PM Narendra Modi: ప్రధాని నరేంద్రమోదీ నోటి వెంట మళ్లీ వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌ ప్రస్తావన!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నోటి వెంట మరోసారి వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ అన్న నివాదం వచ్చింది. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మోదీ..

PM Narendra Modi: ప్రధాని నరేంద్రమోదీ నోటి వెంట మళ్లీ వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌ ప్రస్తావన!
Pm Narendra Modi
Balu

| Edited By: Ravi Kiran

Jan 27, 2022 | 6:31 AM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Narendra Modi) నోటి వెంట మరోసారి వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ అన్న నివాదం వచ్చింది. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మోదీ ఈ అంశాన్ని లేవనెత్తడం గమనార్హం. వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌(One Nation- One Election)-వన్‌ ఓటర్‌ లిస్ట్/ ఉండాలని, లేకపోతే ఏడాది పొడవునా ఎక్కడో చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయని, తద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతున్నదని మోదీ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ(BJP) కార్యకర్తలతో మాట్లాడుతూ మోదీ తన మనసులో మాటను చెప్పారు. ఎన్నికలకు సంబంధించి ఇంకా చాలా విషయాలు మోదీ చెప్పారు కానీ వన్‌ నేషన్- వన్‌ ఎలక్షన్‌ అన్నదే ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే పలు మార్ల చర్చ జరిగింది. జరపడం పెద్ద సమస్య కాదనే వారు ఉన్నారు. అసాధ్యమనే వారూ ఉన్నారు. ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి మోదీ వన్‌ నేషన్ వన్‌ ఎలక్షన్‌ అనే నినాదాన్ని ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో సాధ్యాసాధ్యాలపై కేంద్రం రకరకాల చర్చలు జరిపింది. కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు తీసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా వివిధ రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకుంది.

నిజానికి వన్‌ నేషన్‌- వన్‌ ఎలక్షన్‌ అన్నది ఉపయుక్తమే! మోదీ చెప్పినట్టుగా నిరంతరం ఎన్నికలు జరుగుతూ ఉండటం వల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతున్నది. అదే లోక్‌సభకు, దేశంలోని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే ఈ ప్రాబ్లమ్‌ ఉండదు. అయిదేళ్లపాటు ఎన్నికల ఊసు ఉండదు. దీనివల్ల ఖర్చు బాగా తగ్గుతుంది. మరి బోటాబోటా మెజారిటీ వచ్చిన రాష్ట్రాలలో ప్రభుత్వాలు స్థిరంగా ఉంటాయన్న నమ్మకం ఏమిటి? ప్రభుత్వాలు కూలిపోవన్న గ్యారంటీ ఉందా? కర్నాటక, మధ్యప్రదేశ్‌లలో ఇదే జరిగింది కదా! అత్యధిక స్థానాలు గెల్చుకున్న పార్టీ అధికారాన్ని నిలుపుకోలేకపోయింది కదా! ఈ రెండు రాష్ట్రాలే కాదు, చాలా రాష్ట్రాలలో ఇదే జరిగింది. ఫిరాయింపు చట్టంలో ఉన్న లొసుగుల ఆధారంగా చాలా ఈజీగా పార్టీ మార్చేస్తున్నారు నేతలు. ఇలా ఫిరాయింపుదారులను పార్టీలు ఈజీగా తమవైపుకు తిప్పుకోగలుగుతున్నాయి. ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదనుకుందాం! అప్పుడు ఏం జరుగుతుంది? మళ్లీ ఎన్నికలు జరపాల్సిందే కదా! ఇలాంటి సందర్భాలలో ఎన్నికలు జరుపుతారా? లేక మళ్లీ లోక్‌సభ ఎన్నికలు వచ్చేంత వరకు ఆగుతారా? అప్పటి వరకు పాలన అధికారుల చేతుల్లో ఉంటుందా? ప్రజా ప్రభుత్వం ఉండదా? ఇవన్నీ కాకపోతే ఆ రాష్ట్రంలో పాలన బాధ్యతను కేంద్రం తీసుకుంటుందా? ఇలాంటి సందేహాలన్నీ వస్తున్నాయి. వీటికి ఎవరి దగ్గరా స్పష్టమైన సమాధానాలు లేవు.

ఇప్పుడు మళ్లీ మోదీ వన్‌ నేషన్ వన్‌ ఎలక్షన్‌ అని ఎందుకన్నారు? ఇందులో ఏమైనా వ్యూహం ఉందా? 2024లో సాధారణ ఎన్నికలు జరుగుతాయి. అంతకు ముందు కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.. అందులో తెలంగాణ కూడా ఉంది. ఈ ఏడాది చివరలో హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల జరగాలి. షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌, కర్నాటక, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌, మిజోరం, రాజస్తాన్‌ అసెంబ్లీలకు ఎన్నికలు జరగాలి. ఈ రాష్ట్రాలలో ఏడాది పాటు కేంద్రపాలన విధించి 2024లో లోక్‌సభతో పాటు ఎన్నికలు జరుపుతారా? మరి ఇప్పుడు అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి కదా! వాటి మాటేమిటి? ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంలో లోక్‌సభ నుంచి అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరపాల్సి వస్తుంది. పోలింగ్‌ బూత్‌కు వెళ్లే ఓటర్‌ ఒకేసారి ఎంపీ, ఎమ్మెల్యే, స్థానిక సంస్థల ప్రతినిధులకు ఓటు వేయాల్సి ఉంటుంది. దానివల్ల ఏటా విడివిడిగా వివిధ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిపే అవకాశం ఉండదన్నది కేంద్రం భావన! మన దేశంలో మొదటి సారి 1951-52లో సాధారణ ఎన్నికలు జరిగాయి. అప్పుడు లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయ. అటు పిమ్మట 1957, 1962, 19678లలో కూడా ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 1968-69 మధ్య కాలంలో కొన్ని రాష్ట్రాలలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అప్పటి నుంచి ఒకేసారి ఎన్నిక విధానానికి బ్రేక్ పడింది. తర్వాత 1970లో జరిగిన ఎన్నికలలో గడుపు పూర్తికాక ముందే లోక్‌సభ రద్దు అయ్యింది. మూడేళ్ల పది నెలలుమాత్రమే నాలుగో లోక్‌సభ కొనసాగింది. మళ్లీ 1971లో లోక్‌సభకు ఎన్నికలు వచ్చాయి. అలాగే 1977లో జరిగిన ఆరో లోక్‌సభ కూడా కేవలం రెండు సంవత్సరాల అయిదు నెలల పాటు కొనసాగింది. అప్పుడు మొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. అధికారంలోకి వచ్చిన జనతాపార్టీ మూడేళ్లయినా పాలించలేకపోయింది. ఇక 1989, 1996, 1998లలోనూ ఇంతే.. ఆయా సందర్బాలలో కేవలం ఒక్క ఏడాదికి పైగా మాత్రమే లోక్‌సభ కొనసాగింది. కొన్ని రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన కారణంగా లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడం సాధ్యం కాలేదు. నిజానికి జమిలి ఎన్నికలు జరపాలనే వాదన 1983లోనే వచ్చింది. ఏకకాలంలో ఎన్నికలు జరిపితే మంచిదని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. 1999లో జస్టిస్‌ జీవన్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన లా కమిషన్‌ కూడా లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల స్థానాలకు ఎన్నికలు జరపాలని తన నివేదికలో పేర్కొంది. ఆ తర్వాత ఎవరూ దాని ఊసెత్తలేదు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ జమిలి ఎన్నికల అంశం తెరమీదకు వచ్చింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu