Wayanad Landslide: వయనాడ్ విధ్వంసం.. 319కి చేరిన మృతుల సంఖ్య.. శిధిలాల కింద సజీవంగా నలుగురు

|

Aug 02, 2024 | 1:13 PM

చూరల్‌మల దగ్గర నాలుగో రోజు చేస్తున్న అన్వేషణ, సహాయక చర్యలలో పడవెట్టికున్నులోని ఒక ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు గాయాలతో సజీవంగా కనిపించారు. ఇద్దరు పురుషులు, ఒక మహిళతో పాటు ఒక యువతి ఉందని .. అయితే యువతి కాలికి గాయమైందని సైన్యం వెల్లడించింది. వైద్యసేవల నిమిత్తం ఈ బాధిత కుటుంబాన్ని విమానంలో ఆస్పత్రికి తరలించేందుకు సైన్యం ఏర్పాట్లు చేస్తోంది.

Wayanad Landslide: వయనాడ్ విధ్వంసం.. 319కి చేరిన మృతుల సంఖ్య.. శిధిలాల కింద సజీవంగా నలుగురు
Wayanad Landslide
Follow us on

కేరళలో భారీ వర్షాలతో వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించి నాలుగో రోజు అయింది. గ్రామాలకు గ్రామాలే దేశ పటం నుంచి కనుమరుగు అయ్యాయి. తెల్లవారితే వెలుగు చూడాల్సిన బతుకులు నిద్రలోనే ముగిసిపోయాయి. ఈ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం నిరంతరం అన్వేషణ చేస్తూనే ఉన్నారు. నేడు 40 బృందాలు చూరల్‌మల ప్రాంతాన్ని ఆరు జోన్‌లుగా విభజించి సోదాలు చేయడం మొదలు పెట్టారు. చలియార్ నది (వయనాడ్ కొండచరియలు విరిగిపడటం)కి 40 కిలోమీటర్ల పరిధిలోని మొత్తం 8 పోలీస్ స్టేషన్ల సరిహద్దుల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో సోదాలు నిర్వహించే ప్రతి బృందంలో ముగ్గురు స్థానికులు, ఒక అటవీ శాఖ ఉద్యోగి ఉన్నారు. కోస్ట్ గార్డ్, ఫారెస్ట్ , నేవీ బృందాలు కూడా సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. అంతేకాదు పోలీసులు, వాలంటీర్లు కూడా బాధితుల కోసం చలియార్ ఒడ్డున కూడా వెదుకుతున్నారు.

ఈ అన్వేషణలో ఒక కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు సజీవంగా కనిపించారు. చూరల్‌మల దగ్గర నాలుగో రోజు చేస్తున్న అన్వేషణ, సహాయక చర్యలలో పడవెట్టికున్నులోని ఒక ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు గాయాలతో సజీవంగా కనిపించారు. ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.. అయితే ఒక యువతి కాలికి గాయమైందని సైన్యం వెల్లడించింది. వైద్యసేవల నిమిత్తం ఈ బాధిత కుటుంబాన్ని విమానంలో ఆస్పత్రికి తరలించేందుకు సైన్యం ఏర్పాట్లు చేస్తోంది. పడవెట్టికున్ను చూరల్‌మల నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. నలుగురు వ్యక్తులు సజీవంగా ఉన్నారనే వార్త స్థానిక నివాసితులకు, రెస్క్యూ సిబ్బందికి ఉపశమనం కలిగించింది.

ఈ విషయంపై మెప్పాడి పంచాయతీ ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. కుటుంబసభ్యుల్లో ఒకరిని జానీగా గుర్తించామని చెప్పారు. ఆ ప్రాంతంలో ప్లాంటేషన్‌ ఉంది. జానీ తన కుటుంబంతో ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లో జనరేటర్ ద్వారా విద్యుత్ సరఫరా అవుతుందని చెప్పారు. ఈ ప్రాంతంలోని ఇతర నివాసితులందరూ ప్రస్తుతం క్యాంపులో ఉన్నారు అని నూరుదీన్ సికె చెప్పారు. కొండచరియలు విరిగిపడినప్పుడు ఈ కుటుంబ సభ్యులు ముందుగా కొండపైకి వెళ్ళితే సురక్షితంగా ఉంటుందని భావించినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య నిరంతరం పెరుగుతోంది. వయనాడ కొండ ప్రాంతాలలో భారీ కొండచరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య శుక్రవారం 300 మార్కును దాటింది. ఇప్పటి వరకూ 319 మందికి పైగా మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు. సైన్యం సుమారు 1,000 మందికి పైగా రక్షించింది మరియు 220 మంది ఇంకా కనిపించలేదు. ఇప్పటికీ కూలిపోయిన భవనాలు, శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం ఆర్మీ సహా రెస్క్యూ సిబ్బంది కాలంతో పోటీ పడుతూ పరుగెత్తుతున్నారు. ప్రాణాలతో బయటపడిన వారిని కనిపెట్టేందుకు డ్రోన్ ఆధారిత రాడార్‌ను కూడా ఉపయోగిస్తున్నారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..