RAHULGANDHI TOUR: కీలక సందర్భంలో విదేశాలకు రాహుల్.. బాధ్యతనెత్తుకునేందుకు సుముఖమా ? లేదా ?? పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ

|

Jul 12, 2022 | 7:40 PM

రాహుల్ గాంధీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్ళారు. యువరాజా వారికి విదేశీ పర్యటనలు కొత్తేం కాకపోయినా.. ఈసారి మాత్రం కాస్త చర్చ జరుపుకోవాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. దేశంలో రాజకీయ వాతావరణం వాడీవేడీగా వుంది. ఈ సందర్భంలో ఆయన విదేశాలకు వెళ్ళడం పార్టీ శ్రేణులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.

RAHULGANDHI TOUR: కీలక సందర్భంలో విదేశాలకు రాహుల్.. బాధ్యతనెత్తుకునేందుకు సుముఖమా ? లేదా ?? పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ
Sonia Gandhi and Rahul Gandhi
Follow us on

RAHULGANDHI TOUR OF EUROPE BECAME HOT TOPIC AMONG CONGRESS PARTY CADRE: రాహుల్ గాంధీ. నెహ్రూ కుటుంబ రాజకీయ వారసత్వాన్ని పొందిన వ్యక్తి. కాకపోతే జవహర్ లాల్ నెహ్రూ (Jawaharlal Nehru), ఇందిర (Indira), రాజీవ్ గాంధీ (Rajiv Gandhi)లకు చాలా ఈజీగా దక్కిన ప్రధాని పీఠానికి దూరంగానే వుండిపోతున్నారు. పోనీ పార్టీ పగ్గాలనైనా పూర్తి స్థాయిలో చేపట్టి.. అమీతుమీకి సై అంటున్నారా అంటే అదీ లేదు. 2012లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ (Indian National Congress Party) తరపున ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయిన తర్వాత ఒక్క ఎన్నికలోను తన ప్రభావాన్ని చూపించలేకపోతున్నారు యువరాజా వారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన యుపీ అసెంబ్లీ  (UP Assembly) ఎన్నికల సమయంలోనే భావి ప్రధానిగా రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేసింది. దాంతో యుపీలో విజయంతో సార్వత్రిక ఎన్నికల ప్రయాణానికి సోపానం వేద్దామని రాహుల్ టీమ్ భావించింది. యుపీలో యధాశక్తి ప్రచారం నిర్వహించింది. అయితేనేం.. అక్కడ సమాజ్ వాదీ పార్టీ (Samajwadi Party) అప్పట్లో ఢంకా బజాయించింది. యుపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అధికారం దక్కకపోతే పోనీ కనీసం కాంగ్రెస్ పార్టీ సంఖ్యబలం ఏమైనా పెరిగిందా అంటే అదీ లేదు. ఆనాటి యుపీ ఎన్నికలు (UP Elections) మొదలు 2014, 2019 సార్వత్రిక ఎన్నికలు (General Elections) సహా ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ (Congress Party) పెద్దగా ప్రభావం చూపలేదు. మధ్యప్రదేశ్ (Madhya Pradesh), రాజస్థాన్ (Rajastan) రాష్ట్రాలతోపాటు గోవా (Goa) వంటి చోట సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిల్వడమొక్కటే రాహుల్ హయాంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన మెరుగైన ఫలితాలు. అయితే ఇందులో గోవా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో అధికారాన్ని నిలబెట్టుకునే విషయంలో బీజేపీ (BJP) వ్యూహాల ముందు చేతులెత్తేసింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. కేంద్రంలో అధికారంలో వుండడం బీజేపీకి ఆ రెండు రాష్ట్రాలలో తమకు అనుకూలంగా రాజకీయ వాతావరణాన్ని మలచుకునేందుకు ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. కానీ సొంత పార్టీ చట్టసభ్యులను కాపాడుకోలేకపోతోంది కాంగ్రెస్ పార్టీ అన్న అపప్రధ మాత్రం ఆ పార్టీ సొంతమైంది. గోవా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలే కాదు.. చాలా రాష్ట్రాల్లో (ఇందులో తెలంగాణ కూడా వుంది) కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన చట్టసభల సభ్యులు అయితే బీజేపీలోకో.. లేక స్థానికంగా అధికారంలో వున్న టీఆర్ఎస్ లాంటి పార్టీల్లోకో చేరిపోతున్నారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (2018 Telangana Assembly Elections) కాంగ్రెస్ పార్టీ తరపున 19 మంది గెలిస్తే.. ఇపుడు కేవలం ఆరుగురు మాత్రమే ఆ పార్టీలో కొనసాగుతున్నారు. గెలిచిన వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తర్వాత ఎంపీగా ఎన్నికై ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా.. ఉప ఎన్నికల్లో ఆ సీటును అధికార టీఆర్ఎస్ (TRS) గెల్చుకుంది. ఇక మిగిలిన 18 మందిలో ఏకంగా 12 మంది పార్టీని వీడారు. ఇలా పార్టీ కునారిల్లిపోతున్నా రాహుల్ గాంధీ వ్యూహాత్మకంగా వ్యవహరించడం లేదని, భవిష్యత్తులో జాతీయ స్థాయిలో అధికారం తమదేనన్న నమ్మకాన్ని పార్టీ శ్రేణుల్లో కలిగించ లేకపోతున్నారని కాంగ్రెస్ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ (Anand Sharma).. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (BJP National President JP Nadda)ను కల్వడం కలకలం రేపింది. ఆనంద్ శర్మ కూడా బీజేపీలో చేరుతున్నారన్న కథనాలు మొదలయ్యాయి. అయితే వాటిని ఆయన ఖండించి వుండవచ్చు గాక .. ఆనంద్ శర్మ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారన్న ఆశలు మాత్రం పార్టీ వదిలేసుకున్నట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జులై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ (President Election Polling) జరగనున్నది. అధికార కూటమి వైపు నుంచి బరిలో నిలిచిన ద్రౌపది ముర్ము (Draupadi Murmu) విజయం ఖాయమేనని తేలిపోయినా.. విపక్షాల తరపున బరిలోకి దింపిన యశ్వంత్ సిన్హా (Yashwat Sinha) విజయం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలేవీ కనిపించడం లేదు. ఆయన సొంతంగా విమానం వేసుకుని బీజేపీయేతర పార్టీలు అధికారంలో వున్న రాష్ట్రాలకు వెళ్ళి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే వరకు యాక్టివ్‌గా వున్న కాంగ్రెస్ (Congress), ఎన్సీపీ (NCP), తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) వంటి పార్టీలు యశ్వంత్ వెంట పెద్దగా నడవడం లేదు. మమతాబెనర్జీ (Mamata Banerjee) అయితే ఓ అడుగు ముందుకేసి.. ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని ముందే తమకు తెలిపి వుంటే యశ్వంత్ సిన్హాను దింపేవారిమి కాదన్నట్లుగా మాట్లాడారు. ఇలాంటి కీలక తరుణంలో కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ యూరప్ పర్యటనకు వెళ్ళడం పార్టీ శ్రేణులనే ఆశ్చర్యపరుస్తోంది. రాజకీయ పార్టీలు కీలకమని భావించే పలు సందర్భాలలో రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు వెళ్ళడం చర్చనీయాంశమవుతోంది. ఇటీవల జరిగిన యుపీ సహా అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కూడా సమీక్షలకు ప్రాధాన్యమివ్వ కుండా రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్ళారు. ఆయన నేపాల్లో ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళ్ళి పబ్‌లో దర్శనమివ్వడం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలియనిది కాదు. తాజాగా ఓ వైపు రాష్ట్రపతి ఎన్నికలు, ఇంకోవైపు ఉప రాష్ట్రపతి (Vice President Election) అభ్యర్థిపై యుపీఏ (UPA) పక్షాల్లో చర్చ జరుగుతున్న తరుణంలో రాహుల్ గాంధీ ఉన్నట్లుండి జులై 12వ తేదీన యూరప్ (Europe) టూర్ వెళ్ళడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరో వారం రోజుల్లో రాష్ట్రపతి పదవికి ఎన్నిక, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Session) ప్రారంభం కానున్న సమయంలో రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఆయన జులై12న ఐరోపా వెళ్లినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఆయన మళ్ళీ జులై 17వ తేదీన తిరిగి రానున్నారు. ఆ మర్నాడే అంటే జులై 18వ తేదీనే రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. దేశంలో కీలక పరిణామాలు, సమావేశాలు చోటు చేసుకునే సమయంలోనే రాహుల్ విదేశీ పర్యటనలు పెట్టుకోవడంపై ఇప్పటికే చాలా సార్లు విమర్శలు వచ్చాయి.

