Chinese Spare Parts: దేశీయ ఐటీ, హార్డ్‌వేర్ పరిశ్రమకు సంబంధించి చైనా విడిభాగాల కంపెనీలపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చైనా విషయంలో కఠిన వైఖరిని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్నప్పటికీ.. చైనాకు చెందిన విడిభాగాల సంస్థలు, చైనా కంపెనీల ప్రతినిధులు భారత్‌కు నిరభ్యంతరకరంగా రావచ్చని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. భారత్‌లో చైనాకు చెందిన విడిభాగాల సంస్థలపై ఆంక్షలు విధిస్తే దేశీయ హార్డ్‌వేర్ పరిశ్రమకు సంబంధించి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం విజయవంతం కాదనే విషయాన్ని గుర్తించే ఐటీ హార్డ్‌వేర్ పరిశ్రమకు ప్రభుత్వం ఈ హామీని ఇచ్చినట్లుగా కన్పిస్తోంది.
పీసీబీఏ, బ్యాటరీ ప్యాక్స్, పవర్ అడాప్టర్ లాంటి హార్డ్‌వేర్ విడిభాగాలను భారత్‌లోకి అనుమతించకుంటే తమకు కష్టం అవుతుందని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖకు దేశీయ హార్డ్‌వేర్ పరిశ్రమ తెలిపింది. అయితే భారత్‌లో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే పీఎల్‌ఐ పథకం ఉద్దేశం. ఇరుదేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఒకవేళ చైనా సరఫరాదారులకు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతిని ఇవ్వకుంటే.. పీఎల్‌ఐ పథకం విజయవంతంపై సందేహాలు నెలకొంటాయని తాజాగా సమర్పించిన నివేదికలో పరిశ్రమ బృందం పేర్కొంది.
అలాగే చైనా నుంచి భారత్‌కు తమ తయారీ కేంద్రాలను మార్చేందుకు తయారీ సంస్థలు పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చని అందులో తెలిపింది. తయారీ కేంద్రాలను భారత్‌కు మార్చేటప్పుడు చైనా టెక్నీషియన్‌లు భారత్‌కు వచ్చేందుకు వీసాలు అవసరం అవుతాయని తెలిపింది. ఈ విషయంలో భారత్ ఇటీవల కొన్నాళ్లుగా కఠిన వైఖరిని అనుసరిస్తున్న విషయాన్ని పరిశ్రమ గుర్తుచేసింది.
కాగా.. గత ఐదేళ్లలో భారత్‌కు ల్యాప్‌టాప్ దిగుమతులు రూ.21,707 కోట్ల నుంచి 42 శాతం పెరిగి రూ.30,771 కోట్లకు చేరాయి. ఇందులో 87 శాతం ల్యాప్‌టాప్‌లు చైనా నుంచి దిగుమతి అయినవే కావడం గమనార్హం.