విజయవాడలోని మాచవరంలో కొండచరియలు విరిగిపడడంతో ఒకరు మృతి చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి. ఇప్పటికే వరద ముంపు నుంచి అతి కష్టమ్మీద బయటపడుతున్న బెజవాడ.. ఈ వార్త విని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భారీ వర్షాలు, వరదతో సర్వస్వం కోల్పోయి ఆవేదన చెందుతున్న వేళ.. మళ్లీ కొండచరియలు విరిగిపడ్డాయి అన్న మాట అక్కడివారిలో ఆందోళనకు కారణమైంది. ఎందుకంటే ఆగస్టు నెల చివరిలోనే ఇలాంటి దారుణఘటన జరిగింది. విజయవాడ మొగల్రాజపురంలో జరిగిన ఆ ఘటన అందరినీ కలచివేసింది. ప్రకృతి విలయానికి ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ఇదొక్కటే కాదు.. ఈమధ్యే విశాఖపట్నంలో కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ మాటతో వైజాగ్ కూడా షాకైంది. ఎందుకంటే వయనాడ్ విషాదం ఇంకా అందరి కళ్లముందూ కదలాడుతోంది. అలాంటి సమయంలో విశాఖలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో అందరూ షాకయ్యారు. అల్లూరి జిల్లాలోనూ ఇలాంటి ఉదంతమే చోటుచేసుకుంది. వయనాడ్, విజయవాడ, విశాఖపట్నం, అల్లూరి జిల్లా.. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ఈ ప్రాంతాలన్నింటిలోనూ కొంతమంది మృత్యువాత పడ్డారు. ఇలాంటి ప్రకృతి విపత్తులను అడ్డుకోలేమా? దీనికి ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకోలేమా?
అసలు విశాఖలో ఏం జరిగిందంటే.. భారీ వర్షాలు ఉత్తరాంధ్రను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో విశాఖలోని గోపాలపట్నంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రామకృష్ణనగర్ కాళీమాత గుడి దారిలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో కొండ ప్రాంతంలో ఉన్న ఇళ్లు ప్రమాదపుటంచున ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మట్టి కోతకు గురయ్యింది. కాకపోతే ముందు జాగ్రత్త చర్యగా అక్కడి నివాసితులను అధికారులు పునరావాస శిబిరాలకు తరలించడంతో ప్రమాదం తప్పింది. కానీ.. వైజాగ్ లో.. అందులోనూ గోపాలపట్నం ప్రాంతంలో చాలా ఇళ్లు.. ఇలాంటి కొండవాలు ప్రాంతాల్లో ఉంటాయి. కొండ దిగువ భాగంలో కూడా చాలా మంది నివసిస్తారు. కొండచరియలు విరిగిపడితే.. దాని ప్రభావం ఇక్కడ ఎక్కువగా ఉండే అవకాశముంది. ఇక ఈ ప్రాంతంలో ఇళ్లకు ముప్పు పొంచే ఉంటుంది. దీంతో వర్షం పడిన ప్రతీసారీ.. ఇక్కడివారికి టెన్షన్ తప్పదు. విశాఖ.. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న నగరం కావడంతో ఎక్కువమంది ఫోకస్ దీనిపై ఉంటుంది. పైగా రోడ్డు, రైలు, విమాన, నౌకా రవాణా మార్గాలు అందుబాటులో ఉండడంతో పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువే. అలాంటి వైజాగ్ లో కొండచరియలు విరిగిపడ్డాయి అన్నమాట అటు ప్రజలను, ఇటు అధికారులనూ టెన్షన్ పెట్టింది.
