
India T20I Captain: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో టీమిండియా వరుస పరాజయాలతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీవ్ర అసంతృప్తితో ఉంది. కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంపై సమీక్ష మొదలైంది. ఒకవేళ శ్రేయస్‌పై వేటు పడితే, తదుపరి టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే సత్తా ఉన్న ముగ్గురు ఆటగాళ్ల గురించి ఇప్పుడు క్రీడా వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

ప్రమాదంలో శ్రేయస్ అయ్యర్ కుర్చీ..: ఇటీవల ముగిసిన ఐర్లాండ్ పర్యటనలో 0-2 తేడాతో సిరీస్ కోల్పోయిన భారత జట్టు, ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ అదే తడబాటును కొనసాగిస్తోంది. తొలి నాలుగు మ్యాచ్‌లలో ఏకంగా మూడింటిలో ఓటమి పాలవ్వడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ పేలవ ప్రదర్శన నేపథ్యంలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, సహాయక సిబ్బంది పనితీరును బీసీసీఐ నిశితంగా పరిశీలిస్తోంది. జట్టు వైఫల్యాలు ఇలాగే కొనసాగితే శ్రేయస్ అయ్యర్ నాయకత్వంపై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ బీసీసీఐ నాయకత్వ మార్పునకు మొగ్గు చూపితే, దేశవాళీ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లో అద్భుతమైన రికార్డు ఉన్న ఈ ముగ్గురిలో ఒకరికి అవకాశం దక్కవచ్చు.

ఇషాన్ కిషన్: దేశవాళీలో తిరుగులేని రికార్డు..: శ్రేయస్ అయ్యర్ స్థానాన్ని భర్తీ చేయగల మొదటి పేరు ఇషాన్ కిషన్. జార్ఖండ్‌కు చెందిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన నాయకత్వ అనుభవాన్ని గడించాడు. 2025-26 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్‌కు తొలి టైటిల్ అందించడమే కాకుండా, 200 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 517 పరుగులు సాధించి బ్యాట్ తోనూ ముందుండి నడిపించాడు. ఐపీఎల్ 2026లో పాట్ కమిన్స్ గాయపడినప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ పగ్గాలు చేపట్టిన ఇషాన్, ఏడు మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించి నాలుగింటిలో విజయం సాధించాడు. జార్ఖండ్ కెప్టెన్‌గా అన్ని ఫార్మాట్లలో కలిపి 29 మ్యాచ్‌లకు గాను 23 విజయాలతో అతడి గెలుపు శాతం 79.31 గా ఉండటం విశేషం.

రజత్ పాటిదార్: ఐపీఎల్ సంచలనం..: ప్రస్తుతం టీ20 జట్టులో లేకపోయినప్పటికీ, రజత్ పాటిదార్ పేరు కెప్టెన్సీ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. మిడిల్ ఆర్డర్‌లో భారత బ్యాటింగ్ ఇబ్బంది పడుతుండటం, వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఫామ్ కోల్పోవడం పాటిదార్‌కు కలిసొచ్చే అంశం. ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పగ్గాలు చేపట్టిన అతను, ఆ జట్టుకు అందని ద్రాక్షలా ఉన్న తొలి టైటిల్ ను అందించాడు. అంతేకాదు, ఐపీఎల్ 2026లోనూ విజయవంతంగా నడిపించి వరుసగా రెండో కప్పు సాధించి పెట్టాడు. ఆర్సీబీ కెప్టెన్‌గా 28 మ్యాచ్‌లలో 20 విజయాలు నమోదు చేసి (71.42 గెలుపు శాతం), తన నాయకత్వ లక్షణాలను ఎప్పుడో నిరూపించుకున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్‌ను ప్రక్షాళన చేయాలని సెలెక్టర్లు భావిస్తే పాటిదార్ బెస్ట్ ఆప్షన్.

హార్దిక్ పాండ్యా: ఫిట్‌నెస్ సాధిస్తే కింగే..: గాయాల నుంచి కోలుకుని పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే టీ20 కెప్టెన్సీ రేసులో హార్దిక్ పాండ్యా మళ్లీ ముందంజలో ఉంటాడు. 2026 టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆడిన తర్వాత ఐపీఎల్ 2026లో గాయపడిన అతను, ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో చికిత్స పొందుతున్నాడు. భారత టీ20 జట్టుకు 16 మ్యాచ్‌లలో నాయకత్వం వహించిన హార్దిక్, 10 మ్యాచ్‌లలో విజయం సాధించి 62.5 శాతం విజయాల రికార్డును కలిగి ఉన్నాడు. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు టైటిల్ అందించిన అపారమైన అనుభవం కూడా అతనికి అదనపు బలం.