RBI Gold: భారతీయులతో పాటు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI)కు బంగారంపై మక్కువే. ఈ సంవత్సరంలో మార్చితో ముగిసిన ఆరు నెలల్లో ఆర్‌బీఐ బంగారం నిల్వలను 16.58 టన్నుల మేర పెంచుకుంది. దాంతో 2022 మార్చి చివరి నాటికి మన సెంట్రల్ బ్యాంక్ వద్దనున్న పసిడి ఖజానా ఎంతో తెలుసా..? 760.42 టన్నులు.
ఈ మధ్యకాలంలో విదేశీ మారకం నిల్వలు భారీగా తగ్గుకుంటూ వచ్చిన నేపథ్యంలో రిజర్వ్ బయాంక్ గోల్డ్ రిజర్వ్‌లను పెంచుకుంటూ రావడం విశేషం.2021 సెప్టెంబరులో ఆల్‌టైం గరిష్ఠ స్థాయి 64,245 కోట్ల డాలర్లకు చేరుకున్న ఆర్‌బీఐ ఫారెక్స్ నిల్వలు.. క్రమంగా తగ్గుతూ వచ్చి ఈ నెల 6తో ముగిసిన వారానికి 59,595 కోట్ల డాలర్లకు పడిపోయాయి.
అంటే గడిచిన ఏడు నెలలకు పైగా కాలంలో విదేశీ మారకం ఖజానా 4,650 కోట్ల డాలర్ల మేర తగ్గిందన్నమాట. ఈ ఏడాది విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPI) దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. క్షీణిస్తున్న విదేశీ మారక నిల్వలకు బంగారం కొంత స్థిరత్వం చేకూర్చనుంది.
ఆర్‌బీఐ ముందుజాగ్రత్త చర్యగా 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచే బంగారం కొనుగోళ్లను మొదలు పెట్టింది. గడిచిన రెండేళ్లలోనే పసిడి నిల్వలను 100 టన్నులకు పైగా పెంచుకుంది. ఆర్‌బీఐ తన మొత్తం బంగారంలో 453.52 టన్నులను విదేశాల్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ (బీఓఈ), బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్ (బీఐఎస్) సేఫ్ కస్టడీలో ఉంచింది. మరో 295.82 టన్నులను దేశీయంగా భద్రపరిచినట్లు ఆర్బీఐ తెలిపింది.