
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రైతులు తమ పంటల కోసం ఉపపయోగించే ఎరువులపై సబ్సిడీ అందించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. నవంబర్ 11వ తేదీన ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎరువుల సబ్సిడీకి ఆమోదం తెలిపారు. అక్టోబర్ 1,2026 నుంచి మార్చి 31,2027 వరకు ఈ సబ్సిడీ రేట్లు అమల్లో ఉంటాయి.

ఎరువుల సబ్సిడీ ధరల పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.62,370.02 కోట్లు కేటాయించింది. అలాగే రబీ సీజన్ కోసం రూ.37,952.29 కోట్లు కేటాయింపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దీని వల్ల దేశవ్యాప్తంగా రైతులకు భారీ ప్రయోజనం చేకూరనుంది. రైతులపై ఎరువుల భారం తగ్గడం వల్ల డబ్బులు ఆదా అవుతాయి. 2026-27 రబీ సీజన్‌కు సంబంధించి ఫాస్ఫేటిక్, పొటాషిక్ ఎరువులపై న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ రేట్లను ఈ మేరకు కేబినెట్ ఆమోదించింది.

గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ఎరువుల సబ్సిడీకి అదనంగా రూ.24,417.73 కోట్లు కేటాయించారు. ఎరువుల ధరలు రైతులకు భారం కాకూడదనే ఉద్దేశంతో కేంద్రం బడ్జెట్ పెంచింది. అంతర్జాతీయంగా ఎరువుల ధరల్లో మార్పులు, ముడి సరుకు ధరల్లో మార్పులను పరిగణలోకి తీసుకుని కేటాయింపులు పెంచింది. ఇది దేశంలోని రైతులందరూ సబ్సిడీతో కూడిన ఎరువులు పొందేందుకు ఉపయోగపడుతుంది.

2026-27 రబీ సీజన్లో DAP, NPKS, ఇతర P&K ఎరువులకు ప్రభుత్వం ఆమోదించిన రేట్ల ప్రకారం సబ్సిడీ ధరలు అందనున్నాయి. ఎరువు సరఫరా పెంచడం, సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూసుకోవడం, తక్కువ ధరకే రైతులు ఎరువులు పొందేలా చూడటం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం 28 రకాల ఎరువులపై సబ్సిడీ అమలు చేస్తోంది.

2010 నుంచి ఎరువులపై సబ్సిడీలు కొనసాగుతుననాయి. ఎరువుల్లో ఉండే పోషక పదార్థాల ఆధారంగా సబ్సిడీ ధరలు కేంద్రం ఫిక్స్ చేస్తోంది. వీటి ప్రకారం కంపెనీలకు సబ్సిడీ చెల్లింపులు చేస్తోంది. దీని వల్ల కంపెనీలు తక్కువ ధరకే రైతులకు ఎరువులు అందిస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం కంపెనీలకు సబ్సిడీ సొమ్ము అందుతుంది.