Arvind Kejriwal: బీజేపీ బాటలోనే అరవింద్ కేజ్రీవాల్.. స్వదేశీ నినాదాన్ని ఎత్తుకుంటున్న ఆమాద్మీ నేత..

|

Sep 21, 2022 | 12:31 PM

జాతీయ రాజకీయాల్లో పాగా వేయాలనుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తనదైన కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ సహా ఇతర జాతీయ పార్టీలు బలహీనపడటంతో ఆమ్ ఆద్మీ పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు..

Arvind Kejriwal: బీజేపీ బాటలోనే అరవింద్ కేజ్రీవాల్.. స్వదేశీ నినాదాన్ని ఎత్తుకుంటున్న ఆమాద్మీ నేత..
Arvind Kejriwal
Follow us on

Arvind Kejriwal: జాతీయ రాజకీయాల్లో పాగా వేయాలనుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తనదైన కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ సహా ఇతర జాతీయ పార్టీలు బలహీనపడటంతో ఆమ్ ఆద్మీ పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నారు కేజ్రీవాల్. ఇప్పటికే బీజేపీ వ్యతిరేక ఓటర్లను తనవైపు ఆకర్షించుకున్న ఆమ్ ఆద్మీ.. ఇప్పుడు బీజేపీకి సానుకూలంగా ఉన్న ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. దీనిలో భాగంగా బీజేపీ స్వదేశీ నినాదాన్నే అరవింద్ కేజ్రీవాల్ ఎత్తుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మేకిన్ ఇండియాకు పోటీగా ఇటీవల మేకిన్ ఇండియా నెంబర్ 1 మిషన్ ను ప్రారంభించిన అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యంగా బీజేపీ ఓటుబ్యాంకును చీల్చేపనిపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మేకిన్ ఇండియా నినాదాన్ని ఇవ్వగా.. ప్రపంచంలో భారత్ ను నెంబర్ వన్ దేశంగా మార్చాలంటూ అరవింద్ కేజ్రీవాల్ మేకిన్ ఇండియా నెం.1 నేషనల్ మిషన్ కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే తాజాగా విద్యా విధానంపై కూడా అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మెకాలే విద్యావిధానం స్థానంలో భారతీయ విద్యా విధానం రావాలంటూ బీజేపీ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తుంది. దానికి అనుగుణంగానే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా దేశంలో బ్రిటిషర్ల కాలం నుంచి అనుసరిస్తోన్న విద్యా వ్యవస్థ స్థానంలో దేశీయ లేదా ‘భారతీయ’ విద్యా వ్యవస్థ తీసుకురావాలని పేర్కొన్నారు.

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. వడోదరలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన ఢిల్లీ సీఏం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వివిధ ప్రశ్నలకు బదులిచ్చిన కేజ్రీవాల్‌.. పూర్వకాలంలో నలందా యూనివర్సిటీ మాదిరిగా ప్రపంచ విద్యార్థులకు భారత్‌ గమ్యస్థానంగా మారాలని పిలుపునిచ్చారు. NCERT రూపొందించే పుస్తకాలను మార్చాలా.. అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. కేవలం NCERT పుస్తకాలే కాకుండా మొత్తం కంటెంట్‌ను మార్చాల్సిందేనన్నారు. బ్రిటిష్‌ విద్యా వ్యవస్థను తీసివేసి, ఆ స్థానంలో భారతీయ విద్యా వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్య్రానంతరం పురాతన విద్యా వ్యవస్థను పక్కకుబెట్టి భారత్‌ తప్పుచేసిందన్నారు. ఇదే విషయంపై ఢిల్లీలోని తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు అయ్యిందని, ఎంతో మంది ఉత్తమమైన ఇంజినీర్లు, వైద్యులు ఉన్నప్పటికీ దేశం ఇంకా వెనకబడే ఉందన్నారు. వైద్య విద్య కోసం మన పిల్లలు ఉక్రెయిన్‌కు వెళ్లడం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. గతంలో నలందా యూనివర్సిటీలో చదివేందుకు విదేశాల నుంచి వచ్చేవారని.. ఇప్పుడు మాత్రం మన విద్యార్థులు మాత్రం విదేశాలకు వెళ్తున్నారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలల్లో సంస్కరణలు చేశామన్న ఆయన.. మన పిల్లలకు ఉత్తమ విద్య అందిస్తే మన దేశంలో పేదరికాన్ని తరిమికొట్టవచ్చని ఉద్ఘాటించారు. మొత్తం మీద బీజేపీ స్వదేశీ నినాదాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా బీజేపీ ఓటు బ్యాంకును చీల్చే ప్రయత్నంతో కేజ్రీవాల్ ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..