Monkeypox: భారత్‌లో తొలి మంకీపాక్స్‌ మరణం.. వైరస్‌తో యువకుడు మృతి.. పాజిటివ్ వచ్చినా చెప్పకుండా..

|

Jul 31, 2022 | 11:11 PM

మృతి చెందిన యువకుడు యూఏఈ (UAE) నుంచి భారత్‌కు జులై 22న వచ్చాడు. ఇక్కడికి రావడానికి ఒక్కరోజు ముందే పరీక్షలు నిర్వహించగా.. అక్కడే మంకీపాక్స్ నిర్ధారణ అయ్యిందని మంత్రి జార్జ్‌ వెల్లడించారు.

Monkeypox: భారత్‌లో తొలి మంకీపాక్స్‌ మరణం.. వైరస్‌తో యువకుడు మృతి.. పాజిటివ్ వచ్చినా చెప్పకుండా..
Monkeypox
Follow us on

Monkeypox: భారత్‌లో తొలి మంకీపాక్స్‌ మరణం నమోదైంది. కేరళలో మంకీపాక్స్‌తో ఓ యువకుడు మరణించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు దేశంలో నాలుగు మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. ఆదివారం కేరళలోని త్రిసూర్ జిల్లాలోని చావక్కాడ్ కురంజియూర్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడు మంకీపాక్స్‌ వైరస్‌తో మరణించాడు. ఈ మేరకు రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వీనా జార్జ్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మృతి చెందిన యువకుడు యూఏఈ (UAE) నుంచి భారత్‌కు జులై 22న వచ్చాడు. ఇక్కడికి రావడానికి ఒక్కరోజు ముందే పరీక్షలు నిర్వహించగా.. అక్కడే మంకీపాక్స్ నిర్ధారణ అయ్యిందని మంత్రి జార్జ్‌ వెల్లడించారు. యువకుడు మృతి చెందడంతో రాష్ట్రంలో కేసుల పరిస్థితిని తెలుసుకునేందుకు ఉన్నత స్థాయి విచారణకు కమిటీని వేసినట్లు ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. మరణించిన యువకుడు భారత్‌కు వచ్చిన తర్వాత తీవ్రమైన అలసట, మెదడువాపుతో త్రిసూర్‌లో చికిత్స పొందాడని పేర్కొన్నారు. అయితే అతను నివేదికను దాచిపెట్టి కొన్ని రోజులు బయటతిరిగాడని పేర్కొన్నారు. 26న తీవ్రమైన జ్వరంతో ఆసుపత్రిలో చేరాడన్నారు. మంకీపాక్స్ ప్రాణాంతక వ్యాధి కాదని జార్జ్ చెప్పారు. చికిత్స తీసుకోవడంలో జాప్యంపై విచారణ జరుపుతామని ఆమె తెలిపారు. మంకీపాక్స్‌తో యువకుడు మృతి చెందడంపై ఆరోగ్యశాఖ పున్నయూర్‌లో సమావేశం ఏర్పాటు చేసింది.

ఇదిలా ఉండగా మరణించిన యువకుడి కాంటాక్ట్ లిస్ట్‌, రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. కాంటాక్ట్ వ్యక్తులు ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. భారతదేశంలో ఇప్పటివరకు నాలుగు మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. వాటిలో మూడు కేసులు కేరళలో, ఒకటి ఢిల్లీలో నమోదైంది. కాగా.. మంకీపాక్స్‌పై కేంద్రం అప్రమత్తమైంది. కేసులు నమోదవుతున్న రాష్ట్రాలు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించింది.

మంకీపాక్స్ పై నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ.. వ్యాధిని అదుపులో ఉంచడానికి ప్రభుత్వం గణనీయమైన చర్యలు తీసుకుంటోందని.. ఎటువంటి భయాందోళన అవసరం లేదని పేర్కొన్నారు. కాగా.. ఇప్పటివరకు 78 దేశాల్లో 18,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి