AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షం.. ఇరుకైన దారి.. చుట్టూ చీకటి.. కాళ్ల కింద శవాలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దుర్గా పూజా విషాదం..!

సప్తమి సాయంత్రం చోర్‌బాగన్ సర్బోజనిన్ దుర్గా పూజా పండాల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య19కి చేరింది. మరో 35 మందికి అత్యవసర చికిత్స కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దుర్గామాత దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు తొక్కిసలాటకు గురయ్యారు.

వర్షం.. ఇరుకైన దారి.. చుట్టూ చీకటి.. కాళ్ల కింద శవాలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దుర్గా పూజా విషాదం..!
Durga Puja Pandal Stampede
Balaraju Goud
|

Updated on: Oct 18, 2026 | 9:21 AM

Share

సప్తమి సాయంత్రం చోర్‌బాగన్ సర్బోజనిన్ దుర్గా పూజా పండాల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య19కి చేరింది. మరో 35 మందికి అత్యవసర చికిత్స కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దుర్గామాత దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు తొక్కిసలాటకు గురయ్యారు. ఉత్తర కోల్‌కతాలోని చోర్‌బాగన్ సార్వజనిక్ దుర్గా పూజా పండాల్ వద్ద శనివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. మృతుల్లో మహిళలు, చిన్నారి కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో పండుగ వేళ విషాద ఛాయలు అలుముకున్నాయి.

వర్షం.. ఇరుకైన మార్గాలు.. ఒక్కసారిగా పెరిగిన రద్దీ

అక్టోబర్ 17, శనివారం రాత్రి సుమారు 7.40 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దుర్గా పూజా ఉత్సవాల్లో భాగంగా సప్తమి సందర్భంగా పండాల్‌కు భక్తులు భారీగా తరలివచ్చారు. అదే సమయంలో వర్షం ప్రారంభం కావడంతో చాలామంది ఒకేసారి పండాల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇరుకైన ప్రవేశ, నిష్క్రమణ మార్గాల వద్ద రద్దీ ఒక్కసారిగా పెరిగింది. దీంతో తోపులాట జరిగి పలువురు కిందపడిపోయారు. వారి మీదుగా మరికొందరు వెళ్లడంతో పరిస్థితి విషమించిందని అధికారులు తెలిపారు. పండాల్ ప్రవేశ ద్వారం వద్ద సుమారు 90 నిమిషాల పాటు వేచి ఉండాల్సి వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. తగినంత వెలుతురు లేదని, భద్రతా సిబ్బంది కూడా కనిపించలేదని కొందరు ఆరోపించారు. అయితే, ప్రమాదానికి దారితీసిన ఖచ్చితమైన కారణాలను అధికారులు ఇంకా నిర్ధారించాల్సి ఉంది.

ఆసుపత్రులకు క్షతగాత్రులు.. సహాయక చర్యలు

సమాచారం అందుకున్న వెంటనే కోల్‌కతా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అంబులెన్సుల ద్వారా క్షతగాత్రులను మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసుల ప్రకటన ప్రకారం, సుమారు 35 మందిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పండాల్‌ను సందర్శకుల కోసం మూసివేశారు.

విచారణకు ఆదేశాలు.. పరిహారం ప్రకటన!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. గాయపడిన వారికి వైద్య సహాయం అందించేందుకు చర్యలు చేపట్టారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులను పరామర్శించేందుకు తన కార్యక్రమాల్లో మార్పులు చేసినట్లు వెల్లడించారు.

పూజా కమిటీపై విచారణ

తొక్కిసలాటకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ పండాల్ వద్ద భద్రతా ఏర్పాట్లు, ప్రవేశ-నిష్క్రమణ మార్గాల నిర్వహణ, జనసమూహ నియంత్రణలో లోపాలున్నాయా అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఘటన అనంతరం పూజా కమిటీ ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు అధికారులు రాజీనామా చేసినట్లు నివేదికలు వెల్లడించాయి.

ఈ దుర్ఘటనపై రాజకీయ నేతలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. పండుగ వేళ జరిగిన ఈ విషాదం జనసమూహ నిర్వహణ, భద్రతా ఏర్పాట్ల ప్రాధాన్యాన్ని మరోసారి గుర్తుచేస్తోంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత ప్రమాదానికి అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us