నిత్యావసరధరలు పెరిగాయి..భూముల రేట్లు పెరిగాయి.. ఆయిల్ ధరలు కూడా మునుపటిలా లేవు.. బంగారం ధర చుక్కలను దాటి చాలా కాలమే అయ్యింది.. ఇన్ని రేట్లు పెరిగినప్పుడు ఎన్నికలలో అభ్యర్థులు పెట్టుకునే వ్యయమూ పెరగాలి కదా! దీన్ని దృష్టిలో పెట్టుకునే కాబోలు కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వ్యయాన్ని పది శాతం పెంచింది.. ఎన్నికల సంఘంతో చర్చించిన మీదట కేంద్ర న్యాయశాఖ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితిని మరో పదిశాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు లోక్‌సభకు పోటీ చేసే వారు 70 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయవచ్చు.. ఇప్పుడు 77 లక్షలు ఖర్చు పెట్టుకోవచ్చు.. అదే చిన్న రాష్ట్రాల నుంచి లోక్‌సభకు పోటీ చేసేవారి ఖర్చును కూడా 54 లక్షల రూపాయల నుంచి 59 లక్షల రూపాయలకు పెంచారు. శాసనసభకు పోటీ చేసేవారు ఇదివరకు 28 లక్షల రూపాయలు ఖర్చు చేసుకోవచ్చు.. ఇప్పుడు 30.8 లక్షల రూపాయలను ఖర్చు పెట్టుకోవచ్చు.. అలాగే చిన్న రాష్ట్రాలలో ఇప్పటి వరకు ఉన్న 20 లక్షల రూపాయల ఎన్నికల వ్యయాన్ని 22 లక్షలకు పెంచారు. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు పోలింగ్ రోజున, అంతకు ముందు రోజున ఎలాంటి రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదు.. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324ని అనుసరించి ఎన్నికల కమిషన్ ఈ ప్రకటనలపై నిషేధం విధించింది. పోలింగ్ రోజు, దానికి ముందు రోజు ప్రకటనల్ని శాశ్వతంగా నిషేధించాలన్న ప్రతిపాదనలు చాలా ఏళ్లుగా న్యాయ మంత్రిత్వ శాఖ దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి.. అయితే ఎన్నికల సంఘం తనకున్న అధికారాలను ఉపయోగించి తాజాగా ఆదేశాలు జారీ చేసింది.