
క్లీన్ చేయకపోతే?: కూలర్లలో నిల్వ ఉన్న నీరు, తేమ వల్ల బూజు, లీజియోనెల్లా వంటి బ్యాక్టీరియా వృద్ధి చెందుతాయి. కూలర్ ఆన్ చేయగానే వచ్చే దుమ్ము వల్ల ఆస్తమా, బ్రోన్కైటిస్ ఉన్నవారికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. చర్మంపై దద్దుర్లు, కళ్లు ఎర్రబడటం, నిరంతరంగా తుమ్ములు రావడం వంటివి డస్ట్ మైట్స్ వల్ల సంభవిస్తాయి. నీటి ట్యాంక్‌లో బ్యాక్టీరియా చేరడం వల్ల గది అంతా ఒక రకమైన కుళ్లిన వాసన వస్తుంది.

ప్రిపరేషన్ - డస్టింగ్: ముందుగా కూలర్‌ను ఆరుబయట ప్రదేశానికి తరలించండి. ఎలక్ట్రిక్ షాక్ తగలకుండా ప్లగ్ తొలగించండి. బయట ఉన్న దుమ్మును పొడి గుడ్డతో తుడవండి. లోపల పేరుకుపోయిన సాలెగూళ్లు, ధూళిని చిన్న చీపురుతో ఊడ్చివేయండి. కూలర్ గాలి చల్లదనం ప్యాడ్లపైనే ఆధారపడి ఉంటుంది. ప్యాడ్లను జాగ్రత్తగా బయటకు తీసి, ప్రెషర్ ఉన్న నీటితో కడగండి. ఒక బకెట్ నీటిలో రెండు కప్పుల వెనిగర్ లేదా కొంచెం నిమ్మరసం కలిపి, అందులో ప్యాడ్లను 10-15 నిమిషాలు నానబెట్టండి. ఇది మొండిగా ఉన్న బ్యాక్టీరియాను, చెడు వాసనను పూర్తిగా తొలగిస్తుంది.

వాటర్ ట్యాంక్ క్లీనింగ్: ట్యాంక్ అడుగున పేరుకుపోయిన లవణాలు, జిగురును స్క్రబ్బర్‌తో రుద్ది తొలగించండి. అవసరమైతే బ్లీచింగ్ పౌడర్ లేదా డిటర్జెంట్ వాడండి. కడిగిన తర్వాత ట్యాంక్‌ను పూర్తిగా బోర్లించి ఆరబెట్టండి. ఒక్క చుక్క నీరు ఉన్నా మళ్లీ బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. ఫ్యాన్ రెక్కలపై దుమ్ము ఉంటే గాలి వేగం తగ్గుతుంది. కాబట్టి రెక్కలను తడి గుడ్డతో తుడిచి, ఆపై పొడి గుడ్డతో క్లీన్ చేయండి. మోటార్, తిరిగే భాగాలకు కొబ్బరి నూనె లేదా మెషిన్ ఆయిల్ వేయండి. దీనివల్ల ఫ్యాన్ శబ్దం రాకుండా ఉండటమే కాకుండా మోటార్ లైఫ్ పెరుగుతుంది.

కూలింగ్ సామర్థ్యాన్ని పెంచుకోండిలా: కూలర్‌ను మూసి ఉన్న గదిలో కాకుండా కిటికీ దగ్గర ఉంచండి. గాలి బయటకు వెళ్లే మార్గం ఉంటేనే కూలింగ్ ఎక్కువగా ఉంటుంది. ట్యాంక్‌లో ఐస్ ముక్కలు లేదా చల్లని నీరు పోయడం వల్ల గాలి మరింత చల్లగా వస్తుంది. నీరు ప్యాడ్ల మీదకు సరిగ్గా పడుతుందో లేదో ఒకసారి చెక్ చేయండి. పంపు హోల్స్ మూసుకుపోతే పిన్‌తో శుభ్రం చేయండి.

ప్రయోజనాలు ఏంటి: ఫిల్టర్లు శుభ్రంగా ఉంటే గాలి ప్రసరణ బాగుంటుంది, దీనివల్ల కూలింగ్ కెపాసిటీ పెరుగుతుంది. స్వచ్ఛమైన గాలి పీల్చడం వల్ల అలర్జీలు, తుమ్ములు వంటి సమస్యలు రావు. ఫ్యాన్, మోటార్ సజావుగా తిరగడం వల్ల తక్కువ విద్యుత్‌ను వినియోగించుకుంటాయి. చిన్నపాటి జాగ్రత్తలతో మీ పాత ఎయిర్ కూలర్‌ను కొత్తదానిలా మార్చుకోవచ్చు.