
సామాన్య, మధ్యతరగతి ప్రజలకు మరో షాక్ తగిలింది. నిత్యవసరాల ధరలు ఆకాశానంటున్న వేళ మరో పిడుగు పడింది. పాల ధరలు కూడా దేశవ్యాప్తంగా మరోసారి పెరిగాయి. ప్రముఖ డెయిరీ సంస్థ మదర్ డెయిరీ, అమూల్ పాల ధరలను మరోసారి పెంచుతున్నట్లు ప్రకటన చేశాయి. ప్రతీ ఇంట్లో రోజూ పాలు తప్పనిసరిగా ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు ధరలు పెరగడం వల్ల పాల వినియోగదారులకు భారీ షాక్ తగిలినట్లయింది.

పాల ధరలను అమాంతం పెంచుతూ అమూల్, మదర్ డెయిరీ సంస్థలు ఇవాళ కీలక నిర్ణయం తీసున్నాయి. పెరిగిన కొత్త ధరలు నవంబర్ 12వ తేదీ నుంచే అమల్లోకి రానున్నాయి. దీంతో సామాన్యుడి నెలవారీ బడ్జెట్‌పై అదనపు భారం పడనుంది. మదర్ డెయిరీ లీటర్ పాలపై రెండు రూపాయల నుంచి నాలుగు రూపాయల వరకు ధరలను పెంచినట్లు ప్రకటించింది.

ఈ తాజా పెంపుతో ఫుల్ క్రీమ్ మిల్క్ లీటర్ ధర రూ.72 నుండి రూ.76కు చేరుకుంది. ఆవు పాలపై మూడు రూపాయలు పెరగడంతో లీటర్ ధర రూ.65కి చేరుకుంది. ఇక టోన్డ్, డబుల్ టోన్డ్ పాలపై రెండు రూపాయల చొప్పున ధర పెరిగింది. ఈ ఏడాదిలో మదర్ డెయిరీ పాల ధరలను పెంచడం ఇది రెండోసారిగా చెప్పవచ్చు.

అటు అమూల్ సంస్థ కూడా మరోసారి పాల ధరలను పెంచింది. లీటర్ పాలపై రూ.2 నుంచి రూ.4 వరకు పెంచింది. టోన్డ్ మిల్క్‌పై రూ. 2, ఫుల్ క్రీమ్ మిల్క్‌పై రూ. 4 పెంచింది అమూల్ సంస్థ. రేపటి నుంచి వీటిని అమల్లోకి తీసుకురానుందని ప్రకటించింది. పశుగ్రాసం ధరలు, ప్యాకేజింగ్, ఫ్యూయెల్ చార్జీలు పెరగడమే ధరల పెంపునకు కారణమని ప్రకటన జారీ చేసింది.

పాడి రైతుల వద్ద పాల సేకరణ ఖర్చులు భారీగా పెరగడం వల్లే ధరలు పెంచాల్సి వచ్చిందని తెలిపింది. పాల ధరల పెంపుతో కేవలం పాల ప్యాకెట్ల ఖర్చు మాత్రమే కాకుండా పెరుగు, నెయ్యి, స్వీట్లు, టీ, కాఫీల ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మదర్ డెయిరీ, అమూల్ బాటలోనే ఇతర ప్రైవేట్ డెయిరీలు కూడా ధరలను పెంచే అవకాశముంది. దీంతో వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.