
ఓ రిఫైన్డ్ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడటంతో రోడ్డుపై పెద్ద మొత్తంలో నూనె ప్రవహించింది. ట్యాంకర్ నుంచి నూనె భారీగా లీక్ అవుతున్న విషయం గమనించిన స్థానికులు పెద్ద సంఖ్యలో ఒక్కసారిగా ఎగబడ్డారు. బకెట్లు, క్యాన్లు, ఇతర పాత్రలు తీసుకొచ్చి రోడ్డుపైకి వచ్చిన నూనెను సేకరించేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని గుణా జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్యాంకర్ బోల్తా పడి ఉండగా.. దాని నుంచి నూనె నిరంతరం బయటకు వస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. నూనెను సేకరించేందుకు స్థానికులు పోటీ పడటంతో ఆ ప్రాంతంలో కాసేపు గందరగోళం నెలకొంది.
ప్రమాదం కారణంగా ట్యాంకర్‌లోని పెద్ద మొత్తంలో రిఫైన్డ్ ఆయిల్ రోడ్డుపైకి చేరడంతో భారీ ఆర్థిక నష్టం జరిగినట్లు తెలుస్తోంది. నూనె లీకవుతున్న విషయం తెలియగానే స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో కొంతసేపు అక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని స్థానికులను చెదరగొట్టారు. అయితే ట్యాంకర్ ఎందుకు బోల్తా పడిందన్న దానిపై, ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు వెంటనే తెలియరాలేదు.
मध्य प्रदेश : गुना जिले में रिफाइंड तेल से भरा टैंकर पलटा। तेल लूटने के लिए मारामारी मच गई। लोग घर से बाल्टी–डब्बे लेकर पहुंच गए। pic.twitter.com/JcysaDkSav
— Sachin Gupta (@Sachingupta) August 24, 2026
మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలోనూ ఇటీవల ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. జూలై 27న లుక్వాసా బైపాస్ సమీపంలోని ఎన్‌హెచ్-46పై ఓ డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడగా, స్థానికులు అతడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ట్యాంకర్ నుంచి డీజిల్ లీక్ అవుతుండటంతో గ్రామస్థులు అక్కడికి చేరుకుని వివిధ పాత్రల్లో డీజిల్‌ను సేకరించేందుకు ప్రయత్నించారు.
#WATCH | Diesel Tanker Overturns On NH-46 In Shivpuri, Driver Seriously Injured; Villagers Gather To Collect Fuel#MadhyaPradesh #MPNews #Shivpuri pic.twitter.com/NJi4IgITnd
— Free Press Madhya Pradesh (@FreePressMP) July 27, 2026
ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని గుమిగూడిన ప్రజలను అక్కడి నుంచి పంపించారు. డీజిల్ అత్యంత మండే స్వభావం కలిగి ఉండటంతో అక్కడికి చేరుకోవడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఇలాంటి ప్రమాదాల సమయంలో లీకవుతున్న నూనె, ఇంధనాన్ని సేకరించేందుకు ప్రయత్నించడం ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంధనం లీకయ్యే ప్రాంతాల్లో మంటలు, స్పార్కులు సంభవిస్తే తీవ్ర ప్రమాదం జరిగే అవకాశం ఉంది.