
సేమియా కేసరిని ఎక్కువగా పెళ్లిళ్లు, పండుగలు ఇంకా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు సాధారణంగా తయారుచేసే వంటకం. సులభంగా, తక్కువ సమయంలో తయారుచేయగలిగే ఈ వంటకం సరైన కొలతలు, పద్ధతులు పాటిస్తే అద్భుతమైన రుచిని అందిస్తుంది. పర్ఫెక్ట్ సేమియా కేసరిని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో వివరంగా తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు: సేమియా: 2 గ్లాసులు, నెయ్యి: 4 చెంచాలు, జీడిపప్పు: 4 చెంచాలు, కిస్మిస్: 4 చెంచాలు, పంచదార: 1 1/2 గ్లాసులు యాలకుల పొడి: 10 యాలక్కాయలు దంచి చేసిన పొడి, పచ్చకర్పూరం: 1/4 చెంచా, కుంకుమ పువ్వు: 1/4 చెంచా, నీళ్లు: 4 గ్లాసులు తీసుకోవాలి.

ముందుగా ఒక మందపాటి గిన్నె లేదా కళాయిలో రెండు చెంచాల నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక, జీడిపప్పు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత కిస్మిస్ వేసి ఉబ్బేవరకు వేయించి వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నెయ్యి వేసి, సేమియాను సన్న మంట మీద దోరగా, బంగారు రంగు వచ్చేవరకు నిరంతరం కలుపుతూ వేయించాలి. ఇది సేమియా కేసరికి మంచి రుచి, వాసనను అందిస్తుంది. వేయించిన సేమియాను ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.

సేమియా కొలిచిన అదే గ్లాసుతో నాలుగు గ్లాసుల నీళ్లు తీసుకొని మందపాటి గిన్నెలో బాగా మరిగించాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు, పావు చెంచా కుంకుమ పువ్వు, పావు చెంచా పచ్చకర్పూరం వేయాలి. పచ్చకర్పూరం సేమియా కేసరికి ప్రత్యేకమైన సువాసనను ఇస్తుంది. మరుగుతున్న నీటిలో వేయించి పెట్టుకున్న సేమియాను వేసి బాగా కలపాలి. సేమియాను 60% ఉడికే వరకు నిరంతరం కలుపుతూ ఉండాలి. సేమియా నీటిని పూర్తిగా పీల్చుకొని, మెత్తగా మారే వరకు ఉడికించాలి.

సేమియా 60% ఉడికి నీటిని పీల్చుకున్న తర్వాత, దంచి పెట్టుకున్న యాలకుల పొడి మరియు గ్లాసున్నర పంచదారను కలపాలి. పంచదార కరిగి పాకంలా మారుతుంది. ఈ పాకాన్ని సేమియా పూర్తిగా పీల్చుకునే వరకు, సన్న మంట మీద నిరంతరం కలుపుతూ ఉడికించాలి. ఈ సేమియా అడుగంటకుండా జాగ్రత్త పడాలి. చక్కెర పాకం పూర్తిగా సేమియాలోకి ఇంకిపోయి, కేసరి గట్టిపడిన తర్వాత, ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసి బాగా కలపాలి.ఈ కేసరిని స్టవ్ మీద నుండి దించి, ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.