
ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండటం అనేది ప్రతీఒక్కరికీ తప్పనిసరిగా మారింది. రోజువారీ లావాదేవీలు నిర్వహించుకునేందుకు, ప్రభుత్వ సంక్షేమ పథకాల నగదు, సబ్సిడీలు పొందేందుకు బ్యాంక్ ఖాతా తప్పనిసరి అయింది. ఇప్పటి రోజుల్లో బ్యాంక్ అకౌంట్ లేనివారంటూ ఎవరూ ఉండటం లేదు. పిల్లల నుంచి పెద్దవారివరకు అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది.

అయితే బ్యాంక్ ఖాతాదారుడు మరణిస్తే అకౌంట్లోని బ్యాలెన్స్ ఏమవుతుందనే డౌట్ చాలామందికి ఉంటుంది. ఖాతాదారుడు మరణిస్తే అకౌంట్లో సొమ్ము అలాగే ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పు. ఖాతాదారుడి అకౌంట్లోని నగదును కుటుంబసభ్యులు లేదా నామినీ విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ ప్రక్రియను సులభతరం చేసినట్లు ఆర్బీఐ తాజాగా ప్రకటించింది.

కుటుంబసభ్యులు లేదా నామినీలు క్లెయిమ్ పొందేందుకు ఒక నిర్ధిష్ట కాలపరిమితి కూడా నిర్ణయించింది. ఈ ప్రక్రియను మరింత సులభతరం చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇలాంటి క్లెయిమ్స్‌కు సంబంధించి తాజాగా ఆర్బీఐ విడుదల చేసిన ప్రకటనలో ఏముందో చూద్దాం.

3 సులభమైన దశల్లో కుటుంబసభ్యులు లేదా నిమినీలు మరణించిన ఖాతాదారుడు అకౌంట్లోని డబ్బులను క్లెయిమ్ చేసుకోవచ్చు. ముందుగా మీ బ్యాంకు శాఖను లేదా వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అనంతరం క్లెయిమ్ ఫారమ్‌ను పూర్తి చేయాలి. అవసరమైన అన్ని పత్రాలతో ఫారమ్‌ను సమర్పిస్తే సరిపోతుంది. అనంతరం సిబ్బంది పరిశీలించి ఖాతాదారుడి అకౌంట్లోని సొమ్ము మీకు అందిస్తారు.

15 క్యాలెండర్ రోజుల్లోపు క్లెయిమ్ పరిష్కారం చేయాలని ఆర్బీఐ కాలపరిమితి కూడా నిర్ణయించింది. ఖాతాదారుడు నామినీ/నామినీలు పొందుపర్చి ఉంటే క్లెయిమ్ ప్రక్రియ మరింత వేగంగా, సులభంగా జరుగుతుందని ఆర్బీఐ సూచించింది. ఖాతాదారులు తప్పనిసరిగా బ్యాంకు ఖాతాలో నామినీ వివరాలను అప్డేట్ చేసుకోవాలని సూచించింది.