మోదీకి రాజకీయ సలహాదారునిగా వెలుగులోకి వచ్చిన ప్రశాంత్ కిశోర్‌కు గత అయిదేళ్ళ కాలంలో భలే డిమాండ్ పెరిగింది. తాజాగా ఆయన కోసం ఓ వైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నాలు ముమ్మరం చేయగా.. మరోవైపు ప్రశాంత్ కిశోర్ తన సొంత పార్టీలో విభేదాలతో వార్తలకెక్కుతున్నారు. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయన్న చర్చ ఇప్పుడు జోరుగా జరుగుతోంది.
ప్రశాంత్ కిశోర్.. ఈ పేరు 2014 కంటే ముందు చాలా తక్కువ మందికి తెలుసు. ఆనాటి ఎన్నికల్లో మోదీ ఎన్నికల వ్యూహానికి మెరుగులు దిద్ది.. విపరీతమైన పాజిటివ్ టాక్ సోషల్ మీడియా వేదికగా క్రియేట్ చేసి.. నరేంద్ర మోదీ ఘన విజయానికి కారణమైన ప్రశాంత్ కిశోర్ పేరు 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత మార్మోగిపోయింది. ఆ తర్వాత ఆయన సలహాలు, సూచనల కోసం దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలు క్యూ కట్టాయి. అయితే ఆయన బీహార్‌లో అధికారంలో వున్న జెడియు పార్టీ నేత అని చాలా తక్కువ మందికి తెలుసు. నితీష్ కుమార్ సాన్నిహిత్యంతో ఆయన జెడియు పార్టీలో చిరకాలంగా కొనసాగుతూ.. వృత్తిరీత్యా పలు రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా సేవలందిస్తూ చేతినిండా సంపాదించుకుంటున్నాడు ప్రశాంత్ కిశోర్.
అయితే ఇటీవల రెండంశాలు ప్రశాంత్ కిశోర్‌ను వార్తలకెక్కించాయి. వీటిలో పౌరసత్వ సవరణ చట్టం ఆధారంగా నితీష్ కుమార్‌తో ఏర్పడిన విభేదాలు ఒక కారణమైతే.. రెండోది ఆయన ఢిల్లీలో అధికారంలో వున్న ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యూహకర్తగా మారనున్నారన్న వార్త. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ పోటీ పడుతున్నారు. గత ఆరేడు నెలలుగా ఢిల్లీ ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు తాయిలాలను ప్రకటిస్తూ వస్తున్న కేజ్రీవాల్.. ఏ ఛాన్సు వదులుకోవద్దన్న వ్యూహంతో తాజాగా ప్రశాంత్ కిశోర్ సేవలను వాడుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి అనుగుణంగానే ఆయన ప్రశాంత్ కిశోర్‌ను అప్రోచ్ అవడం.. ఆయన ఓకే అనడంతో వీరిద్దరి ప్రయాణం మొదలైంది.
మరోవైపు.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని నితీష్ కుమార్ సమర్థించడాన్ని ప్రశాంత్ కిశోర్ తీవ్రంగా తప్పుపట్టారు. దేశాన్ని మతం ప్రాతిపదికన విడదీసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ప్రశాంత్ కిశోర్ ఆరోపిస్తున్నారు. ఇలాంటి చట్టానికి నితీశ్ కుమార్ మద్దతునివ్వడం తప్పని ప్రశాంత్ కిశోర్ అభిప్రాయం.
ఒకవైపు పాత మిత్రునితో విభేదాలు.. మరోవైపు కొత్త మిత్రుడు దొరకడం.. వెరసి ప్రశాంత్ కిశోర్ ఇక ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి, ఢిల్లీ కేంద్రంగా రాజకీయం చేస్తాడన్న ప్రచారం జోరుగా మొదలైంది.