అల్లూరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. అక్కడి గూడెంకొత్తవీధి మండలం, గాలికొండ పంచాయతీ చట్రాపల్లికి అర్థరాత్రి కంటిమీద కునుకే కరువైంది. దీనికి కారణం.. ఆ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడడమే. ఈ దుర్ఘటనలో కుమారి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు ఉంటున్న ప్రాంతం.. కొండ దిగువన ఉంటుంది. వీరు నివసించే ఇల్లు.. లోతట్టు ప్రాంతంలో ఉంది. ఆదివారం అర్థరాత్రి వేళ అక్కడ వరద పోటెత్తింది. దీంతో లోతట్టు ప్రాంతంలో ఉన్న వీరి ఇంటిపై కొండచరియలు విరిగిపడడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన అక్కడివారిలో భయాందోళనకు కారణమైంది. కానీ చట్రాపల్లిలో మళ్లీ కొండచరియలు విరిగిపడే ప్రమాదముందని అధికారులు హెచ్చరించినా ఆ గిరిజనులు అక్కడి నుంచి కదలలేదు. సప్పర్ల ఆశ్రమ పాఠశాలలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటుచేసినా అక్కడికీ వెళ్లలేదు. ఎందుకంటే ఈ ఘటనలో వారి ఇళ్లు శిథిలమైపోయాయి. పాడిపశువులు కూడా మృతి చెందాయి. దీంతో ఇలాంటి విషాద సమయంలో కుమారి మృతదేహాన్ని వదిలి ఎక్కడికీ వెళ్లలేమని అక్కడే ఉండిపోయారు ఆ గిరిజనులు.
ఇవి కొన్ని ఘటనలు మాత్రమే. విజయవాడ, విశాఖపట్నం, అల్లూరి జిల్లా… ఏ ప్రాంతంలో అయినా వర్షాలు భారీగా కురిసినప్పుడు.. కొండ ప్రాంతాల్లో ప్రమాదం పొంచే ఉంటుంది. ఎప్పుడు కొండచరియలు విరిగిపడతాయో చెప్పలేని పరిస్థితి. అందుకే ముందు జాగ్రత్తగా అధికారులు సూచించిన పునరావాస శిబిరాల్లో ఉండడమే మంచిది. ఎందుకంటే వయనాడ్ విషాదాన్ని దేశం ఇంకా మర్చిపోలేదు. ఆ విషాద స్మృతుల నుంచి కేరళ ఇంకా కోలుకోలేదు. కొండచరియలు విరిగిపడడంతో.. వయనాడ్ జిల్లాలోని రెండు ప్రాంతాలు.. ముండక్కై, చురాల్ మల ప్రాంతాలు దెబ్బతిన్నాయి. అక్కడి మట్టి దిబ్బల కింద చిక్కుకోవడం.. బయటకు రాలేకపోవడంతో 200 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత వేగంగా సహాయచర్యలు చేపట్టినా.. ఆస్తి, ప్రాణనష్టాలు తప్పలేదు. భారీవర్షాన్ని లెక్కచేయకుండా బాధితులను గుర్తించడానికి ప్రయత్నించినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. ఒక్క ఘటనతో వందలాది కుటుంబాలు సర్వస్వం కోల్పోయాయి. ఎంతోమంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు.
ముందే అలెర్ట్ ఇచ్చే ఏఐ టెక్నాలజీ
కొండచరియలు విరిగిపడడాన్ని ముందే గుర్తించలేమా? దేశంలో కాని, విదేశాల్లో దీనికి సంబంధించి ఏదైనా లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులో ఉందా? వయనాడ్ తరువాత దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరిగింది. నిజానికి భారీ వర్షాలకు కొండచరియలు అక్కడక్కడా విరిగిపడుతుంటాయి. కానీ ఈ స్థాయిలో ఇంతమందిని బలితీసుకోవడం మాత్రం అరుదుగా జరుగుతుంది. అయితే ఇది కలిగించే నష్టం ఊహకందనిది. కొండలు ఏటవాలుగా ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకుంటాయి. వర్షానికి రాళ్లు, మట్టి కిందకు కొట్టుకువస్తాయి. వరద పోటెత్తితే ఇక అంతే సంగతులు. కేరళలోని వయనాడ్ లో జరిగింది ఇదే. అలాంటప్పుడు వీటిని ఎందుకు ముందే పసిగట్టలేం? తుపాన్లు, సునామీ.. ఇలాంటి వాటి రాకను ముందే తెలుసుకునే వ్యవస్థలు ఉన్నాయి. మరి, కొండచరియల విషయంలో అలాంటి టెక్నాలజీ ఎంతవరకు అందుబాటులో ఉంది అని చూస్తే.. ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే వెసులుబాటు ఉందని అర్థమవుతోంది. ఎన్జీఆర్ఐ ఇలాంటి ముందస్తు హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేసింది. మరి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? దీని సాయంతో కేరళ, విజయవాడ లాంటి దుర్ఘటనలను ముందే నివారించగలమా?
