MUNUGODU BY-POLL IGNITED TELANGANA POLITICAL HEAT: భారీ వర్షాలు, తత్కారణంగా పెద్ద ఎత్తున వరదల కారణంగా గత వారం, పది రోజులుగా స్తబ్ధుగా మారిన తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) కాకరగిలించారనే చెప్పాలి. ఉన్నట్లుండి రాజగోపాల్ ఢిల్లీ (Delhi) వెళ్ళి బీజేపీ (BJP)లో నెంబర్ టూ అని భావించే కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah)ను కల్వడం.. ఆ తర్వాత టీఆర్ఎస్ (TRS) పార్టీని ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే వుందని ప్రకటన చేయడం తెలంగాణ పాలిటిక్స్‌లో కలకలం రేపింది. బీజేపీని పొగడడంతో ఆపని రాజగోపాల్.. కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి కేసీఆర్‌ను గద్దె దింపే సత్తా లేదని కూడా అన్నారు. అనాదిగా పార్టీతో మమేకమైన వారిని కాకుండా వేరే పార్టీల వారికి, తెలంగాణ ఉద్యమానికి (Telangana Agitation) దూరంగా వున్న వారికి బాధ్యతలు అప్పగించడాన్ని రాజగోపాల్ తప్పు పట్టారు. పరోక్షంగా ఆయన రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాయకత్వాన్ని దెప్పి పొడిచారనే చెప్పాలి. రాజగోపాల్ వ్యాఖ్యలతో ఉలిక్కిపడిన సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క (Mallu Bhatti Vikramarka)హుటాహుటిన రాజగోపాల్ నివాసానికి వెళ్ళారు. బుజ్జగించేందుకు యత్నించారు. అయితే, అమిత్ షాని కలిసిన తర్వాత ఏ స్థాయిలో అయితే మాట్లాడారో.. భట్టి కలిసిన తర్వాత కూడా రాజగోపాల్ అదే స్థాయిలో మాట్లాడారు. భట్టి రాయబారం ఏమీ ప్రభావం చూపలేదనడానికి రాజగోపాల్ మాటల్లో ఏమాత్రం తగ్గని తీవ్రతే నిదర్శనం. కేసీఆర్‌ను ఓడించే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదని, బీజేపీకి మాత్రమే ఆ బలం వుందని మరోసారి వ్యాఖ్యానించారు. అమిత్ షాని కలిసిన నేపథ్యం, పార్టీకి వ్యతిరేకంగాను, బీజేపీకి అనుకూలంగాను మాట్లాడిన క్రమంలో రాజగోపాల్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చేందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ (Manikkam Tagore) సిద్దమవుతున్న తరుణంలో తెగే దాకా లాగడం ఎందుకన్న ఉద్దేశంతో రాయబారానికి వెళ్ళిన భట్టి విక్రమార్కకు ఓరకంగా రాజగోపాల్ షాకిచ్చారనే చెప్పాలి. భట్టి ఇలా కలిసి వెళ్ళారో లేదో ఆ వెంటనే తన పాత పాటనే అందుకున్నారు రాజగోపాల్. ఈనేపథ్యంలో ఆయన పార్టీని వీడేందుకు, బీజేపీలో చేరేందుకే మొగ్గుచూపుతున్నారని తేలిపోయింది.
రాజగోపాల్ వ్యాఖ్యలు కేవలం తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లోనే కలకలం రేపలేదు. అటు అధికార టీఆర్ఎస్ పార్టీ (TRS Party)ని కదిపాయి కూడా. జులై 2,3 తేదీల్లో హైదరాబాద్ వేదికగా జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించుకున్న బీజేపీ నేతలు (BJP Leaders).. పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఎన్నికల సమరశంఖారావాన్ని పూరించారు. పార్టీలోకి ఇతర పార్టీల్లో పేరున్న నేతలను చేర్చుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష ప్లాన్ చేశారు… .దాని బాధ్యతలను మాజీ మంత్రి, హుజురాబాద్ (Huzurabad) ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eetala Rajendar)కు అప్పగించారు. ఆయన సైతం పలువురు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు తమకు టచ్‌లో వున్నారంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు, ఆయన కదలికలు ప్రకంపనలు రేపాయి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు ప్రజల అభిమతం మేరకు తదుపరి స్టెప్ వేస్తానని రాజగోపాల్ వెల్లడించారు. తన అనుచరులతో సమాలోచనలు జరుపుతున్నారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జోరందుకుంది. అయితే, ఆయన రాజీనామాపై స్వయంగా ఏమీ ప్రకటన చేయలేదు. కానీ తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం వున్న నేపథ్యంలో రాజగోపాల్ రాజీనామా చేస్తే మునుగోడుకు ఉప ఎన్నిక వస్తుందా లేక ముందస్తుకు వెళితే ఉప ఎన్నిక రాదా అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, ఇటీవల అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తుకు వెళ్ళే ఉద్దేశం తమకు లేదని ఇటీవల కేసీఆర్ (KCR) తనయుడు, రాష్ట్ర మునిసిపల్ వ్యవహారాల మంత్రి కేటీఆర్ (KTR) ప్రకటించారు. దాంతో తెలంగాణలో షెడ్యూలు ప్రకారమే 2023 ద్వితీయార్థంలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్న విశ్లేషణలు వచ్చాయి. కాకపోతే విపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం కేటీఆర్ ప్రకటనను నమ్మలేమని, ముందస్తు వచ్చినా తాము సిద్దంగా వుండాలని భావిస్తున్నాయి. 2018లో ఏ పార్టీ రెడీగా లేని సమయం చూసి అకస్మాత్తుగా అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తుకు వెళ్ళిన కేసీఆర్ వ్యూహాన్ని మరువలేమంటున్నారు పలువురు బీజేపీ, కాంగ్రెస్ నేతలు. అందుకే ప్రజల్లో నిరంతరం వుండేలా కార్యాచరణ ప్రిపేర్ చేసుకున్నాయి. దీంట్లో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ (BJP State President Bandi Sanjay Kumar) ఆగస్టు మొదటివారంలో ప్రజాసంగ్రామ యాత్ర మూడో విడతను ప్రారంభిస్తున్నారు. యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీ నారసింహుని సన్నిధి నుంచి సంజయ్ పాదయాత్రను ప్రారంభించబోతున్నారు. ఆరు జిల్లాల గుండా ఈ పాదయాత్ర జరగబోతోంది. ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి సన్నిధిలో పాదయాత్రను ముగించేలా ప్లాన్ చేశారు.
రాజగోపాల్ పార్టీ మారే సందర్భంలో మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే వచ్చే ఉప ఎన్నికపై కూడా మూడు ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. రాజగోపాల్ పార్టీని వీడితే ఉత్పన్నమయ్యే పరిణామాలను తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం అంచనా వేస్తోంది. ప్రత్యామ్నాయ అభ్యర్థిపై టీపీసీసీ నజర్ పెట్టింది. ఇక హుజురాబాద్ తరహా ఫలితాన్ని నివారించేందుకు అధికార టీఆర్ఎస్ యత్నాలు ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న సీటు అయినా.. అది బీజేపీ దక్కకుండా చూడాలన్నది గులాబీ పార్టీ అధినేత పట్టుదల అని తెలుస్తోంది. అలాగని రాజగోపాల్‌ని తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. ఆర్థిక, అంగబలాలలో కోమటిరెడ్డి కుటుంబానిది అత్యంత బలమైన పోజీషన్. ఆయన పార్టీ మారితే సొంతబలానికి బీజేపీ బలం కూడా తోడైతే ఉప ఎన్నికలో ఆయన గట్టెక్కుతారన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే, రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను నిరోధించే గట్టి సంకల్పంతో వున్న గులాబీ బాస్.. మునుగోడు విషయంలో ఆల్‌రెడీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇక సీటు తమది కాబట్టి ఉప ఎన్నిక వచ్చినా తామే తిరిగి గెలుచుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఎత్తులకు సిద్దమవుతోంది. అయితే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ధీటైన అభ్యర్థిని వెతకడం టీపీసీసీకి సవాలేనని చెప్పాలి. రాజగోపాల్ రాజీనామా చేసి పార్టీని వీడతారా లేక ఎమ్మెల్యేగా కొనసాగుతూనే పార్టీకి దూరమవుతారా లేక పార్టీలో వుంటూనే శల్య ప్రేలాపనలు చేస్తూ పార్టీనే తనను బహిష్కరించేలా వ్యూహాత్మకంగా నడచుకుంటారా అన్నది ఇపుడు ఆసక్తి రేపుతోంది. రాజగోపాల్ వ్యూహంపై ఇంకా స్పష్టత రానప్పటికీ.. మూడు ప్రధాన పార్టీలు మాత్రం మునుగోడుపై ఫోకస్ పెట్టాయి. దానికి అనుగుణంగా సమాలోచనలను వేగవంతం చేశాయి. ఎందుకంటే మునుగోడుకి గనక ఉప ఎన్నిక వస్తే అది వచ్చే శాసనసభ ఎన్నికలకు ముందు సెమీఫైనల్ అని మూడు ప్రధాన పార్టీలు భావించడమే కారణం.