CONGRESS PARTY: అధ్యక్ష బాధ్యతలకు రాహుల్ విముఖం? మరింత చురుకుగా ప్రియాంక వధేరా.. యువరాజు వ్యూహం తెలిస్తే షాకే!

|

Aug 23, 2022 | 4:22 PM

ఆయన అలా... ఆమె ఇలా.. మరి కాంగ్రెస్ పార్టీకి సారథి ఎవరు ? రాహుల్ కాకపోతే మరి ఇంకెవరు ? అసలు రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు ఎందుకు విముఖత ప్రదర్శిస్తున్నారు ? ఇలాంటి చర్చలు సహజంగానే ఊపందుకున్నాయి.

CONGRESS PARTY: అధ్యక్ష బాధ్యతలకు రాహుల్ విముఖం? మరింత చురుకుగా ప్రియాంక వధేరా.. యువరాజు వ్యూహం తెలిస్తే షాకే!
Congress
Follow us on

CONGRESS PARTY PRESIDENT POST ELECTION PROCESS STARTS: ఆయన అలా… ఆమె ఇలా.. మరి కాంగ్రెస్ పార్టీకి సారథి ఎవరు ? 2019 సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి రాహుల్ గాంధీ (Rahul Gandhi) తప్పుకున్నప్పటి నుంచి ఆ పార్టీలో నాయకత్వ లేమి కనిపిస్తోంది. సోనియాగాంధీ (Sonia Gandhi) చిరకాలంగా పార్టీని నడిపిస్తున్నప్పటికీ గత ఎనిమిదేళ్ళుగా ఆమె అంతగా యాక్టివ్‌గా వుండలేకపోతున్నారు. దీనికి వరుస పరాజయాలు కారణం కావచ్చు. లేదా ఆమె ఆరోగ్యం కారణం కావచ్చు. వారసత్వ బాధ్యతల్లో  భాగంగా రాహుల్ గాంధీ ఏఐసీసీ (AICC) అధ్యక్షులయ్యారు.  అయితే, ఆయన బాధ్యతలు చేపట్టిన వేళావిశేషం బాగా లేదనే చెప్పాలి. రంగంలోకి దిగిన తొలి ఎన్నికల నుంచి ఆయన సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగిన విజయం సాధించిందే లేదు. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ పరాజయాల పరంపరను దశాబ్ధకాలానికిపైగా కొనసాగించిన ఘనత రాహుల్ గాంధీదే అని చెప్పాలి. తాను తొలిసారి పూర్తి బాధ్యతలు తీసుకున్న 2012 యుపీ అసెంబ్లీ (UP Assembly) ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్ పార్టీ పరాజయాల పరంపర పదేళ్ళుగా కొనసాగుతూనే వుంది. మొన్నటి యుపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం రెండంటే రెండు అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. దాంతో పార్టీకి అసలు పునర్వైభవం సాధ్యమేనా అన్న సందేహం పార్టీవర్గాల్లోనే ప్రబలంగా వినిపిస్తోంది. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు పలువురు వీర విధేయ కాంగ్రెస్ నేతలు. తాజాగా ఏఐసీసీ అధ్యక్ష స్థానానికి ఎన్నికల ప్రహసనం మొదలైంది. ఆగస్టు 21వ నుంచి సెప్టెంబర్ 20వ తేదీ దాకా ఈ ఎన్నికల ప్రహసనం కొనసాగబోతోంది. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షున్ని ఎన్నుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఇపుడు తలెత్తింది. ఈక్రమంలోనే గత వారం రోజుల వ్యవధిలో పలువురు సీనియర్ నేతలు రాహుల్ గాంధీనే పార్టీ పగ్గాలు చేపడితే బావుంటుందన్న అభిప్రాయంతో ఆయన్ను కలుస్తూ వస్తున్నారు.  అయితే ఈ సీనియర్ల అభ్యర్థనలను రాహుల్ తోసిపుచ్చుతున్నారని మీడియాలో ఓ వర్గం రాస్తోంది. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ విముఖత ప్రదర్శిస్తున్నారన్నది ఈ మీడియా కథనాలు సారాంశం.  రాహుల్ కాకపోతే మరి ఇంకెవరు ? అసలు రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు ఎందుకు విముఖత ప్రదర్శిస్తున్నారు ? ఇలాంటి చర్చలు సహజంగానే ఊపందుకున్నాయి.

