
రోజురోజుకూ పెరుగుతున్న టెలికాం మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం.. దేశంలోని సాధారణ పౌరులు ఒక ఐడీపై గరిష్టంగా 9 సిమ్ కార్డులు మాత్రమే తీసుకోవచ్చు. అయితే జమ్మూ-కశ్మీర్, అసోం వంటి ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారికి మాత్రం ఈ లిమిట్ కేవలం 6 సిమ్లకే పరిమితమైంది. కాబట్టి ప్రస్తుతం మీ పేరుపై ఎన్ని సిమ్‌లు యాక్టివ్‌గా ఉన్నాయి.. మీ పేరుతో నకిలీగా నడుస్తున్న నంబర్లను ఎలా బ్లాక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ పేరుపై యాక్టివ్‌గా ఉన్న సిమ్‌కార్డులను తెలుసుకోవడం ఎలా? తరచుగా మనకు తెలియకుండానే లేదా మోసపూరితంగా మన ఐడీపై ఇతరులు కూడా సిమ్ కార్డులు వాడుతుంటారు. దీనివల్ల భవిష్యత్తులో మీరు తీవ్రమైన న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి సమయం ఉండగానే దీనిని తనిఖీ చేసుకోవడం ఎంతో ముఖ్యం.

ఇందుకోసం మీరు ముందుగా ప్రభుత్వం అధికారిక పోర్టల్ అయిన 'సంచార్ సాథీ' (sancharsaathi.gov.in) వెబ్‌సైట్‌కు వెళ్లండి. అక్కడ కనిపించే TAFCOP ఆప్షన్‌ను ఎంచుకుని, మీ మొబైల్ నంబర్ మరియు ఓటీపీ (OTP) నమోదు చేయండి. వెంటనే మీ పేరుపై రిజిస్టర్ అయి ఉన్న అన్ని నంబర్లు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

తెలియని నంబర్ కనిపిస్తే ఏం చేయాలి?: ఆ లిస్ట్‌లో మీరు కొనుగోలు చేయని లేదా ఉపయోగించని నంబర్ ఏదైనా కనిపిస్తే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ నంబర్ పక్కనే ఉండే నాట్ మై నంబర్ (Not My Number) ఆప్షన్‌పై టిక్ చేసి వెంటనే ఆన్లైన్లో మీ ఫిర్యాదును నమోదు చేయవచ్చు. వాళ్లు మీ ఫిర్యాదును స్వీకరించి వెంటనే దానిపై యాక్షన్ తీసుకుంటారు. ఆ నంబర్‌ను బ్లాక్ చేస్తారు.

లిమిట్‌కు మంచి సిమ్‌కార్డులు తీసుకుంటే: నిర్ణీత పరిమితికి మించి సిమ్ కార్డులు కలిగి ఉన్నా లేదా ఇతరుల ఐడీని దుర్వినియోగం చేసినా ప్రభుత్వం, టెలికాం కంపెనీలు కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాయి. కాబట్టి మీరు సేఫ్‌గా ఉండటానికి ఎల్లప్పుడూ మీ గుర్తింపు పత్రాలను సరైన రీతిలోనే వినియోగించండి.