Sabarimala: శబరిమల, మాళికప్పురం ఆలయాలకు కొత్త ప్రధాన పూజారులు.. ఎవరెవరంటే?
Sabarimala Chief Priest: శబరిమల అయ్యప్పస్వామి ఆలయం, మాళికప్పురం ఆలయాలకు కొత్త ప్రధాన పూజారులను ఎంపిక చేశారు. అరీక్కర సుబ్రహ్మణ్యన్ శంకరన్ నంబూదిరి శబరిమల ఆలయానికి, ఎ. దామోదరన్ నంబూదిరి మాళికప్పురం ఆలయానికి ఎంపికయ్యారు. రానున్న మండల, మకరవిళక్కు తీర్థయాత్రల నేపథ్యంలో ఈ ఎంపికలకు ప్రాధాన్యం ఏర్పడింది.

Sabarimala Chief Priest: శబరిమల అయ్యప్పస్వామి ఆలయం, మాళికప్పురం ఆలయాలకు కొత్త ప్రధాన పూజారులను ఎంపిక చేశారు. శబరిమల అయ్యప్పస్వామి ఆలయ ప్రధాన పూజారిగా అరీక్కర సుబ్రహ్మణ్యన్ శంకరన్ నంబూదిరిని, మాళికప్పురం ఆలయ ప్రధాన పూజారిగా ఎ. దామోదరన్ నంబూదిరిని ఎంపిక చేశారు. రానున్న మండల, మకరవిళక్కు తీర్థయాత్రల నేపథ్యంలో ఈ ఎంపికలకు ప్రాధాన్యం ఏర్పడింది.
శబరిమల ఆలయ ప్రధాన పూజారిగా ఎంపికైన అరీక్కర సుబ్రహ్మణ్యన్ శంకరన్ నంబూదిరి ప్రస్తుతం తిరువనంతపురంలోని పళవంగాడి ఆలయంలో ప్రధాన పూజారిగా సేవలందిస్తున్నారు. శబరిమలలో అయ్యప్పస్వామికి సేవ చేసే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. ఇదంతా భగవంతుడి అనుగ్రహమేనని, అయ్యప్పస్వామికి సేవ చేసే పవిత్రమైన అవకాశంగా ఈ కొత్త బాధ్యతను భావిస్తున్నానని పేర్కొన్నారు.
మరోవైపు, మాళికప్పురం ఆలయ ప్రధాన పూజారిగా ఎంపికైన ఎ. దామోదరన్ నంబూదిరి పయ్యోలిలోని కీజూర్ మహావిష్ణు ఆలయంలో ప్రధాన పూజారిగా సేవలందిస్తున్నారు. అయ్యప్పస్వామి, మాళికప్పురత్తమ్మ అనుగ్రహం వల్లే ఈ సేవ చేసే అవకాశం తనకు లభించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
మండల తీర్థయాత్రకు ఏర్పాట్లు
శబరిమల, మాళికప్పురం ఆలయాల ప్రధాన పూజారుల ఎంపిక మండల, మకరవిళక్కు తీర్థయాత్రలకు ముందు జరిగే కీలక ప్రక్రియల్లో ఒకటి. ఈ నేపథ్యంలో తులా మాస పూజల కోసం శబరిమల ఆలయ ద్వారాలను తెరిచారు. ఇటీవల కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ శబరిమల సన్నిధానాన్ని సందర్శించి అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. మండల, మకరవిళక్కు తీర్థయాత్రలకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లను సమీక్షించేందుకు ఆయన తొలుత నిలక్కల్కు, అనంతరం పంబకు వెళ్లారు. అక్కడ సమీక్షా సమావేశాల్లో పాల్గొన్న తర్వాత శబరిమల సన్నిధానానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.
తిరుమల తరహాలో భక్తులకు సౌకర్యాలు
శబరిమలను దేశంలోనే అత్యుత్తమ తీర్థయాత్ర కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రస్తుత తీర్థయాత్ర సీజన్ ముగిసిన తర్వాత శబరిమలకు వచ్చే భక్తులకు తిరుమల తరహాలో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు ప్రారంభిస్తామని వెల్లడించారు. భక్తులకు దర్శనం, వసతి తదితర సౌకర్యాలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ఆయన పేర్కొన్నారు. రానున్న మండల, మకరవిళక్కు తీర్థయాత్రల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.