మామూలుగా అయితే కొండచరియలు విరిగిపడడాన్ని గుర్తించడం కష్టం. అయితే ఎక్కువ వర్షాలు పడే చోట, అలాగే కొండ నిటారుగా ఉన్న చోట నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎంతనష్టం వాటిల్లుతుందో చూసి.. దానిని బట్టి వాటిని జోన్లుగా విభజిస్తారు. వాటిని రెడ్ జోన్లుగా గుర్తిస్తారు. దీంతోపాటు కొండచరియలు విరిగిపడే ప్రమాదమున్న ప్రాంతాలను గుర్తించడానికి ప్రస్తుతం శాటిలైట్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ఏదైనా కొండ ప్రాంతంలో అసాధారణ మార్పులు చోటుచేసుకుంటే.. వాటిని మార్క్ చేస్తున్నారు. దీని ఆధారంగా ఆయా ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇలా అందుబాటులో ఉన్న పద్దతుల ద్వారా మాత్రమే వార్నింగ్ సిస్టమ్ పనిచేస్తోంది. మరి ఇంతకుమించిన వ్యవస్థ అందుబాటులో ఉందా అని చూడాలనుకుంటే.. కేదార్ నాథ్, బద్రీనాథ్ వరకు వెళ్లాలి. ఎందుకంటే.. అక్కడ కూడా ఇలాంటి సమస్యే ఉంది. అందుకే ఆయా ప్రాంతాల్లో వచ్చే వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి ప్రమాదాలను సిస్మోమీటర్ ద్వారా ముందే పసిగట్టేలా ఓ వార్నింగ్ సిస్టమ్ ను డెవలప్ చేశారు. దీని ద్వారా హెచ్చరికలను పంపిస్తున్నారు.
వార్నింగ్ సిస్టమ్
మన సైనికులు చైనా సరిహద్దుల్లో నిరంతరం కాపలా కాస్తుంటారు. అక్కడ ఎప్పుడు కొండచరియలు విరిగిపడతాయో చెప్పలేని దుస్థితి. దీనివల్ల మన సైనికులకు ఎలాంటి ముప్పూ కలగకుండా ఉండేలా ఎన్జీఆర్ఐ ఒక ప్రాజెక్ట్ చేపట్టింది. ముప్పు ఉన్న ప్రాంతాల్లో సెన్సార్లను అభివృద్ధి చేసింది. సిస్మోమీటర్ ద్వారా వీటిని పసిగట్టేలా వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీని ద్వారా అందే హెచ్చరికలను ఆర్మీకి పంపిస్తుంది. దీంతోపాటు జోషిమఠ్, కేదార్ నాథ్, బద్రీనాథ్ వంటి భక్తుల తాకిడి ఎక్కువుగా ఉండే ప్రాంతాల్లో సెన్సార్ల వ్యవస్థను డెవలప్ చేశారు. వీటి ద్వారా ప్రమాదాన్ని ముందే గుర్తించి.. అక్కడివారిని అలెర్ట్ చేయడానికి అవకాశం ఏర్పడింది. సో.. కొండచరియలు విరిగిపడే అవకాశమున్న కేరళతోపాటు ఆంధ్రప్రదేశ్, ఇంకా ఇతర ప్రమాదకర పరిస్థితులు ఉన్న చోట ఇలాంటి సెన్సర్ల వ్యవస్థను అభివృద్ధి చేయడానికి అవకాశం ఉందని అర్థమవుతోంది.
