కాశ్మీర్‌లో అధికారపక్షం.. జమ్ములో ప్రతిపక్షం.. మంత్రివర్గంలో సమతుల్యత ఎలా సాధ్యం?

| Edited By: Balaraju Goud

Oct 10, 2024 | 9:09 AM

ఎన్నికల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఒక సవాల్.. ఆ తర్వాత ఏర్పాటు చేసే మంత్రివర్గంలో ఆ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు తగిన ప్రాతినిథ్యం కల్పించడం మరో సవాల్.

కాశ్మీర్‌లో అధికారపక్షం.. జమ్ములో ప్రతిపక్షం.. మంత్రివర్గంలో సమతుల్యత ఎలా సాధ్యం?
Omar Abdullah Cabinet
Follow us on

ఎన్నికల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఒక సవాల్.. ఆ తర్వాత ఏర్పాటు చేసే మంత్రివర్గంలో ఆ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు తగిన ప్రాతినిథ్యం కల్పించడం మరో సవాల్. ప్రాంతాలవారిగా ప్రజలు భిన్నమైన తీర్పునిస్తే ఒక ప్రాంతానికి అసలు ప్రాతినిథ్యమే లేకుండా పోతుంది. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణనే తీసుకుంటే.. హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాల్లో అధికారపార్టీకి సీట్లు రాలేదు. ప్రస్తుత కేబినెట్‌‌లో రాజధాని ప్రాంతం నుంచి ఏ ఒక్కరికీ ప్రాతినిథ్యం లేకుండా పోయింది. ప్రతిరాష్ట్రంలో అటూఇటుగా ఇలాంటి పరిస్థితి సహజమే. అలాంటప్పుడు శాసనసభతో పాటు శాసన మండలి ఉన్న రాష్ట్రాల్లో ఆ ప్రాంతానికి చెందిన నేతను మంత్రివర్గంలోకి తీసుకుని సమతుల్యత సాధించే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇప్పుడు కొత్తగా ఏర్పడబోయే జమ్ము-కాశ్మీర్ అసెంబ్లీలో ఓ ప్రాంతానికి పూర్తిగా ప్రాతినిథ్యమే లేకుండా పోతుంది.

ఒకే రాష్ట్రం.. భిన్న స్వరూపాలు

ఒకనాటి జమ్ము-కాశ్మీర్ 3 భిన్న స్వరూపాల కలబోతలా ఉండేది. కాశ్మీర్ లోయ, జమ్ము ప్రాంతం, లద్ధాఖ్ పీఠభూమి భౌగోళికంగానే కాదు.. సంస్కృతి, సాంప్రదాయాలు, మతం, భాష, వాతావరణం సహా అనేకరకాలుగా మూడు భిన్నత్వాలను కలిగి ఉన్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము-కాశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలను వేరు చేయగా.. ప్రస్తుతం మిగిలిన జమ్ము-కాశ్మీర్‌ రెండు భిన్నత్వాలకు వేదికగా నిలిచింది. తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా అదే మాదిరిగా వచ్చాయి. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం రాష్ట్ర జనాభాలో 68.31 శాతం మంది ముస్లింలు, 28.44 శాతం మంది హిందువులు ఉన్నారు. సిక్కులు 1.87% ఉండగా.. బౌద్ధులు, క్రైస్తవులు, జైనులు, ఇతర మతాలవారు అత్యల్ప సంఖ్యలో ఉన్నారు. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో 17 జిల్లాల్లో ముస్లిం జనాభా అత్యధికంగా ఉంది. వాటిలో కాశ్మీర్ లోయ పూర్తిగా ముస్లిం మెజారిటీ ప్రాంతంగా ఉంది. జమ్ము ప్రాంతంలో హిందువులు అధిక సంఖ్యలో ఉన్నారు. రాష్ట్రంలోని 90 స్థానాల్లో కాశ్మీర్ లోయలో 47 స్థానాలుండగా.. జమ్ము ప్రాంతంలో 43 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న కాశ్మీర్ లోయలో నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC) అత్యధిక సీట్లు గెలుపొందింది. హిందూ జనాభా ఉన్న జమ్ము ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ (BJP) స్వీప్ చేసింది. నేషనల్ కాన్ఫరెన్స్ మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ 6 సీట్లు మాత్రమే గెలుచుకుంది. వాటిలో ఒక్కటి కూడా హిందూ మెజారిటీ ప్రాంతంలో లేదు. గెలుపొందినవారిలో ఒక్కరు కూడా హిందువు లేరు. నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి గెలుపొందిన 42 సీట్లలో ఇద్దరు మాత్రమే హిందువులున్నారు. లైన్ ఆఫ్ కంట్రోల్‌ (LOC)కు ఆనుకున్న నౌషేరా నుంచి సురీందర్ కుమార్ చౌదరి గెలుపొందగా, రాంబన్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన అర్జున్ సింగ్ రాజు నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.

