతేరస్ రోజున కొత్త వస్తువులు కొనుగోలు చేయడం శుభప్రదమని చాలామంది నమ్ముతారు. ముఖ్యంగా బంగారం, వెండి కొనుగోలు చేస్తే ఇంట్లో సిరిసంపదలు పెరుగుతాయని విశ్వసిస్తారు. అయితే ప్రస్తుతం బంగారం, వెండి ధరలు భారీగా పెరగడంతో ప్రతి ఒక్కరూ వాటిని కొనుగోలు చేయడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ధంతేరస్ రోజున బంగారం, వెండికి బదులుగా తక్కువ ధరలో లభించే కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం కూడా సంప్రదాయపరంగా శుభప్రదంగా భావిస్తారు. మరి ఆ వస్తువులు ఏమిటో తెలుసుకుందాం.
గోమతి చక్రం చూడటానికి చక్రం ఆకారంలో ఉండే ప్రత్యేకమైన రాయి. దీనిని లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనదిగా భావిస్తారు. ధంతేరస్ రోజున కనీసం రెండు లేదా ఐదు గోమతి చక్రాలను కొనుగోలు చేయవచ్చని నమ్మకం. వీటిని దీపావళి రోజున లక్ష్మీదేవి పూజలో సమర్పించి పూజిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం, సుఖసంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
పూర్వకాలంలో గవ్వలను నాణేల మాదిరిగా ఉపయోగించేవారు. అందుకే వీటికి సంపదతో సంబంధం ఉందని భావిస్తారు. ధంతేరస్ రోజున ఐదు లేదా తొమ్మిది గవ్వలను కొనుగోలు చేసి దీపావళి లక్ష్మీపూజలో అమ్మవారికి సమర్పిస్తారు. ఇలా పూజించడం వల్ల వివాహ సంబంధిత అడ్డంకులు తొలగుతాయని ఒక సంప్రదాయ విశ్వాసం.
హిందూ సంప్రదాయంలో శంఖానికి ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. సముద్రం నుంచి ఉద్భవించిన శంఖాన్ని లక్ష్మీదేవికి సోదరుడిగా కూడా అభివర్ణిస్తారు. శంఖధ్వని ఇంట్లో సానుకూల వాతావరణాన్ని కలిగిస్తుందని నమ్ముతారు. ఇంట్లో శంఖం లేకపోతే ధంతేరస్ రోజున కొనుగోలు చేసి దీపావళి పూజలో ఉపయోగించవచ్చు.
దీపావళి పూజలో లక్ష్మీదేవి, వినాయకుడిని ఆరాధించడం ముఖ్యమైన సంప్రదాయం. లక్ష్మీదేవి సంపదకు, వినాయకుడు జ్ఞానం, విఘ్నాల తొలగింపునకు ప్రతీకలుగా భావిస్తారు. ధంతేరస్ రోజున వీరి విగ్రహాలను కొనుగోలు చేయవచ్చు. విడివిడిగా ఉండే మట్టి విగ్రహాలను ఎంచుకోవడం మంచిదని సంప్రదాయం చెబుతుంది. లక్ష్మీదేవి పద్మంపై కూర్చొని, చేతుల నుంచి నాణేలు కురుస్తున్నట్లుగా ఉండే విగ్రహాన్ని శుభప్రదంగా భావిస్తారు.
ధంతేరస్ రోజున చీపురు కొనుగోలు చేయడం కూడా ఒక ప్రత్యేకమైన ఆచారం. చీపురును పరిశుభ్రత, శుభ్రత, సమృద్ధికి ప్రతీకగా భావిస్తారు. ఇంట్లోని ప్రతికూలతను తొలగించి లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి చీపురు కొనుగోలు చేస్తారనే నమ్మకం ఉంది. దీనిని దీపావళి రోజున పూజించి మరుసటి రోజు నుంచి ఉపయోగిస్తారు.
ధంతేరస్ రోజున కొత్త పాత్రలు కొనుగోలు చేయడం ఎంతో శుభప్రదమని భావిస్తారు. ముఖ్యంగా నీటిని నిల్వ చేసుకునే చెంబు, కలశం, గ్లాసు వంటి పాత్రలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. కొనుగోలు చేసిన పాత్రలను దీపావళి పూజ సమయంలో పూజించి ఉపయోగించుకోవచ్చు.
దీపావళి అంటేనే దీపాల పండుగ. ఇంటి నలుమూలలా దీపాలు వెలిగించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. దీపాల వెలుగు అంధకారాన్ని తొలగించి ఆనందం, శ్రేయస్సును తీసుకొస్తుందని విశ్వసిస్తారు. అందుకే ధంతేరస్ రోజున మట్టి ప్రమిదలను కొనుగోలు చేయవచ్చు. వీటిలో ప్రధాన పూజ కోసం రెండు పెద్ద ప్రమిదలను ప్రత్యేకంగా ఉంచుకోవాలి.
ధంతేరస్ రోజున ఖీల్(బొరుగులు), బతాషా(పంచదార బిళ్లలు), పేలాలు కొనుగోలు చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. వీటిని శుక్ర గ్రహం, సంపద, సౌభాగ్యానికి సంబంధించినవిగా సంప్రదాయంలో పేర్కొంటారు. దీపావళి రోజున లక్ష్మీదేవి పూజలో వీటిని నైవేద్యంగా సమర్పిస్తారు. మట్టి పాత్రలో వీటిని ఉంచి అమ్మవారికి సమర్పించడం మంచిదని నమ్మకం.
(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న వస్తువుల కొనుగోలు, పూజా విధానాలు హిందూ సంప్రదాయాలు, మత విశ్వాసాల ఆధారంగా అందించబడ్డాయి. ప్రాంతాలు, కుటుంబ ఆచారాలను బట్టి పద్ధతులు మారవచ్చు. వీటిని పాటించడం పూర్తిగా వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించిన విషయం.)