రఘురామ తిరకాసు వివరణ.. వైసీపీ షోకాజ్‌కు వెరైటీ స్పందన

పార్టీ పరిస్థితులపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ క్రమశిక్షణా కమిటీ నుంచి షోకాజ్ నోటీసు అందుకున్న నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు తిరకాసు వివరణ ఇచ్చారు. ఈ మేరకు గురువారం ఆయన పార్టీకి తన వివరణ పంపారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలకు...

రఘురామ తిరకాసు వివరణ.. వైసీపీ షోకాజ్‌కు వెరైటీ స్పందన
Follow us

|

Updated on: Jun 25, 2020 | 4:20 PM

పార్టీ పరిస్థితులపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ క్రమశిక్షణా కమిటీ నుంచి షోకాజ్ నోటీసు అందుకున్న నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు తిరకాసు వివరణ ఇచ్చారు. ఈ మేరకు గురువారం ఆయన పార్టీకి తన వివరణ పంపారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలకు ఆయన సమాధానం ఇవ్వకపోవడం విశేషం. పార్టీయే తనను బతిమాలి మరీ టిక్కెట్ ఇచ్చి, లోక్ సభకు పంపిందని, తానెప్పుడు ఎంపీ టిక్కెట్ కోసం పార్టీని బతిమాలుకోలేదని… ఇలా చాలా కామెంట్లు చేసిన రఘురామకృష్ణంరాజుకు వైసీపీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే.

గురువారం వైసీపీ షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చారు ఎంపీ రఘురామకృష్ణ రాజు. ‘‘ నాకు పంపించిన షోకాజ్ నోటీసుకు లీగల్ శాంక్టిటీ లేదు.. ఈసీలో నమోదైన ప్రకారం పార్టీ పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్.. నాకు పంపిన షోకాజ్ నోటీస్ లెటర్ హెడ్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ అని ఉంది.. అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో మరో పార్టీ రిజిస్టరై ఉంది.. పార్టీ పేరు మార్పు కోరుతూ ఎలాంటి కమ్యూనికేషన్ ఈసీ వద్ద లేదు..’’ అని తన వివరణ లేఖలో రఘురామక‌ృష్ణంరాజు పేర్కొనడం విశేషం.

‘‘ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీ .. అలాంటి పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి పేరుతో వచ్చిన షోకాజ్ నోటీసు నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది.. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఈ షోకాజ్ నోటీసు నాకు పంపారా? అదే నిజమైతే ఎన్నికల సంఘం వద్ద ఉన్న వివరాల ప్రకారం మీ పదవి చెల్లుబాటు కాదు .. పార్టీలో క్రమశిక్షణ కమిటీ ఉండాలన్నది బైలాస్ లో ఉంది .. ఆ మేరకు క్రమశిక్షణ కమిటీని ఈసీ గుర్తించిందా? అదే నిజమైతే క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ ఎవరు? నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చే ముందు క్రమశిక్షణ కమిటీ ద్వారానే ప్రొసీజర్ అమలు చేశారా? క్రమశిక్షణ కమిటీ ఉంది అంటే ఆ కమిటీ సమావేశపు మినట్స్ నాకు అందించగలరు.. తద్వారా సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా నేను సమాధానం ఇవ్వగల్గుతాను..’’ అని తన లేఖలో రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.

‘‘ ముఖ్యమంత్రిని అభిమానించి ఆరాధించే వ్యక్తిగా నేను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, నియమ నిబంధనలకు కట్టుబడి ఉన్నాను.. క్రమశిక్షణ కమిటీ ద్వారా సరైన విధానంలో మీరు అడిగే వివరణ ఇచ్చేందుకు నేను సిద్ధం.. లేనిపక్షంలో ఈ షోకాజ్ నోటీసును అసలైనదిగా పరిగణించలేను. పైపెచ్చు తప్పుదారిపట్టించే ఈ చర్యలపై న్యాయపరంగా పోరాడతాను.. పార్టీ ఉనికికే ప్రమాదం కలిగించవద్దని మిమ్మల్ని కోరుతున్నాను.. అందరి కంటే ఎక్కువగా ఇలాంటి చర్యల ద్వారా పార్టీకి ఎక్కువ నష్టం కల్గిస్తున్నారు.. ’’ అని లేఖలో ఎంపీ రఘురామకృష్ణ రాజు ప్రస్తావించారు.

తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా షోకాజ్ నోటీసు పంపిన వైసీపీకి ఒకరకంగా వివరణ పేరిట రఘురామకృష్ణంరాజు తనదైన శైలిలో షాకిచ్చినట్లయ్యింది. చేసిన కామెంట్లకు వివరణ ఇవ్వకపోగా.. అసలు పార్టీ పేరునే వివాదాస్పదం చేసేందుకు రఘురామ తన వివరణ లేఖ ద్వారా ఆజ్యం పోసినట్లయ్యింది. వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని పార్టీ విధివిధానాలలో పేర్కొన్నారు. ఆ పాయింట్‌నే ఇపుడు లేవనెత్తడం ద్వారా కొత్త వివాదానికి రఘురామకృష్ణంరాజు ప్రయత్నిస్తున్నట్లు ఆయన లేఖ ద్వారా బోధపడుతోంది. రఘురామకృష్ణంరాజు వివరణ లేఖ ద్వారా లేవనెత్తిన ధర్మసందేహానికి వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి వుంది.