ఇక ఈవారంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక సమావేశం ఒకటి జరగనున్నది. జులై 14 తేదీ గురువారం నాటు పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికలపై సోనియా గాంధీ (Sonia Gandhi) సారథ్యంలో ఓ భేటీ జరగనున్నది. ప్రస్తుతం పార్టీ అధ్యక్ష పదవిని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తాత్కాలికంగా నిర్వహిస్తున్నారు. త్వరలో జరగబోయే పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ పడతారా లేదా అన్న విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. 14న జరిగే భేటీలో అక్టోబర్ 2న తలపెట్టిన భారత్ జోడో (Bharat Jodo) యాత్ర గురించి చర్చించనున్నారు. ఇన్ని ముఖ్యమైన పరిణామాల మధ్య రాహుల్ విదేశాలకు వెళ్లడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షపదవిని చేపట్టేందుకు ఆయన ఇష్టంగా వున్నారా లేరా అన్న అంశం ఇపుడు పార్టీ శ్రేణుల్లో మొదలైంది. ఇంకోవైపు గోవా పరిణామాలు కూడా కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. ప్రస్తుతానికి రెబల్ ఎమ్మెల్యేలు పార్టీ వీడకపోయినా..వారంతా బీజేపీతో టచ్‌లోనే వున్నారన్ని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో పార్టీ ఎమ్మెల్యేలను నయానో భయానో కాపాడుకోవాల్సిందిపోయి రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్ళడం ఏంటని కొందరంటున్నారు. మరోవైపు మహారాష్ట్ర (Maharashtra)లో మహావికాస్ ఆఘాడీ (Maha Vikas Aghadi) ప్రభుత్వం కూలిపోయిన తర్వాత అక్కడి పరిణామాలపై అధ్యయనం చేసేందుకు ఓ ప్రత్యేక ప్రతినిధిని ఏఐసీసీ ముంబయి పంపింది. ఆయనిచ్చే నివేదికపై కూడా జులై 14 తేదీ భేటీలో చర్చకు ఆస్కారం వుంది. ఇలా పలు కీలక పరిణామాలు, పలు కీలక సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఏకంగా వారం రోజుల పాటు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్ళడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ పునర్వైభవంపై దృష్టి సారించాల్సిన రాహుల్ గాంధీ ఇలా కీలక సందర్భాలలో దేశంలో లేకపోవడంపై రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.