
వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి ఏసీ వాడకం అనివార్యమైనప్పటికీ, విద్యుత్ బిల్లుల లెక్కలు తెలుసుకోవడం ప్రతి వినియోగదారునికి అవసరం. ముఖ్యంగా 1.5 టన్ ఏసీని రోజుకు 8 గంటల పాటు వాడితే అయ్యే ఖర్చు.. కొత్త, పాత టెక్నాలజీల మధ్య ఉన్న వ్యత్యాసాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

గది పరిమాణాన్ని బట్టి ఏసీని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇన్వర్టర్ టెక్నాలజీ, 5-స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలు విద్యుత్ ఆదా చేయడంలో మెరుగ్గా పనిచేస్తాయి. ఉదాహరణకు, ఒక ఆధునిక 1.5 టన్ ఇన్వర్టర్ ఏసీని రోజుకు 8 గంటలు వాడితే, అది సగటున రోజుకు 3 నుంచి 5 యూనిట్ల విద్యుత్తును మాత్రమే వినియోగిస్తుంది. ఇన్వర్టర్ ఏసీలు గది చల్లబడిన తర్వాత తక్కువ శక్తితో పనిచేయడమే దీనికి కారణం.

కొత్త టెక్నాలజీ గల 1.5 టన్ ఏసీని రోజుకు 8 గంటల చొప్పున నెలకు వాడితే, సుమారు 120 నుంచి 150 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. మీ ప్రాంతంలోని యూనిట్ ధరను బట్టి ఇది బిల్లులో అదనపు భారంగా మారుతుంది.

అయితే, పాత టెక్నాలజీ ఏసీలు(నాన్-ఇన్వర్టర్) వాడితే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇవి గంటకు 2 నుంచి 2.5 యూనిట్ల వరకు విద్యుత్తును తీసుకుంటాయి. అంటే ఇవి రోజుకు దాదాపు 20 యూనిట్లు, అంటే నెలకు 600 యూనిట్ల వరకు విద్యుత్తును వాడే అవకాశం ఉంది. ఇది కొత్త ఏసీలతో పోలిస్తే నాలుగు రెట్లు అధికం.

ఏసీ కొనేముందే దాని స్టార్ రేటింగ్, అది ఏడాదికి ఎన్ని యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తుందో తెలిపే లేబుల్‌ను గమనించాలి. తక్కువ విద్యుత్ వినియోగించే మోడళ్లను ఎంచుకోవడం ద్వారా దీర్ఘకాలంలో భారీ కరెంటు బిల్లుల నుంచి తప్పించుకోవచ్చు. సరైన నిర్వహణ, సరైన ఉష్ణోగ్రత (24-25 డిగ్రీలు) వద్ద ఏసీని వాడటం వల్ల బిల్లును మరింత తగ్గించుకోవచ్చు.