నిజానికి ఆరు నెలల క్రితం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ (Prashant Kishore)ను కాంగ్రెస్ పార్టీ హయిర్ చేసిందన్న కథనాలు వచ్చాయి. వాటికి అనుగుణంగానే ప్రశాంత్ కిశోర్.. పదిహేను రోజుల వ్యవధిలో పలుమార్లు అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. పార్టీ పరిస్థితి మెరుగు పరిచేందుకు, అధికారంలోకి తెచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రశాంత్ కిశోర్ ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసి సోనియాకు వివరించారు. ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన పీపీఏపై సోనియా గాంధీ సీరియస్‌గా సమాలోచనలు జరుపుతున్నారంటూ కథనాలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయింది. కానీ అందుకు భిన్నమైన పరిణామాలు కేవలం పక్షం రోజుల వ్యవధిలోనే చోటుచేసుకున్నాయి. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని, పార్టీ ఇచ్చిన ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరిస్తున్నానని స్వయంగా పీకే ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా సైతం పీకే ఇచ్చిన ప్రజంటేషన్ అంశాలను పక్కన పెట్టేశారు. పార్టీ నాయకత్వంలో మార్పులు చేయాలన్న పీకే సిఫారసులను సోనియా పక్కన పెట్టేశారు. ఈ తంతు కొనసాగుతున్న తరుణంలోనే రాహుల్ గాంధీ ఉన్నట్లుండి విదేశీ పర్యటనకు వెళ్ళారు. దాంతో పార్టీ పగ్గాలను ప్రియాంక వధేరా (Priyanka Vadhera)కు అప్పగించాలన్న పీకే సిఫారసు నచ్చకనే రాహుల్ గాంధీ సమాలోచనల్లో పాల్గొనకుండా విదేశీ పర్యటనకు వెళ్ళారంటూ కొన్ని పత్రికలు రాశాయి. మరికొన్ని మీడియా సంస్థలైతే మరో అడుగు ముందుకేసి.. అన్నా చెల్లెళ్ళు రాహుల్, ప్రియాంక మధ్య విభేదాలు అంటూ రాసుకొచ్చాయి. సరే వీటి వెనుక వున్న లోతుపాతులను పక్కన పెడితే.. తాజాగా ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల ప్రహసనం మొదలైంది. ఇపుడు అనివార్యంగా పార్టీ ప్రెసిడెంటును ఎన్నుకోవాల్సి తరుణం. రాహుల్ గాంధీనే బాధ్యతలు చేపట్టాలని పార్టీలోని మెజారిటీ శ్రేణులు కోరుకుంటున్నాయి. కానీ ఆయన విముఖంగానే వున్నట్లు తెలుస్తుండగాా ఇంకోవైపు ప్రియాంక వధేరా పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యారు. ఆమెకు దక్షిణ భారత వ్యవహారాలను కట్టబెడతారన్న ప్రచారం జరుగుతోంది.. ఈ బాధ్యతల్లో భాగంగా ఆమె తొలి అడుగు తెలంగాణలో మోపే పరిస్థితి కనిపిస్తోంది. మునుగోడు (Munugodu) నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగబోతుండగా.. తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) కీలక నేతలను ప్రియాంక ఢిల్లీకి పిలిపించుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC President Revanth Reddy), సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (CLP Leader Bhatti Vikramarka) సారథ్యంలో వెళ్ళిన తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందంతో ప్రియాంక ఆగస్టు 22న రెండున్నర గంటల పాటు సమావేశమయ్యారు. మునుగోడు ఉప ఎన్నికలో (Munugodu By-Poll)కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా గెలవాలని ఆదేశించారు. వారం రోజుల్లో అభ్యర్థిని ఖరారు చేస్తే తానే స్వయంగా మునుగోడుకు వచ్చి ప్రచారం చేస్తానని ప్రియాంక వధేరా చెప్పినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. సో.. ప్రియాంక వధేరా తెలంగాణ వ్యవహారాల్లో యాక్టివ్ రోల్ ప్లే చేయబోతున్నట్లు తేటతెల్లమైంది. ఇందుకు కారణం ఆమె పార్టీ పగ్గాలు చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నారని అన్వయించుకోవచ్చు. లేదా తెలంగాణ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఇంటర్నల్ ఫైట్స్‌ని కంట్రోల్ చేయాల్సి బాధ్యతను తానే భుజానికి ఎత్తుకున్నారని కూడా అన్వయించుకోవచ్చు.

