
ఈ రెండింటి మధ్య ఉన్న ప్రధాన తేడా అవి గాలిని చల్లబరిచే విధానంలోనే స్పష్టంగా కనిపిస్తుంది. పోర్టబుల్ ఏసీ అనేది మన ఇంట్లో ఉండే సాధారణ ఏసీ లాగే పనిచేస్తుంది. దీని లోపల ఉండే కంప్రెసర్, గ్యాస్ సహాయంతో గదిలోని వేడిని తరిమేసి చాలా వేగంగా చల్లబరుస్తుంది. అయితే గదిలోని వేడి గాలిని బయటకు పంపడానికి దీనికి ఒక ప్లాస్టిక్ పైపు ఉంటుంది. దానిని కిటికీ గుండా బయటకు పెట్టాల్సి ఉంటుంది. మరోవైపు ఎయిర్ కూలర్ చాలా సింపుల్ పద్ధతిలో పనిచేస్తుంది. ఇది గదిలోని వేడి గాలిని లోపలికి లాక్కుని, మనం పోసిన నీటితో కూలింగ్ ప్యాడ్‌ల గుండా పంపిస్తుంది. ఆ నీటి చల్లదనం వల్ల గాలి చల్లగా మారి తిరిగి గదిలోకి వస్తుంది. ఇందులో ఎలాంటి కంప్రెసర్ గానీ, గ్యాస్ గానీ ఉండవు.

ఇవి పనిచేసే విధానంలో ఉన్న తేడా వల్లే, కరెంట్ బిల్లులో కూడా భారీ తేడా వస్తుంది. సాధారణంగా ఎయిర్ కూలర్లు చాలా తక్కువ విద్యుత్‌తో పనిచేస్తాయి. ఇంట్లో ఉండే ఒక ఫ్యాన్ లేదా టీవీ ఎంత కరెంట్ వాడుతుందో, కూలర్ కూడా అంతే వాడుతుంది. కానీ పోర్టబుల్ ఏసీలు అలా కాదు. వాటిలో కంప్రెసర్ ఉంటుంది కాబట్టి కూలర్ కంటే దాదాపు ఏడు ఎనిమిది రెట్లు ఎక్కువ కరెంట్ తింటాయి. అంటే మామూలు పెద్ద ఏసీలు వాడితే ఎంత కరెంట్ బిల్లు వస్తుందో పోర్టబుల్ ఏసీ వాడినా అంతే బిల్లు వస్తుంది. కాబట్టి తక్కువ ఖర్చుతో, కరెంట్ బిల్లు భయం లేకుండా వేసవిని గడపడమే మీ లక్ష్యం అయితే కూలర్ ఎంచుకోవడమే ఉత్తమం.

ఇక మెయింటెనెన్స్, రిపేర్ ఖర్చుల విషయానికి వస్తే కూడా ఎయిర్ కూలర్ చాలా చౌకైనది. కూలర్‌కు రోజూ నీళ్లు నింపడం, అప్పుడప్పుడు ట్యాంక్, కూలింగ్ ప్యాడ్‌లను శుభ్రం చేసుకోవడం తప్ప పెద్దగా ఖర్చు ఉండదు. పొరపాటున ఏదైనా రిపేర్ వచ్చినా చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. కానీ పోర్టబుల్ ఏసీకి ఎక్కువ శ్రద్ధ అవసరం. దీని ఫిల్టర్లను తరచూ క్లీన్ చేయాలి. పైగా ఏసీ లోపల గ్యాస్ తగ్గిపోయినా లేదా ఏదైనా ఇంటర్నల్ పార్ట్ పాడైనా, మెకానిక్‌ను పిలిపించి సర్వీసింగ్ చేయించాలి. దీనికి వేలల్లో ఖర్చవుతుంది.

అయితే మీరు ఏది కొనాలనేది మీరు ఉండే ఊరి వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. మీరు వైజాగ్, చెన్నై, ముంబై లాంటి సముద్ర తీర ప్రాంతాల్లో ఉంటుంటే.. అక్కడ గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చోట్ల కూలర్లు అస్సలు పనిచేయవు. పైగా గదిని మరింత ఉక్కపోతగా మారుస్తాయి. కాబట్టి తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల వారికి పోర్టబుల్ ఏసీ మాత్రమే కరెక్ట్ ఛాయిస్. ఇది కరెంట్ బిల్లు ఎక్కువగా తీసినప్పటికీ, గాలిలోని తేమను తరిమికొట్టి గదిని పవర్‌ఫుల్‌గా చల్లబరుస్తుంది.

అదే హైదరాబాద్, విజయవాడ, తిరుపతి లేదా రాయలసీమ లాంటి ప్రాంతాలను చూసుకుంటే.. ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉన్నా గాలిలో తేమ ఉండదు, వాతావరణం పొడిగా ఉంటుంది. ఇటువంటి పొడి వాతావరణంలో ఎయిర్ కూలర్లు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. తక్కువ బడ్జెట్‌లో కొనుక్కోవడానికి, తక్కువ కరెంట్ బిల్లుతో వాడుకోవడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఏసీ అంత ఐస్ కూలింగ్ ఇవ్వకపోయినా ఈ ఎండలను తట్టుకోవడానికి కూలర్ చాలా మంచి ఆప్షన్. మీ బడ్జెట్, మీ అవసరాన్ని బట్టి సరైన దాన్ని ఎంచుకోండి.