టీటీడీ కొత్త పాలకమండలి కొలువైంది. బొల్లినేని రాజగోపాల్ నాయుడు ఛైర్మన్‌గా మరో 15 మంది సభ్యులుగా ధర్మకర్తల మండలి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 5 నెలల తర్వాత టీటీడీ పాలకమండలి ఏర్పాటైంది. తిరుమల ఆలయ సంప్రదాయాలను పాటించి వరాహ స్వామిని ముందుగా దర్శించుకున్న బీఆర్ నాయుడు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్లి శ్రీవారి సన్నిధికి చేరుకున్నారు. ఆలయ మహా ద్వారం వద్ద టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలకగా ఆలయంలోని బంగారు వాకిలి వద్ద టీటీడీ ఈవో శ్యామల రావు ప్రమాణం చేయించారు. టీటీడీ 54వ ధర్మకర్త మండలి ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టారు
టీటీడీ పాలకమండలి ఛైర్మన్ బీఆర్ నాయుడు దంపతులకు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు అందజేయగా టీటీడీ ఈవో శ్యామల రావు స్వామి వారికి తీర్థ ప్రసాదాలను చిత్రపటాన్ని అందజేశారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం అనంతరం పాలకమండలి సభ్యులుగా వేమిరెడ్డి ప్రశాంతి, ఎమ్మెస్ రాజు, నర్సిరెడ్డి, పూర్ణ సాంబశివరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, జంగా కృష్ణమూర్తి, మహేందర్ రెడ్డి, అనుగోలు రంగశ్రీ, ఆనంద సాయి, జానకి దేవి, దర్శన్, శాంతారాం, నరేష్ కుమార్, డాక్టర్ అదిత్ దేశాయ్‌లు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ధర్మకర్తల మండలి సభ్యులకు ఆలయ పండితులు వేదాశీర్వచనాలు అందజేశారు. టీటీడీ బోర్డు సభ్యులకు శ్రీవారి చిత్రపటంతో పాటు డైరీలు క్యాలెండర్లను అధికారులు అందజేశారు. టీటీడీ ధర్మకర్తల మండలిలో చోటు కల్పించిన సీఎం చంద్రబాబుకు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.