
మండే ఎండలతో పగలే కాదు.. రాత్రి పూట కూడా జనాలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. దీంతో చాలామంది రాత్రంతా ఏసీలను ఆన్ చేసి పెడుతున్నారు. అయితే ఉదయం లేవగానే రూమ్ చల్లగా ఉన్నా.. నెల తిరిగేసరికి వచ్చే కరెంట్ బిల్లు చూస్తే మాత్రం గుండె గుభేల్ మంటోంది. కానీ రాత్రంతా ఏసీ నడుస్తున్నా.. మీ విద్యుత్ బిల్లును సగానికి సగం అదుపులో ఉంచుకునే ఒక అద్భుతమైన ఫీచర్ గురించి చాలా మందికి తెలియదు.

ఏంటా ప్రత్యేక ఫీచర్: మనం మాట్లాడుకుంటున్న ఆ మోస్ట్ ప్రాక్టికల్ ఫీచర్ పేరే స్లీప్ మోడ్. మార్కెట్లో దొరికే దాదాపు ప్రతి ఎయిర్ కండిషనర్ మోడల్‌లోనూ ఈ ఆప్షన్ కచ్చితంగా ఉంటుంది. కానీ చాలామంది దీనిని పెద్దగా పట్టించుకోరు. రాత్రి పడుకునే ముందు రిమోట్‌లో ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేయడం ద్వారా.. ఏసీ రాత్రంతా అవసరమైన కూలింగ్‌ను ఇస్తూనే, కరెంట్ వృధాను అడ్డుకుంటుంది. ఫలితంగా భారీ విద్యుత్ బిల్లుల నుండి మనకు ఉపశమనం లభిస్తుంది.

విద్యుత్‌ను ఎలా ఆదా చేస్తుంది: సాధారణంగా ఏసీ ఆన్ చేసి పడుకుంటే.. అది రాత్రంతా ఒకే ఉష్ణోగ్రత వద్ద నిరంతరాయంగా నడుస్తూనే ఉంటుంది. దీనివల్ల కంప్రెసర్‌పై భారం పడి కరెంట్ బిల్లు మోత మోగుతుంది. కానీ మీరు స్లీప్ మోడ్ ఆన్ చేస్తే.. ఏసీ నిరంతరం ఒకేలా పనిచేయదు. గది వాతావరణాన్ని బట్టి ఇది ఉష్ణోగ్రతను క్రమంగా పెంచుకుంటూ పోతుంది. దీనివల్ల కంప్రెసర్‌పై లోడ్ తగ్గి, విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గుతుంది.

స్లీప్ మోడ్ ఎలా పనిచేస్తుంది: ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసినప్పుడు, ఏసీ మొదట గదిని త్వరగా చల్లబరచడానికి నార్మల్ కూలింగ్‌ను అందిస్తుంది. మనం నిద్రలోకి జారుకున్నాక, అర్ధరాత్రి వేళ బయట వాతావరణం కూడా చల్లబడుతుంది కాబట్టి దానికి అనుగుణంగా ఏసీ కంప్రెసర్, ఫ్యాన్ వేగాన్ని ఆటోమేటిక్‌గా తగ్గించుకుంటుంది. దీనివల్ల గదిలో విపరీతమైన చలి పెట్టదు, పైగా ఏసీ నుంచి వచ్చే శబ్దం కూడా తగ్గి నిశబ్దంగా మారుతుంది. దీనికి తోడు మీరు టైమర్ కూడా సెట్ చేసుకుంటే, నిర్దేశిత సమయానికి ఏసీ ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతుంది.

యాక్టివేట్ చేయడం ఎలా: ఈ స్లీప్ మోడ్‌ను ఆన్ చేయడం చాలా ఈజీ. మొదట మీ ఏసీని ఆన్ చేయండి. ఆ తర్వాత మీ ఏసీ రిమోట్ కంట్రోల్‌ను గమనిస్తే.. దానిపై నెలవంక ఆకారంలో ఒక చిన్న ఐకాన్ లేదా నేరుగా Sleep అని రాసి ఉన్న బటన్ కనిపిస్తుంది. ఆ బటన్‌ను నొక్కిన వెంటనే స్లీప్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. దీంతో ఏసీనే ఫ్యాన్ స్పీడ్‌ను, టెంపరేచర్‌ను బ్యాలెన్స్ చేసుకుంటుంది. కాబట్టి ప్రశాంతమైన నిద్రతో పాటు కరెంట్ బిల్లు కూడా ఆదా అవ్వాలంటే ఈ రాత్రి నుంచే మీ ఏసీలో స్లీప్ మోడ్ వాడటం స్టార్ట్ చేయండి.