Uttarakhand Updates: 21ఏళ్ళలో 10మంది ముఖ్యమంత్రులు.. పూర్తి టెర్మ్ వున్న సీఎం ఒక్కరే.. ఇదీ ఉత్తరాఖండ్ హిస్టరీ

|

Mar 10, 2021 | 5:54 PM

బుధవారం (మార్చి 10) సాయంత్రం కొత్త ముఖ్యమంత్రిగా తీర్థ్ సింగ్ రావత్ పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే.. ఉత్తరాఖండ్ పొలిటికల్ జర్నీని ఓ సారి చూస్తే ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి.

Uttarakhand Updates: 21ఏళ్ళలో 10మంది ముఖ్యమంత్రులు.. పూర్తి టెర్మ్ వున్న సీఎం ఒక్కరే.. ఇదీ ఉత్తరాఖండ్ హిస్టరీ
Follow us on

Uttarakhand State Political History: ఓవైపు దేశంలో అయిదు అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇంకోవైపు ఓ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి వచ్చారు. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా సిట్టింగ్ ముఖ్యమంత్రిపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో త్రివేంద్ర సింగ్ రావత్‌కు పదవీ గండం తప్పలేదు. ఆయన స్థానంలో తీర్థ్ సింగ్ రావత్‌ను కొత్త సీఎంగా బీజేపీ అధినాయకత్వం ఎంపిక చేసింది. అధినాయకత్వం సీఎం అభ్యర్థిగా తీర్థ్ సింగ్ రావత్‌ను ప్రకటించిందే తడవుగా బీజేఎల్పీ సమావేశం నిర్వహించడం ఆ వెంటనే తీర్థ్ సింగ్ రావత్‌ను తమ లీడర్‌గా ఎన్నుకోవడం జరిగిపోయాయి. బుధవారం (మార్చి 10) సాయంత్రం కొత్త ముఖ్యమంత్రిగా తీర్థ్ సింగ్ రావత్ పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే.. ఉత్తరాఖండ్ పొలిటికల్ జర్నీని ఓ సారి చూస్తే ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి.

2000 సంవత్సరంలో ఉత్తర ప్రదేశ్ నుంచి విడిపోయి ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ఏర్పడింది. హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో సందర్శించే చార్‌ధామ్ (కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి) క్షేత్రాలున్న ఉత్తరాఖండ్‌ను దేవభూమిగా పిలుస్తారు. హిమాలయ పర్వతాలను దక్షిణాన వున్నదీ ఉత్తరాఖండ్ రాష్ట్రం. అయితే.. ఈ రాష్ట్రం ఏర్పడి 21 సంవత్సరాలు కూడా ఇంకా పూర్తి కాలేదు కానీ.. ఇప్పటి వరకు 10 మంది ముఖ్యమంత్రులను చూసిందీ చిన్న హిమాలయ రాష్ట్రం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఉత్తరాఖండ్ అసెంబ్లీకి నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే, పూర్తికాలం అయిదేళ్ళు అధికారంలో ఉన్న ఏకైక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఏపీ గవర్నర్‌గా పనిచేసిన నారాయణ్‌దత్‌ తివారి పేరుపొందారు. 2016లో రెండు సార్లు రాష్ట్రపతి పాలనకు గురైంది ఉత్తరాఖండ్‌ రాష్ట్రం. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో ఏర్పడిన సంక్షోభమే రాష్ట్రపతిపాలనకు దారి తీసింది.

ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీకి సైతం ముఖ్యమంత్రిని మార్చక తప్పలేదు. ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న త్రివేంద్ర సింగ్ రావత్‌పై అధికార బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో అసమ్మతి వ్యక్తం చేయడంతో ముఖ్యమంత్రి మార్పు అనివార్యమైంది. అనూహ్య పరిణామాల మధ్య త్రివేంద్ర సింగ్ రావత్‌ చేత రాజీనామా చేయించింది బీజేపీ అధినాయకత్వం. ఆ తర్వాత సమాలోచనలు జరిపి కొత్త ముఖ్యమంత్రిగా తీర్థ్ సింగ్ రావత్ పేరును ఖరారు చేసి ప్రకటించింది. బుధవారం సాయంత్రం కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరగనున్నది.

