CONGRESS FOCUS: రాష్ట్రపతి ఎన్నికల కంటే కాంగ్రెస్ పార్టీకి అదే ముఖ్యం.. అందుకే తెరమీదికి శరద్ పవర్ పేరు.. ఆయన తిరస్కారంతో తికమక

| Edited By: Team Veegam

Jun 17, 2022 | 1:34 PM

నిజానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఎప్పుడో వెనక్కి తగ్గింది.  అయితే ఆ అంశాన్ని ఓపెన్‌గా కాంగ్రెస్ పెద్దలు వ్యక్తం చేయలేరు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ప్రియారిటీ కాదు. కానీ రాష్ట్రపతి ఎన్నికలు ఆ పార్టీకీ రాజకీయంగా...

CONGRESS FOCUS: రాష్ట్రపతి ఎన్నికల కంటే కాంగ్రెస్ పార్టీకి అదే ముఖ్యం.. అందుకే తెరమీదికి శరద్ పవర్ పేరు.. ఆయన తిరస్కారంతో తికమక
Soniya
Follow us on

CONGRESS PARTY FOCUS IS NOT ON PRESIDENT POLLS BUT ON ANOTHER ISSUE:  దేశంలో అత్యున్నత పదవికి ఎన్నికలు జరుగుతున్న సందర్భమిది. తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి అవసరమైన మేజిక్ ఫిగర్‌కి అధికార ఎన్డీయే కూటమి కాసింత దూరంలో వుంది. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి జూన్ 15వ తేదీన నోటిఫికేషన్ జారీ అయ్యింది. నామినేషన్ల పర్వం మొదలైంది. జూన్ 29వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ప్రెసిడెన్షియల్ ఎలక్టోరల్ కాలేజీ (PRESIDENTIAL ELECTORAL COLLEGE)లో మొత్త్ 10 లక్షల 89 వేల వాల్యూ కలిగిన ఓట్లు వుండగా.. అందులో 48.9 శాతం మేరకు బీజేపీ (BJP) సారథ్యంలోని ఎన్డీయే (NDA) కూటమికి బలముంది. మేజిక్ మార్క్ 51 శాతం కాగా.. కేవలం 1.2 శాతం ఓట్ల వాల్యూ మేరకు మద్దతు కూడగట్టగలిగితే విపక్షాలు ఎన్ని ఎత్తులు వేసినా ఎన్డీయే అభ్యర్థిని గెలవకుండా అడ్డుకోలేరు. కాంగ్రెస్ పార్టీ (CONGRESS PARTY)కి దూరంగా, బీజేపీకి కాసింత దగ్గరగా వున్న వైసీపీ (YCP), అన్నా డిఎంకే (ANNA DMK) పార్టీల మద్దతు కూడగట్టగలిగితే ఎన్డీయే అభ్యర్థి గట్టెక్కడం సులభమే. మరోవైపు న్యూట్రల్‌గా వుండే బీజూ జనతాదళ్ (BIJU JANATADAL) కూడా వుంది.  వైసీపీ, బీజేడీ, అన్నా డిఎంకే పార్టీలు విపక్ష కూటమికి దూరంగానే వున్నాయి. టీఆర్ఎస్ పార్టీ (TRS PARTY) కూడా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ లేకుంటేనే రంగంలోకి దిగుతుందన్నది కూడా తేలిపోయింది. బహుశా ఇది బోధపడే రాజకీయ దిగ్గజం శరద్ పవార్ రాష్ట్రపతి అభ్యర్థిగా తానుండబోనని మమతకు, వామపక్షాలకు తేల్చి చెప్పేశారు. అయినా పోయిరావలె హస్తినకు అన్న రీతిలో తాను ఏకపక్షంగా నిర్ణయించిన కాన్స్టిట్యూషన్ క్లబ్ భేటీని నిర్వహించేందుకే దీదీ మొగ్గుచూపారు. దీదీ ఏకపక్ష ధోరణిపై లోలోపల మండిపోతున్నా వామపక్షాలకు మరో దారి, గత్యంతరం లేక దీదీ నిర్వహించ తలపెట్టిన భేటీకి తమ తరపున ఎంపీలను పంపారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర అన్న తమ ప్రతిపాదనకు మమత పెద్దగా ప్రాధాన్యమివ్వకుండా.. భేటీకి కాంగ్రెస్ పార్టీని కూడా ఆహ్వానించిన దరిమిలా టీఆర్ఎస్ తరపున ఎవరినీ పంపకూడదని కేసీఆర్ నిర్ణయించారు. అంటే భేటీకి ముందే విపక్షాల మధ్య బలమైన సయోధ్య లేదని తేలిపోయింది.

నిజానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఎప్పుడో వెనక్కి తగ్గింది.  అయితే ఆ అంశాన్ని ఓపెన్‌గా కాంగ్రెస్ పెద్దలు వ్యక్తం చేయలేరు. రాష్ట్రపతి (PRESIDENT) ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ప్రియారిటీ కాదు. కానీ రాష్ట్రపతి ఎన్నికలు ఆ పార్టీకీ రాజకీయంగా ఉపయోగపడాలి. అందుకే శరద్ పవార్ (SHARAD PAWAR) పేరు తెరమీదికి తెస్తే యుపీఏకు కాస్త దూరం పాటిస్తున్న పార్టీలు చేరతాయనే పాచిక విసిరింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. అయితే.. కాంగ్రెస్ అధిష్టానానికి శరద్ పవార్ షాకిచ్చారు. ఎలాగో ఓడిపోయే ఎన్నికలో తాను పోటీ చేయడమేంటన్నది ఆయన వెర్షన్. తమ అధినేత రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి విముఖం అని ఎన్సీపీ (NCP) జూన్ 14న వెల్లడించింది. ఇదే అంశాన్ని సీపీఎం (CPM) అగ్రనేత సీతారం ఏచూరి (SITARAM YECHURI) కూడా ధృవీకరించారు. దాంతో గోపాలకృష్ణ గాంధీ (GOPALAKRISHNA GANDHI) పేరును తెరమీదికి తెచ్చారు. ఈయన 2017లో ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య నాయుడి (VENKAIAH NAIDU) మీద పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మహాత్మా గాంధీ (MAHATMA GANDHI), డా.సి.రాజగోపాలాచారి (Dr C RAJAGOPALACHARY)ల మనవడైన గోపాలకృష్ణ గాంధీ గతంలో పశ్చిమ బెంగాల్ (WEST BENGAL) గవర్నర్‌గా పని చేశారు. తాజాగా ఆయన్ని విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా తెరమీదకి తెచ్చారు. విపక్షాల ప్రతిపాదనపై నిర్ణయం తీసుకునేందుకు తనకు కాస్త సమయం కావాలని గోపాలకృష్ణ గాంధీ కోరినట్లు తెలుస్తోంది. మాజీ గవర్నర్ జనరల్ డాక్టర్ సీ.రాజగోపాలాచారి కూతురు లక్ష్మి, మహాత్మా గాంధీ తనయుడు దేవిదాస్ గాంధీల తనయుడే గోపాలకృష్ణ గాంధీ. అయితే, ఆయన అభ్యర్థిత్వానికి ఎన్ని పార్టీలు ఓకే అంటాయో తెలియడం లేదు. జూన్ 15 ఢిల్లీ భేటీ తర్వాత విపక్ష పార్టీల కూటమి తరపున తెరమీదికి వచ్చిన మరో పేరు ఫరూఖ్ అబ్దుల్లా (FAROOQ ABDULLA). నేషనల్ కాన్ఫరెన్సు అధినేత. కశ్మీర్‌కు చెందిన వారు.  మరో భేటీ తర్వాత వీరిద్దరిలో ఒకరిని విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఖరారు చేస్తారని తెలుస్తోంది. ఇక మమతా బెనర్జీ (MAMATA BANERJEE)పై కొన్ని పార్టీలు గుర్రుగా వున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముందుగా ఓ అభ్యర్థిని ఎంపిక చేసి.. లేదా ఓ రెండు పేర్లను అనుకుని వాటిపై వివిధ పార్టీలతో వ్యక్తిగత సమాలోచనల ద్వారా ఏకాభిప్రాయం సాధించి ఆ తర్వాత భేటీ నిర్వహించి అందరిచే ఓకే అనిపించుకోవాల్సింది పోయి.. ముందుగా తానే ఏకపక్షంగా ఓ తేదీ అనుకుని.. దానికి అందరూ రావాలంటూ తన ఒంటెద్దు పోకడను మమతా బెనర్జీ చాటుకున్నారని కొన్ని పార్టీలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నాయి. దాదాపు ఇదే అభిప్రాయంతో తెలంగాణ రాష్ట్ర సమితి (TELANGANA RASHTRA SAMITI) నేతలున్నా.. పైకి మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలతో డయాస్ షేర్ చేసుకోవడం ఇష్టం లేకనే దీదీ నిర్వహించిన భేటీకి దూరంగా వున్నామని అంటున్నారు. అయితే దీదీ నిర్వహించిన సమావేశం ఎటూ తేల్చకుండానే ముగిసింది. ఏకాభిప్రాయం సాధించకుండానే సమావేశాన్ని ముగించారు. పోటీ చేసేందుకు శరద్ పవార్‌ని ఒప్పించేందుకే మమతా బెనర్జీ, కాంగ్రెస్ నేతలు విఫల యత్నం చేశారు. ఆయన ససేమిరా అనడంతో ప్రత్యామ్నాయంగా గాంధీ, ఫరూఖ్ అబ్దుల్లా పేర్లను దీదీ తెరమీదికి తెచ్చారు. అన్ని పార్టీలతో సంప్రదింపులు కొనసాగించేందుకు ముగ్గురికి అంటే మమత బెనర్జీ, శరద్ పవార్, మల్లికార్జున ఖర్గేలకు అప్పగించారు.  అయితే.. ఈ సమావేశంలో మరో ఆసక్తికరమైన అంశం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ తీర్మానాన్ని ఉన్నట్లుండి దీదీ ప్రతిపాదించడంతో కొన్ని పార్టీలు అభ్యంతరం తెలిపాయి. ఎజెండాలో లేని అంశాన్ని ఉన్నట్లుండి ప్రస్తావించి.. మమ్మల్ని ఇబ్బందికి గురిచేశారంటూ మమతపై వారు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఇక గతంలో దళిత నేత, బీజేపీలో మితవాదిగా పేరున్న రామ్‌నాథ్ కోవింద్‌ (RAMNATH KOVIND)కు అవకాశమిచ్చిన బీజేపీ.. ఈసారి గిరిజన, మహిళ నేతకు రాష్ట్రపతిగా ఛాన్సివ్వాలని భావిస్తున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము (DROUPADI MURMU) అభ్యర్థుల ఎంపిక అంశం రహస్యంగా కొనసాగుతున్నా.. ఏకాభిప్రాయ సాధన బాధ్యతలను మాత్రం రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (RAJNATH SINGH), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP NADDA)కు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (PRIME MINISTER NARENDRA MODI) అప్పగించారు. కాంగ్రెస్ సహా విపక్షాలన్నింటినీ ఓసారి ఏకాభిప్రాయ సాధనకు ఒప్పించేలా తద్వారా రాష్ట్రపతి ఎన్నికలను ఏకగ్రీవం చేసేలా కీలక బాధ్యతలను మోదీ వారిద్దరికి అప్పగించారు. మోదీ ఆదేశాల మేరకు రాజ్‌నాథ్ సింగ్ .. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేతో భేటీ కూడా అయ్యారు. అయితే ఏకగ్రీవం ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికల పేరుతో యుపీఏ లేని విపక్షాలను కూడగట్టడం కాంగ్రెస్ పార్టీ వ్యూహం. అందుకే కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్రపతి అభ్యర్థిని పెట్టకుండా శరద్ పవార్ పేరును ఆ పార్టీ తెరమీదికి తెచ్చింది. కానీ ఆయన హ్యాండివ్వడంతో ఇపుడు మమత మార్గదర్శకత్వానికి ఓకే చెప్పడం మినహా కాంగ్రెస్ పార్టీ ముందు ఏ అవకాశమూ లేదు. ఎందుకంటే ఆ పార్టీకి 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి మరిన్ని పార్టీలను యుపీఏలోకి తెచ్చుకోవడం అత్యంత అవసరం. లేకపోతే.. వరుసగా మూడోసారి ఓడిపోతే పార్టీ మనుగడే ప్రశ్నార్థకంలో పడిపోతుందనేది కాంగ్రెస్ అధినేతల మనో వేదన. ఆ దుస్థితి రావద్దు అంటే యుపీఏలోకి మరిన్ని బీజేపీని వ్యతిరేకించే పార్టీలు రావాలి. రాష్ట్రపతి ఎన్నికల కంటే యుపీఏ బలోపేతమే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమైన అంశమిపుడు.