
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి రైతు కుటుంబానికి చెందిన గురాల సత్యారెడ్డి చిన్నతనం నుంచి వ్యవసాయంపై మక్కువ. తన ఇంటి పక్కనున్న ఎకరంన్నర స్థలంలో తన కుటుంబ సభ్యులతో కలిసి కూరగాయలు పండిస్తూ ఎక్కువ లాభాలు గడిస్తున్నారు. కరోనా సమయంలో దేశమంతా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సమయంలో రిస్క్ అయినా కూరగాయలు పండించాలని సత్యారెడ్డి భావించారు. కోతుల బెడద కారణంగా రక్షణ చర్యగా తన ఎకరంన్నర పొలంలో రూ.లక్ష పెట్టుబడితో చుట్టూ సోలార్ పెన్సింగ్ చేయించాడు. కొద్దికొద్దిగా కూరగాయలు పండిస్తూ వాటి లాభాలను బేరీజు వేసుకున్నాడు. సత్యారెడ్డి తన భార్య వినోద, కొడుకు రాజురెడ్డితో కలిసి పొలంపై పూర్తిస్థాయి దృష్టిపెట్టారు. అప్పుడప్పుడు స్థానిక మహిళా కూలీలతో కలిసి పొలం పనులు చేస్తూ ఉత్పత్తి పెంచడంతోపాటు.. లాభాలను పెంచాడు.

మొదట కొంత భాగంలో ఆకు కూరలు, కూరగాయలు పండించి ప్రస్తుతం తమ పూర్వీకులు తవ్వించిన 15 గజాల బావినీటితో పూర్తిస్థాయి పొలాన్ని అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. అందులో ప్రస్తుతం ఆకు కూరలైన తోట కూర, పాలకూర, మెంతి, చుక్కకూర, కొత్తిమీర, పుదీన, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ పంటలు పండిస్తున్నారు.. అలాగే తీగజాతి కూరగాయల కోసం ప్రత్యేకించి సహజసిద్దమైన కట్టెల పందిరి వేసి సొరకాయ, కాకర, బీర రకాలను పండిస్తున్నారు.

గెట్టువెంట స్థలాన్ని వృధా చేయకుండా పండ్లకు సంబంధించి తైవాన్ జామ, గ్రీన్యాపిల్, సపోటా, బొప్పాయి, ఆవకాడో, అరటి, పనస వంటి రకాలను పెట్టారు. అలాగే అదే గట్ల వెంట కొబ్బరి, బీట్రూట్ క్యారెట్, కందగడ్డ, మునగ, కీరదోస పండిస్తున్నారు..

నెలకు సగటున ఎకరంన్నర స్థలంలో రూ.8వేలు పెట్టుబడి పెడితే రూ.50వేలు ఆదాయం వస్తుందని.. కుటుంబ సభ్యులంతా పనిచేస్తే సరిపోతుందని తెలిపారు.. వ్యాపారులతోపాటు.. కస్టమర్లు కూడా ఇంటికొచ్చి తాజా కూరగాయలు కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా.. పండుగలు, శుభకార్యాలకు కూడా ఇంటివద్దకు వచ్చి తీసుకెళుతున్నట్లు తెలిపారు..

ఇందుకోసం ఎరువుగా పశువుల పేడ, మేక ఎరువును ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు సత్యారెడ్డి తెలిపారు. ఇలా సేంద్రియ వ్యవసాయం, ఆరుతడి పంటలతో ఎక్కువ లాభాలు అర్జించవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.