జమిలి ఎన్నికలు ఇప్పట్లో జరగవు. ఇదే బాటమ్ లైన్. మరో పదేళ్ల దాకా.. దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరపడానికి ఛాన్సే కనిపించడం లేదు. దాదాపుగా రాసి పెట్టుకోవచ్చు..! సొంత స్టేట్‌మెంట్లు కావు ఇవి. రాజ్యాంగ నిపుణులు చెబుతున్న లెక్క ఇది. రాజకీయ విశ్లేషకులు సైతం.. 2034లో జరిగే సాధారణ ఎన్నికలకే ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ సాధ్యం అవుతుందనేది ఓ థియరీ.
కొన్ని రాజకీయ పార్టీలు 2027కే జమిలి వచ్చేస్తుంది. మహా అయితే మరో రెండున్నరేళ్లే తాము ప్రతిపక్షంలో ఉంటాం అని ఆశ పడుతున్నాయి. అందులో తప్పులేదనుకోండి. కాని, అవన్నీ అడియాశలే అనేది నిపుణుల వాదన. 2029 వరకు ఏయే రాష్ట్రాలకు గడువు ఉందో.. ఆ ప్రభుత్వాలన్నీ యాజ్ ఇట్ ఈజ్‌గా కొనసాగుతాయి. మరోవైపు.. మహిళా రిజర్వేషన్ చట్టం అమలు కూడా 2029లోనే సాధ్యం అవుతుందా లేక 2034లోనే అమలు చేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ.. జమిలి ఎన్నికలపై గానీ, మహిళా రిజర్వేషన్లపై గానీ… ఇంత హడావుడి చేసి వీటి అమలు ఇప్పుడు కాదు.. మరో పదేళ్లకు జరుగుతాయి అని ఎందుకు అంటున్నారు? దాని వెనక ఉన్న లాజిక్ ఏంటి? ఎందుకని దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరపడానికి, మహిళా రిజర్వేషన్ల అమలుకు పదేళ్లు ఎందుకు పడుతుందో తెలుసుకుందాం..!
జమిలి ఎన్నికలు జరపాలన్నది బీజేపీ కల
ముందుగా వన్ నేషన్-వన్ ఎలక్షన్ గురించి చూద్దాం. జమిలి ఎన్నికలు జరపాలన్నది భారతీయ జనతా పార్టీ కల. 2014లో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పుడే అంతా ఫిక్స్ అయ్యారు ఇక జమిలి తథ్యం అని. 2019లో అంతకుమించి మెజారిటీతో గెలిచారు. అయినా సరే.. పదేళ్ల పాటు జమిలి తుట్టెను కదిలించలేదు. 2024లో మెజారిటీ తగ్గి సంకీర్ణానికి వచ్చినప్పుడు.. జమిలి జోలికి బీజేపీ వెళ్లదు అనే అనుకున్నారంతా. అనూహ్యంగా జమిలికి సై అంటూ లోక్‌సభలో బిల్లును సైతం ప్రవేశపెట్టింది బీజేపీ. ఇప్పటి వరకు ఉన్న అంచనాలు ఏంటంటే.. ఇకపై సాధారణ ఎన్నికలు జరిగితే అది జమిలి ఎన్నికలే అని. ఇంకొంత మంది ఆశావహులు ఏకంగా 2027కే జమిలి వచ్చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అయితే.. జమిలి వచ్చినా 2029 వరకు ఆంధ్రప్రదేశ్‌లో తమ కూటమి ప్రభుత్వం కచ్చితంగా కొనసాగుతుందని ముందు నుంచి చెబుతున్నారు.
రామ్‌నాథ్ కోవింద్ సిఫార్సులు ఏంటీ..?
