
ఈ రోజుల్లో ఆమ్లత్వం, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలు సర్వసాధారణంగా అయిపోయావు. సాధారణంగా ఎక్కువ కారంగా ఉండే ఆహారాలు తినడం లేదా అతిగా తినడం వల్ల ఈ సమస్య వస్తుంది. అయితే ఎల్లప్పుడూ ఈ సమస్యకు ఇదే కారణం కాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో, కడుపులో ఆమ్లం తగ్గడం కూడా దీనికి కారణం కావచ్చు. అంటే మీ కడుపులో ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ ఆమ్లం సాధారణం కంటే తక్కువగా ఉంటే ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.

ఈ ఆమ్లం ప్రోటీన్లను జీర్ణం చేయడంలో, అవసరమైన పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. కానీ వృద్ధాప్యం, యాంటాసిడ్ మందుల దీర్ఘకాలిక ఉపయోగం, అధిక ఒత్తిడి, పోషక లోపాలు, జింక్ లేదా విటమిన్ బి12 లోపం, ఆహారపు అలవాట్లు కడుపులో ఆమ్ల స్థాయిలు తగ్గడానికి కారణం అవుతాయి. కడుపు తగినంత ఆమ్లాన్ని ఉత్పత్తి చేయనప్పుడు, జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుంది. అలాగే శరీరం అవసరమైన పోషకాలను గ్రహించడంలో ఇబ్బంది పడవచ్చు. ఈ పరిస్థితి క్రమంగా అనేక జీర్ణ లక్షణాలకు దారితీస్తుంది.

కడుపులో ఆమ్ల పరిమాణం తగ్గినప్పుడు, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవచ్చు. పాక్షికంగా జీర్ణమైన ఆహారం ఎక్కువసేపు కడుపులోనే ఉండిపోతుంది, దీనివల్ల గ్యాస్ ఏర్పడి కడుపులో ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల ఛాతీలో మంట, పుల్లని త్రేనుపు, గొంతులో చికాకు వంటి సమస్యలు వస్తాయి. సాధారణంగా, ఈ సమస్య చాలా కాలం పాటు కొనసాగితే, అది కడుపులో అసౌకర్యానికి దారితీస్తుంది.

కడుపులో ఆమ్లత్వం తక్కువగా ఉండటం ఒక్కటే అసిడిటీకి కారణం కాదు. కొన్ని సమయాల్లో తినడం, టీ, కాఫీ లేదా కార్బోనేటేడ్ పానీయాలు ఎక్కువగా తాగడం, వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం, నిరంతరం ఒత్తిడి కూడా ఈ సమస్యను పెంచుతుంది. అలాగే, ఎక్కువసేపు ఆకలితో ఉండటం లేదా అకస్మాత్తుగా ఎక్కువగా తినడం కడుపుపై ప్రభావం చూపుతుంది. ధూమపానం, మద్యం సేవించడం జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది. కొన్ని మందుల దుష్ప్రభావాలు, హార్మోన్ల మార్పులు కూడా అసిడిటీని పెంచుతాయి.

అసిడిటీ సమస్యను ఎలా నివారించాలి? ఈ సమస్యను నివారించడానికి, క్రమం తప్పకుండా సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఒకేసారి ఎక్కువగా తినకుండా కొద్దిగా తినడం మంచిది. అలాగే ప్రాసెస్ చేసినా ఆహారాలు తినడం ఆపేయండి. తిన్న వెంటనే పడుకోకుండా, తిన్న తర్వాత కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేయండి. అలాగే ఒత్తిడిని తగ్గించడానికి పుష్కలంగా నీరు త్రాగండి. యోగా లేదా ధ్యానం సాధన చేయండి. ఇలా క్రమం తప్పకుండా చేయడం ద్వారా మీరు ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.