ఇలా మొత్తంగా చూస్తే.. జమ్ము ప్రాంతం పూర్తిగా ప్రతిపక్షానికి వేదికవగా.. కాశ్మీర్ లోయ, లైన్ ఆఫ్ కంట్రోల్‌కు ఆనుకున్న ప్రాంతాలు పూర్తిగా అధికారపక్షానికి అండగా నిలిచాయి. దీంతో కొత్తగా ఏర్పాటు చేసే మంత్రివర్గంలో జమ్ము ప్రాంతానికి అసలేమాత్రం ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అధికార కూటమిలో గెలిచిన ఇద్దరు హిందువులకు మంత్రివర్గంలో చోటు కల్పించినా సరే.. వారు జమ్ము ప్రాంతానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం లేదు. ఇలా మొత్తంగా మంత్రివర్గం కూర్పులో సమతుల్యత లేకుండా అయింది. ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారు కేవలం తమ నియోజకవర్గాన్ని మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, జిల్లాలను కూడా ప్రభావితం చేయగలరు. ఆయా ప్రాంతాల ప్రజల అవసరాలు తీర్చేందుకు వారు ప్రయత్నిస్తూ ఉంటారు. తద్వారా తాము ఒక నియోజకవర్గం స్థాయి నుంచి ప్రాంతం, రాష్ట్ర స్థాయికి ఎదగాలని కూడా వారు కోరుకుంటారు. కానీ ఒక ప్రాంతం నుంచి అసలు మంత్రివర్గంలో ఏ ఒక్కరికీ చోటు లభించకపోతే…? ఇప్పుడు జమ్ముకాశ్మీర్‌లో ఇదే తరహా పరిస్థితి నెలకొంది.

విపక్ష ప్రాంతాలపై నిర్లక్ష్యం, నిరాదరణ

ప్రభుత్వాలను ఏర్పాటు చేసేది రాజకీయ పార్టీలే అయినప్పుడు పాలనలోనూ రాజకీయాలు సహజమే. విపక్షాలను గెలిపించిన నియోజకవర్గాలపై అధికారపక్షం చిన్నచూపు, నిర్లక్ష్యం, నిరాదరణ ఉంటాయి. “గెలిచే వరకే రాజకీయాలు, గెలిచిన తర్వాత అన్ని ప్రాంతాలు సమానమే” అన్నది నోటి మాటలకే పరిమితం తప్ప.. చేతల్లో ఏ కోశానా అమలు కాదు. ఆ ప్రాంతాలకు బడ్జెట్ కేటాయింపుల నుంచి రోడ్లు, మౌలిక వసతులు, విద్య, వైద్యం సహా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడం వరకు అన్నింటా వివక్ష ఉంటుంది. పైగా ఇక్కడ రెండు ప్రాంతాలు రెండు వేర్వేరు మతాలకు, వేర్వేరు ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఉన్నప్పుడు ఈ వివక్ష మరింత ఎక్కువగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..