ఎవరి అంచనాలు వాళ్లకుండొచ్చు. ఎవరి అభిప్రాయాలు వాళ్లు చెప్పొచ్చు. కాని.. వాస్తవం అంటూ ఒకటి ఉంటుందిగా. బిల్లును క్షుణ్ణంగా చదివిన నిపుణులు.. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సిఫార్సులను ఔపోశన పట్టిన విశ్లేషకులు.. అందులోని వాస్తవాన్ని బయటపెడుతున్నారు. బిల్లును ఆమూలాగ్రం చదివాక అర్థమవుతున్నదేంటంటే.. ‘మరో పదేళ్ల వరకు జమిలి ఎన్నికలు ఉండబోవు’ అనే ముగింపుకు వచ్చారు. ఎన్నికలు జరపడానికేముంది? కేంద్రంలోని ప్రభుత్వం ఇలా అనుకుంటే అలా పెట్టేయొచ్చు. అలాంటిది పదేళ్లు పడుతుందా అంటే.. నిజమే పదేళ్లు పడుతోంది. జమిలి ఎన్నికల వెనక ఉన్న చిక్కుముడులు అలాంటివి. ముఖ్యంగా 129వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది కేంద్రం. జమిలి 2034 వరకు సాధ్యం కాదని ఎందుకు చెబుతున్నారంటే.. ఇదిగో ఈ 129వ రాజ్యాంగ సవరణ వల్లే. ఈ రాజ్యాంగ సవరణ బిల్లు చట్టంగా మారితే.. సాధారణ ఎన్నికల తరువాత ఏర్పాటు అయ్యే లోక్‌సభ తొలి ‘సిటింగ్ డే’కు రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేస్తారు. అదే అపాయింటెడ్ డేగా మారుతుంది.
‘అపాయింటెడ్ డే’ అంటే ఏమిటీ?
ఈ ‘అపాయింటెడ్ డే’ అంటే ఏంటంటే.. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు.. ‘ఇవాళ్టి నుంచి కొత్త ప్రభుత్వం నడుస్తుంది’ అని ఈ దేశ రాష్ట్రపతి ఒక తేదీని నోటిఫై చేస్తారు. ప్రస్తుతం 18వ లోక్ సభ నడుస్తోంది. సో, 19వ లోక్‌సభ ఏర్పడినప్పుడే.. అంటే 2029లోనే మళ్లీ అపాయింటెడ్ డేని నోటిఫై చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి.. 2034లోనే జమిలి జరిగే అవకాశం ఉంది. ఆ అపాయింటెడ్ డే రోజు నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు కూడా లోక్‌సభ కాలపరిమితితోపాటే ముగుస్తాయి. ఆ తర్వాత నుంచి లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. దీన్నే ఇంకాస్త అర్థమయ్యేలా చెప్పుకుందాం.
జమలి ఎన్నికలు జరగాల్సి వస్తే..!
జమిలి ఎన్నికలు అనేవి.. 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల తర్వాతే ఆచరణలోకి వస్తుంది. అంటే.. 2029లో కూడా జమిలి జరగదు అనే అర్థం. ఎలా అంటే.. 2029 మే నెలలో జనరల్ ఎలక్షన్స్ జరిగితే.. అప్పుడు 19వ లోక్‌సభ ఏర్పడుతుంది. ఆ లోక్‌సభ ఏర్పడిన మొదటి సిటింగ్ డేట్‌ని రాష్ట్రపతి నోటిఫై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2029 జూన్ 1వ తేదీని ‘అపాయింటెడ్ డే’గా రాష్ట్రపతి నిర్ధారిస్తే.. ఆ తర్వాత ఏర్పడే రాష్ట్రాల అసెంబ్లీలన్నీ ఆ లోక్‌సభతో పాటే ముగుస్తాయి. సో, సీఎం చంద్రబాబు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్‌లో 2029లోనే ఎన్నికలు జరుగుతాయి. ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు సైతం 2029లోనే ఎన్నికలు ఉంటాయి.
తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు..?
ఇక తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌కు 2023లో ఒకేసారి ఎన్నికలు జరిగాయి. తెలంగాణతో సహా ఆ రాష్ట్రాలకు 2028 నవంబర్- డిసెంబర్‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మళ్లీ 2033 నవంబర్ వరకు తెలంగాణలో ప్రభుత్వం కొనసాగుతుంది. ఇందాక చెప్పుకున్నట్టు అపాయింటెడ్ డేట్.. 2029 జూన్ 1 నుంచి మొదలై 2034 మే నెలలో ముగుస్తుంది. అంటే 2033లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు, 2034లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు మధ్య 6 నెలల గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ వరకు రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.
మిగిలిన రాష్ట్రాల్లోనూ ఇదే ఫార్ములా..?
అదే విధంగా 2028 మే, జూన్ నెలల్లో కర్నాటక, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి. ఆ రాష్ట్రాల ప్రభుత్వాల గడువు 2033 మే, జూన్ నెలల్లో ముగుస్తాయి. అంటే.. 2034తో జరిగే లోక్‌సభ ఎన్నికలతో ఆ రాష్ట్రాలకు ఏడాది వ్యవధి ఉంటుంది. ఇక్కడ ఏకంగా ఏడాది గ్యాప్ వస్తోంది కాబట్టి ఆ ఏడాదికే అసెంబ్లీ ఎన్నికలు పెట్టడమో.. లేదా రాష్ట్రపతి పాలన అమలు చేయడమో చేస్తారు. మిగిలిన రాష్ట్రాల్లోనూ ఇదే ఫార్ములా అప్లై చేస్తారు. వ్యవధి తక్కువ అయితే రాష్ట్రపతి పాలన.. వ్యవధి ఎక్కువగా ఉంటే మళ్లీ ఎన్నికలు పెట్టడం అనే ఫార్ములా అప్లై చేయొచ్చు. ఇక్కడ రాష్ట్రపతి నోటిఫై చేసే ‘అపాయింటెడ్ డే’ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ‘అపాయింటెడ్ డే’ 2029లో మాత్రమే సాధ్యం. ఎందుకో ఇందాక చెప్పుకున్నాం. లోక్‌సభ ఏర్పడిన తొలి సిటింగ్ డేని ‘అపాయింటెడ్ డే’గా పరిగణిస్తారు కాబట్టి.. 2029లో కూడా సాధారణ ఎన్నికలు సాధారణంగానే జరుగుతాయి. అంటే.. 2034లో మాత్రమే జమిలికి అవకాశం ఉంటుంది అనేది నిపుణులు చెబుతున్న మాట.
ఒకేసారి ఎన్నికలకు ఏర్పాట్లు ఎలా..?
ఇదొక్కటే కాదు.. లోక్ సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలంటే.. ఆ సన్నద్ధతకు కూడా సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఈవీఎంల సంగతే తీసుకుంటే.. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలకు లక్షల సంఖ్యలో ఈవీఎంలు అవసరం అవుతాయి. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఈవీఎంలకు కనీసం మూడింతల ఈవీఎంలు అవసరమవుతాయనేది అంచనా. అంటే.. కొత్తగా లక్షలాది ఈవీఎంలను సమకూర్చుకోవాలి. వీటిని తయారుచేయాలంటే కనీసం 2 నుంచి 3 ఏళ్ల సమయం పడుతుంది. ఇక భద్రతాపరంగా కూడా చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలి. సున్నితమైన రాష్ట్రాలు, అత్యంత సున్నితమైన పోలింగ్ బూత్‌ల దగ్గర భద్రతాబలగాలు భారీగా మోహరించాల్సి ఉంటుంది. సో, రక్షణపరంగా ఒకేసారి ఎన్నికలకు తీసుకోవాల్సి జాగ్రత్తలు చాలా ఉన్నాయి. మరోవైపు.. ఉద్యోగులను, ఎన్నికల సిబ్బందిని, దేశవ్యాప్తంగా ఎన్నికల సరంజామాను తరలించేందుకు వాహనాలను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇంత ప్లానింగ్ జరగడానికి కచ్చితంగా సమయం పడుతుంది. ఆ రకంగా చూసినా సరే.. 2034 వరకు జమిలి ఎన్నికలు జరిగే అవకాశమే లేదనేది న్యాయ నిపుణులు అభిప్రాయం.