ఏఐ, మెషిన్ లెర్నింగ్ సిస్టమ్ ద్వారా సెన్సర్ల హెచ్చరికలపై అలెర్ట్
నిజానికి కొండచరియలు సడన్ గా విరిగిపడుతుంటాయి. వాటిని పసిగట్టడానికి ఉండే సమయం చాలా తక్కువ. వర్షాల తీవ్రత పెరిగినా, భూకంపాలు వచ్చినా.. ఇలాంటి ప్రమాదం తప్పదు. కేరళలో వయనాడ్ ఘటననే తీసుకుంటే.. అక్కడ మూడుసార్లు కొండచరియలు విరిగిపడితే.. వాటిలో మొదటిదానికి, మూడో దానికి మధ్య దాదాపు అరగంట సమయముంది అన్నారు నిపుణులు. ఒకవేళ అక్కడ సెన్సర్ల వ్యవస్థ అందుబాటులో ఉండుంటే.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఆ కాస్త సమయం కూడా ఉపయోగపడేది. కనీసం ఇప్పటికైనా ఇలాంటి ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన ఇలాంటి వార్నింగ్ సిస్టమ్ ను అభివృద్ధి చేయాలి. ఇంతకీ ఇలాంటి ప్రాంతాల్లో ఏర్పాటుచేసే సెన్సర్లు ఎలా పనిచేస్తాయి? కొండచరియలు విరిగిపడతాయి అని అవి ఎలా పసిగడతాయి? దీని కోసం శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తారు. దీంతోపాటు మెషిన్ లెర్నింగ్ ద్వారా ఈ సిస్టమ్ పనిచేసేలా చూస్తారు. ఇవి ఆయా ప్రాంతాల్లో వచ్చే శబ్దాలను పసిగడతాయి. ప్రకంపనలను అధ్యయనం చేస్తాయి. వీటిని ఆధారంగా చేసుకుని.. అవి కొండచరియలకు సంబంధించినవా, భూకంపాలకు చెందినవా, లేక వేరే శబ్దాలా అనేది విశ్లేషిస్తారు. ఒకవేళ ప్రకృతి విపత్తుకు సంబంధించింది అయితే.. వెంటనే అలెర్ట్ చేస్తారు.
మట్టిని గట్టిగా పట్టి ఉంచే చెట్ల పెంపకంతోనే మేలు
ఇలాంటి సెన్సర్ల వ్యవస్థతో పాటు మరికొన్ని చర్యలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే.. ఇలాంటి ప్రాంతాల్లో టూరిస్టుల సదుపాయాల కోసం చెట్లు నరకడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. నిజానికి చెట్లకు ఉండే వేర్లు.. ఆ ప్రాంతంలో ఉండే మట్టిని గట్టిగా పట్టి ఉంచడం వల్ల ప్రకృతి విపత్తుల సమయంలో నష్టభయం తగ్గుతుంది. ఇలాంటి ప్రాంతాల్లో ఇలాంటి చెట్ల వల్లే ఉపయోగం. కానీ కొన్ని చోట్ల ఇలాంటి చెట్లను కాకుండా వేరేవాటిని పెంచుతున్నారు. అవి మట్టిని పట్టి ఉంచలేకపోతున్నాయి. దీంతో వర్షాలు, వరదల సమయంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇవి భారీగా ఆస్తి, ప్రాణనష్టానికి దారితీస్తున్నాయి. అందుకే ఇప్పటికైనా సరే.. దేశవ్యాప్తంగా భూకంపాలు, కొండచరియలు విరిగిపడడం వంటి ప్రమాదాలు పొంచి ఉండే ప్రాంతాల్లో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని వార్నింగ్ సిస్టమ్ ని డెవలప్ చేయాలి. అప్పుడే ఇలాంటి భారీ నష్టాలను నివారించడానికి అవకాశముంటుంది.