రాజస్థాన్‌లో దారుణం వెలుగుచూసింది. జైపూర్ జిల్లాలో స్నేహితుల మధ్య తలెత్తిన చిన్న వివాదం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. ఈ సంఘటన గురువారం(డిసెంబర్ 12) సాయంత్రం 7 గంటల సమయంలో బగ్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంసింగ్‌పురా గ్రామంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
బెగుసరాయ్ రోడ్‌లోని నిర్జన ప్రదేశంలో కూర్చున్న కొంతమంది యువకుల మధ్య ఏదో సమస్యపై గొడవ ప్రారంభమైంది. వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. దీంతో ఓ యువకుడిపై తోటి స్నేహితులే పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. మంటల్లో యువకుడు కేకలు వేయడం గమనించిన చుట్టుపక్కల వారు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, 108 అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకుంది. అయితే అప్పటికే యువకుడు తీవ్రంగా కాలిపోయాడు. గాయపడిన యువకుడిని ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారి డీసీపీ అమిత్ బుదానియా, ఏసీపీ హేమేంద్ర శర్మ, థానదికారి మోతీలాల్ శర్మ విచారణ ప్రారంభించారు. ఘటనా స్థలంలో ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం ఆధారాలు సేకరించింది.
మృతుడు రాకేష్ గుర్జార్‌గా పోలీసులు గుర్తించారు. అతని తండ్రి మోహర్ సింగ్ గుర్జార్ బగ్రు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. గురువారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో రాకేశ్ స్నేహితులు మనోజ్ కుమావత్, హరిమోహన్ మీనా అతడిని ఇంటి నుంచి తీసుకెళ్లారు. సాయంత్రం రాకేశ్‌పై పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. రాకేష్ సహచరులలో ఒకరు ఈ ఘటనను వీడియో తీశారని మోహర్ సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వీడియోలో, చనిపోయే ముందు, మనోజ్ కుమావత్, హరిమోహన్ మీనా కలిసి తనను కాల్చారని రాకేశ్ ఆరోపించారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు ఇంకా ఎలాంటి అధికారిక సమాచారాన్ని వెల్లడించలేదు. మృతుని మృతదేహానికి మెడికల్ బోర్డు నుంచి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. నిందితులను పట్టుకుని కేసును లోతుగా విచారించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..