జమిలి ఎన్నికలకు ఉన్న అడ్డంకులు ఏంటీ?
జమిలి ఎన్నికలకు చాలా అడ్డంకులు కనిపిస్తున్నాయి. బహుశా అడ్డంకులు అనడం కూడా కరెక్ట్ కాదేమో.. కొన్ని అంశాలు ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి. మరీ ముఖ్యంగా మహిళా రిజర్వేషన్లకు, జమిలి ఎన్నికలకు లింక్ పెడుతున్నారు. కాని, మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలంటే ముందుగా ఏం చేయాలో తెలుసా.. జనగణను పూర్తిచేయాలి. ఆ తరువాత నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలి. మహిళా రిజర్వేషన్లకు వీటికి సంబంధం ఏంటి అంటే.. ఆ చట్టంలో అలాగే ఉంది కాబట్టి. మహిళా రిజర్వేషన్ల చట్టంలో జన గణనను, డీలిమిటేషన్ ప్రక్రియను లింక్ చేశారు.
నియోజకవర్గాల పునర్విభజన ప్రభావం
నిజానికి 2026 తరువాతనే నియోజకవర్గాల పునర్విభజన-డీలిమిటేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. 20 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 82వ ఆర్టికల్‌కు సవరణ చేసింది. దాని కారణంగా 2026 వరకు డీలిమిటేషన్ చేసే అవకాశమే లేదు. డీలిమిటేషన్ చేయాలంటే.. ముందుగా జనాభా లెక్కలు తేలాలి. చెప్పుకోడానికి 140 కోట్ల జనాభా అంటున్నాం గానీ.. అధికారిక లెక్కలు లేవు. నిజానికి 2021లోనే జనగణన జరగాల్సింది. కాని, కరోనా కారణంగా వాయిదా పడిన జనగణనను.. ఇప్పటికీ పెండింగ్‌లో పెడుతూ వచ్చారు. ఇప్పటికిప్పుడు జనగణన మొదలుపెట్టినా.. లెక్కలన్నీ రావడానికి కనీసం ఏడాది నుంచి రెండేళ్లు పడుతుంది. ఈ జనాభా లెక్కలను బట్టి నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. ఆ డీలిమిటేషన్ ప్రక్రియ కూడా ఆషామాషీగా చేసేదేం కాదు. 2026లో మొదలుపెడితే అది పూర్తవడానికి మూడేళ్ల నుంచి నాలుగేళ్లు పట్టొచ్చు. అప్పటికే 2029 ఎన్నికలు పూర్తైపోవచ్చు కూడా.
డీలిమిటేషన్‌లో వివాదాలు ఎలా?
ఇక్కడ మరో లాజిక్ కూడా చెబుతున్నారు ఎక్స్‌ఫర్ట్స్. 2001లో చేసిన రాజ్యాంగ సవరణ ప్రకారం లోక్‌సభ సీట్ల సంఖ్యను 2026 తర్వాత పెంచుకోవచ్చు. 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల ప్రకారం.. అంటే 2031లో జరిగే సెన్సస్ ప్రకారం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో కనిపిస్తోంది. దీనర్ధం.. 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల కంటే ముందు డీలిమిటేషన్ చేయడం కుదరదు. అది 2031 జనాభా లెక్కల ప్రకారమే జరుగుతుంది. డీలిమిటేషన్ కమిషన్ తన తుది నివేదికను ఇవ్వడానికి మళ్లీ 3, 4 ఏళ్లు తీసుకోవచ్చు. అక్కడితోనే ఆగిపోదు. జనాభా నిష్పత్తి మార్పులను బట్టి డీలిమిటేషన్‌లో వివాదాలు తలెత్తొచ్చు.
మహిళా రిజర్వేషన్ అమలు ఎప్పుడు..?
