
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిత్యం ప్రయాణించే ప్రయాణికులు, పర్యాటకులు, వ్యాపార పనుల నిమిత్తం నగరానికి వచ్చే వారి సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రయాణికులకు ఆర్థిక భార తగ్గించడంతో పాటు సులభతరమైన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో 600 ధర కలిగిన వీక్లీ బస్ పాస్'ను ప్రారంభించింది.

ఈ పాస్ కొనుగోలు చేసిన రోజు నుండి వరుసగా ఏడు రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ఈ కొత్త వీక్లీ పాస్ ద్వారా ప్రయాణికులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఏసీ బస్సులతో సహా అన్ని రకాల సిటీ బస్సుల్లో అపరిమితంగా ప్రయాణించవచ్చు. అయితే, కేవలం పుష్పక్ ఎయిర్పోర్ట్ లైనర్ సర్వీసులకు మాత్రం ఈ పాస్ వర్తించదని సంస్థ స్పష్టం చేసింది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న రోజువారీ పాస్, నెలవారీ పాస్ సౌకర్యాలకు అదనంగా, ప్రయాణికులకు మరొక చవకైన, అనుకూలమైన ప్రయాణ ఎంపికను అందించడానికి టీజీఎస్ ఆర్టీసీ ఈ సరికొత్త నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో స్వల్పకాలిక బస కోసం వచ్చే పర్యాటకులకు, వ్యాపారవేత్తలకు, వారం రోజుల పాటు నిరంతరం క్యూర్ పరిధిలో ప్రయాణించాల్సిన వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

ఈ వీక్లీ పాస్ వల్ల ప్రయాణికులు ఏడు రోజుల వ్యవధిలో చేసే ప్రతి ప్రయాణానికి వేర్వేరుగా టికెట్లు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి పాస్ తీసుకుంటే ఏడు రోజుల పాటు నగరంలో ఏ సిటీ బస్సులోనైనా నిరభ్యంతరంగా, వేగంగా ప్రయాణించవచ్చు. ఈ వీక్లీ పాసులు నగరంలోని అన్ని సిటీ బస్ పాస్ కౌంటర్లలో అందుబాటులో ఉంటాయి. అవసరమైన వారు తమ సమీపంలోని బస్ పాస్ కౌంటర్లలో కొనుగోలు చేయవచ్చని యాజమాన్యం వెల్లడించింది.

ప్రజా రవాణా వ్యవస్థ వినియోగాన్ని మరింత ప్రోత్సహించడమే కాకుండా, నగర ప్రయాణికులకు అందుబాటు ధరలలో మెరుగైన ప్రయాణ సేవలు అందించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ వీసీ, ఎండీ వై.నాగిరెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో వారం రోజుల పాటు ప్రయాణించే వారందరూ ఈ 600 వీక్లీ బస్ పాస్ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఎండీ నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.