కాగా ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 70. 2017 అసెంబ్లీ ఎన్నికలలో 57 స్థానాలలో ఘనవిజయం సాధించింది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ తరపున పదకొండు మంది, ఇండిపెండెంట్లు ఇద్దరు విజయం సాధించారు. 2022 ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో సొంత ఎమ్మెల్యేలలో అసంతృప్తితో ఎన్నికలకు వెళ్ళడం మంచిది కాదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రిని మార్చినట్లు తెలుస్తోంది. 2022 ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రుల వివరాలు:

1. నిత్యానంద్‌ స్వామి (బీజేపీ) 09-11-2000 నుంచి 29-10-2001 వరకు 354 రోజులు
2. భగత్‌సింగ్‌ కొషియారి (బీజేపీ) 30-10-2001 నుంచి 01-03-2002 వరకు 122 రోజులు
3. నారాయణ్‌దత్‌ తివారి (కాంగ్రెస్) 02-03-2002 నుంచి 07-03-2007 వరకు 5 సం.ల 5 రోజులు
4. భువన చంద్ర ఖండూరి (బీజేపీ) 07-03-2007 నుంచి 26-06-2009 వరకు 2 సం.ల 111 రోజులు
5. రమేష్‌ పోఖ్రియాల్‌ (బీజేపీ) 27-06-2009 నుంచి 10-09-2011 వరకు 2 సం.ల 75 రోజులు
6. భువన చంద్ర ఖండూరి (బీజేపీ) 11-09-2009 నుంచి 13-03-2012 వరకు 184 రోజులు
7. విజయ్‌ బహుగుణ (కాంగ్రెస్) 13-03-2012 నుంచి 31-01-2014 వరకు 1 సం.ల 324 రోజులు
8. హరీష్‌ రావత్‌ (కాంగ్రెస్) 01-02-2014 నుంచి 27-03-2016 వరకు,
తిరిగి 21-04-2016 నుంచి 22-04-2016 వరకు
మళ్ళీ 11-05-2016 నుంచి 18-03-2017 మొత్తం 3సం.ల 2 రోజులు
9. త్రివేంద్రసింగ్‌ రావత్‌ (బీజేపీ) 18-03-2017 నుంచీ 09-03-2021 3 సం.ల 356 రోజులు

మొదట్నించి చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా వున్న బీజేపీ తాము పూర్తి కాలం అధికారంలో వున్న 1999-2004 మధ్య కాలంలో అటల్ బిహారీ వాజ్‌పేయి పరిపాలనలో ఉత్తర ప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్, బీహార్ నుంచ జార్ఖండ్, మధ్య ప్రదేశ్ నుంచి చత్తీస్‌గడ్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. యూపీలో బీజేపీ అధికారంలో వుండడం, ఉత్తరాఖండ్ ప్రాంతంలోను బీజేపీకి ఆధిపత్యం వుండడంతో 2000 నవంబర్‌లో అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. అప్పట్నించి గత 20 ఏళ్ళలో ఒక దఫా బీజేపీ, మరో దఫా కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధిస్తూ వస్తున్నాయి. ఉమ్మడి ఉత్తర్ ప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పని చేసిన ఎన్డీ తివారీ ఆ తర్వాత ఉత్తరాఖండ్‌కు కూడా ఓ దఫా ముఖ్యమంత్రిగా వ్యవహరించడం విశేషం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. ఆ తర్వాత విభజిత ఏపీకి కూడా ముఖ్యమంత్రిగా వ్యవహరించినట్లు ఎన్డీ తివారీ యుపీ, ఉత్తరాఖండ్‌లకు సీఎంగా పని చేశారు.

నాలుగేళ్ళ క్రితం ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంలో ఒకే ముఖ్యమంత్రి అయిదేళ్ళు పూర్తి చేసుకుంటున్నట్లు అనిపించినా.. చివరికి అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు సీఎంను మార్చాల్సి వచ్చింది బీజేపీకి. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో అసంతృప్తి, అసమ్మతి కొనసాగుతున్న తరుణంలో త్రివేంద్ర సింగ్ రావత్ సారథ్యంలో ఎన్నికలకు వెళ్ళడం సానుకూల ఫలితాలు సాధించడంలో ఇబ్బందులు ఎదురవుతాయన్న అంఛనాతోనే బీజేపీ అధినాయకత్వం సీఎంను మార్చినట్లు తెలుస్తోంది.

ALSO READ: ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరం.. మండళ్ళలో నెమ్మదిగా మారుతున్న సమీకరణాలు