ఇదంతా జరగడానికి 2037 లేదా 2039 వరకు పట్టొచ్చు అనేది కొందరి అభిప్రాయం. మహిళా రిజర్వేషన్ అమలు 2029లో అయితే సాధ్యం కాదంటున్నారు. పోనీ, 2034లో అయినా అవుతుందా అంటే.. ఈ ఈక్వేషన్లను బట్టి పదేళ్లకు కూడా సాధ్యం కాకపోవచ్చంటున్నారు. ఇక ఆశల్లా 2039లో జరిగే ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్ల అమలు సాధ్యమవొచ్చనేది ఒక అంచనా. అందుకే.. కాంగ్రెస్ పార్టీ ఓ డిమాండ్ చేస్తోంది. జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన కోసం ఎదురుచూడకుండా.. వెంటనే రిజర్వేషన్లు అమలు చేయాలని పట్టుబడుతోంది. అసలు 2024 ఎన్నికలకే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని అప్పట్లో కాంగ్రెస్ సహా విపక్షాలు పార్లమెంటులో డిమాండ్ చేశాయి. రిజర్వేషన్ల అమలును వాయిదా వేయాల్సిన అవసరమే లేదని కూడా వాదించారు. కాని, కేంద్రం మాత్రం మహిళా రిజర్వేషన్ల అమలును పూర్తి పారదర్శకతతో చేస్తామంటోంది.
ఆర్టికల్ 82కు సవరణలు..!
ఒకవేళ జమిలి ఎన్నికలకు, మహిళా రిజర్వేషన్లకు గనక లింక్ పెట్టినట్టైతే.. ఇప్పట్లో జమిలి జరిగే అవకాశమే లేదు. ఒకవేళ వచ్చే 2029 ఎన్నికల్లోనైనా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే.. ఆర్టికల్ 82కు సవరణలు చేయడం తప్పనిసరి అవుతుంది. ఇప్పటికిప్పుడు మోదీ సర్కార్ ఆలోచన ఎలా ఉందని అంచనా వేస్తున్నారంటే.. 2025లో జనాభా లెక్కల సేకరణ జరిపి.. 2027 నాటికి నియోజకవర్గాల పునర్విభజనను పూర్తి చేసి.. ఆ తరువాత వచ్చే ఎన్నికల్లో మహిళ రిజర్వేషన్లను అమలు చేయాలని భావిస్తున్నారు. ఓవైపు ఇంత పెద్ద ప్రక్రియ జరుపుతున్న కేంద్రం.. 2029లోనే జమిలికి వెళ్తుందా, వెళ్లగలదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సో, ఏ రకంగా చూసుకున్నా సరే.. 2029 వరకూ ఎట్టి పరిస్థితుల్లోనూ జమిలి ఎన్నికలు జరిగే అవకాశమే కనిపించడం లేదని నిపుణులు చాలా గట్టిగా చెబుతున్నారు. అదే సమయంలో.. మహిళా రిజర్వేషన్ల అమలు కూడా కనుచూపుమేరలో కనిపించడం లేదు.
కేంద్రం ఫ్లాన్ అదేనా..?
కొందరి వర్షన్ ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ఒకేసారి మహిళా రిజర్వేషన్లను, అటు లోక్‌సభ సీట్ల పెంపు, ఇటు జమిలి ఎన్నికలను అమలుచేసే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు. ఇప్పటికే.. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు చట్టంగా మారింది. బట్.. ఆ చట్టం అమలును మాత్రం వాయిదా వేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత చేపట్టే తొలి జనాభా లెక్కల ఆధారంగా.. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మొదలుపెట్టాలి. మహిళా రిజర్వేషన్ల అమలు కోసం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ 2026 తర్వాత జరిగే అవకాశం ఉండటంతో ఒకేసారి దేశవ్యాప్తంగా సీట్లను పెంచడంతోపాటు, మహిళలకు కేటాయించే సీట్లను రిజర్వ్ చేయడం కోసం డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేసి 2029 ఎన్నికల నాటికల్లా ఒక వేదికను సిద్ధం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలా చూసుకున్నా సరే.. మహిళా రిజర్వేషన్ గానీ.. జమిలి ఎన్నికల నిర్వహణ గానీ.. మరో పదేళ్ల వరకు అమలు కాకపోవచ్చు అనే అభిప్రాయం అయితే వినిపిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..