రాహుల్ గాంధీ విముఖతకు కారణాలను విశ్లేషించుకునే క్రమంలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు కూడా తెరమీదికి వస్తున్నాయి. వివిధ రాష్ట్రాలలో రాజకీయాలు ఎలా వున్నా రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ నేతలకు వచ్చే సార్వత్రిక ఎన్నికలే కీలకం. 2024 ఫిబ్రవరి-మే మధ్యకాలంలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఈలోగా దేశంలో గుజరాత్ (Gujarat), హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh), తెలంగాణ (Telangana), మధ్యప్రదేశ్ (Madhya Pradesh), రాజస్థాన్ (Rajasthan), చత్తీస్‌గఢ్ (Chattisgadh) రాష్ట్రాలతోపాటు మరిన్ని అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి. వీటిలో ఒకట్రెండు చోట్ల మినహా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఆశల్లేవనే చెప్పాలి. ఈక్రమంలో ఇపుడు రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపడితే ఆయా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటముల పర్వం కొనసాగితే అది రాహుల్ గాంధీకి వ్యక్తిగతంగా మనోస్థైర్యాన్ని దెబ్బతీసే అంశంగా మారుతుంది. అదేసందర్భంలో పార్టీశ్రేణుల్లో సైతం రాహుల్ సారథ్యంలో పార్టీకి పునర్వైభవం సాధ్యమేనా అన్న సందేహాలు పెరుగుతాయి. ఇదంతా ఆలోచించడం వల్లనే దూరదృష్టితో రాహుల్ అధ్యక్ష బాధ్యతలు ఇపుడే చేపట్టేందుకు సుముఖంగా లేరని కొందరు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మరి రాహుల్ గాంధీ సారథ్యం చేపట్టకపోతే ఎవరికి అవకాశం దక్కుతుందన్నది తేలడానికి ఇంకొన్ని రోజులు పడుతుంది. ప్రియాంక వధేరా సైతం 2022 యుపీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. 403 అసెంబ్లీ సీట్లున్న యుపీలో కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగారు. దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద పీట వేస్తున్న అమేథీ (Amethi), రాయ్‌బరేలీ (Raibareli) వంటి  లోక్‌సభ (Loksabha) సీట్ల పరిధిలోను, ముస్లింలు అధికంగా వుండే పశ్చిమ యూపీ వంటి ఏరియాల్లోను కాంగ్రెస్ పార్టీ చతికిలా పడింది. 2019లో అమేథీలో రాహుల్ గాంధీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆయన తన నాయనమ్మ ఇందిర బాటలోనే ఉత్తరాదిన ఓటమిపాలై దక్షిణాది బాట పట్టారు. ఇందిర 1980లో ఆనాటి ఉమ్మడి ఏపీలోని మెదక్ (Medak) నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందినట్లే రాహుల్ గాంధీ అమేథీలో ఓటమిపాలై కేరళ (Kerala)లోని వయనాడ్‌ (Vaynad)లో విజయం సాధించారు. ఇప్పటి నుంచి లెక్కేస్తే మరో 20 నెలల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఈ దఫా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని వేరొకరికి ఇచ్చేసి.. 2022 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి, ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితికి పార్టీని చేరిస్తే అప్పుడు పార్టీ పగ్గాలను రాహుల్ గాంధీ చేపట్టే అవకాశం వుంది. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే.. ఇదంతా జరిగే సంకేతాలు సమీప భవిష్యత్తులో కనిపించడం లేదు. దేశంలో ప్రాంతీయ పార్టీలు పుంజుకుంటున్నాయి. కేవలం బీజేపీ (BJP) అధికారంలో వున్న రాష్ట్రాలలోనే కాదు..  బీజూ జనతాదళ్ (Biju Janatadal), తృణమూల్ కాంగ్రెస్ (Telangana Congress), వైఎస్సార్సీపీ (YSRCP), తెలంగాణ రాష్ట్ర సమితి (Telangana Rashtra Samiti), డిఎంకే (DMK) వంటి పార్టీలు అధికారంలో వున్న రాష్ట్రాలలోను కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగానే వుంది. ఇంకోవైపు బీజేపీ పవనాలు కూడా మరీ అంతగా వీక్ కాలేదు. నరేంద్ర మోదీ (Narendra Modi) ట్రెండ్ కొనసాగుతూనే వుంది. బలమైన ప్రధాని దేశానికి అవసరం అనుకున్న వారిలో హెచ్చుశాతం మోదీనే మూడోసారి ప్రధానిగా కొనసాగాలని భావిస్తున్నారు. ఇందుకు తాజాగా వెల్లడైన పలు సర్వేఫలితాలే నిదర్శనం.  తాజాగా వెల్లడైన సర్వేల్లోను ప్రధానిగా దేశ ప్రజల ఫస్ట్ ప్రియారిటీ నరేంద్ర మోదీ పేరే వినిపించింది.  ప్రధాని రేసులో రాహుల్ గాంధీ… మోదీకి కనీసం సమీపంలోను లేకపోవడం గమనార్హం. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత అంశాలను త్వరగా తేల్చుకుని, ప్రజాక్షేత్రంలో దూకుడుగా వెళ్ళకపోతే ఆ పార్టీ పునర్వైభవం కల సమీప భవిష్యత్తులో సాకారమవడం అసాధ్యమేనని చెప్పాలి.