Suprem Court Chief Justice – CJI NV Ramana: చట్ట సభల పనితీరు.! ప్రజా ప్రతినిధులపై కేసులు.! CBI, ఐబీ వంటి సంస్థల నిర్లక్ష్యం.! జార్ఖండ్ జడ్జి హత్య!. పెగాసస్ స్పైవేర్, రాజద్రోహం కేసులు.! మానవహక్కుల ఉల్లంఘన.! ఇష్యూ ఏదైనా సరే లోపాలను కడిగేశారు. కేంద్రాన్ని సూటిగా నిలదీశారు. వ్యవస్థల్లో తరతరాలుగా పేరుకుపోయిన అలసత్వాన్ని ప్రశ్నించారు. ప్రశ్నిస్తూనే ఉన్నారు. అతనే.. సుప్రీంకోర్టుకు 48వ ప్రధాన న్యాయమూర్తిగా 2021 ఏప్రిల్ 24న బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఎన్వీ రమణ. దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన నాయయమూర్తిగా నియమితులైన రెండో తెలుగు వ్యక్తి. అప్పటి నుంచి ప్రతి అంశంలోనూ తన మార్క్‌ను చూపిస్తున్నారు. చట్ట సభల తీరుపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం. చర్చల ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలపై లోతైన చర్చ జరగపోవడంపై విచారం వ్యక్తం చేశారు. నాణ్యమైన చర్చ లేకుండా చట్టాలు చేస్తే ఏర్పడే న్యాయపరమైన చిక్కులను ప్రస్తావించారు. ఏ చట్టం ఎందుకు చేస్తున్నారో, ఆ చట్టం ఉద్దేశం ఏమిటో తెలియకుండా పోతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు..చట్ట సభల్లో న్యాయవాదులు, మేధావులు ఎక్కువగా లేకపోవడం వల్లే లోతైన చర్చ జరగడం లేదని అన్నారు CJI. అంటే చట్టాలను రూపొందించి పాలనా విధానాలకు రూపం ఇచ్చే ప్రస్తుత పార్లమెంటు, శాసనసభల తీరుని నేరుగా ప్రశ్నించారు. గతంలో చట్టసభల్లో చర్చలు జరిగిన తీరు.. ఇప్పడు జరుగుతున్న తీరుని నిలదీశారు..
దేశంలో కొవిడ్ పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు కేంద్రాన్ని నిలదీశారు CJI NV రమణ. ఆక్సిజన్ సరఫరా నుంచి వాక్సినేషన్ విధానం వరకూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొవిడ్ మృతులకు పరిహారంపైనా కేంద్రానికి అల్టిమేటం జారీ చేసింది. ఇటీవలే మార్గదర్శకాలు రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. సెక్షన్ 124-ఏ కింద రాజద్రోహ నేరాలు మోపడంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తరువాత కూడా ఈ వలస చట్టాలు ఎందుకంటూ సూటిగా ప్రశ్నించారు. మానవ హక్కుల ఉల్లంఘనలపైనా ఆందోళన వ్యక్తం చేశారు. హత్రాస్ కేసులో అరెస్టైన జర్నలిస్టు కప్పన్‌కు ఢిల్లీలో సరైన చికిత్స అందేలా ఆదేశించారు. ఐబీ, సీబీఐ వంటి సంస్థల పనితీరుని ఎండగట్టారు. న్యాయవ్యవస్థకు సహకరించడం లేదన్నారు. పోలీసులూ సరిగా పనిచేయడంలేదని విమర్శించారు.
నేరచరితులైన ప్రజాప్రతినిధులపై కేసుల విచారణనూ వేగవంతం చేశారు. ప్రజాప్రతినిధులపై పెట్టిన కేసుల్లో ఛార్జిషీట్‌కు 10 నుంచి 15 ఏళ్లా అంటూ నిలదీశారు..ప్రభుత్వాలు తమంతట తాముగా కేసులను ఉపసంహరించుకునే అధికారం లేదని చెప్పారు. హైకోర్టు అనుమతి తప్పనిసరి చేశారు. న్యాయవ్యవస్థ మనోబలం పెంచారు. సుప్రీం కోర్టులోనూ అంతర్గతంగా అనేక మార్పులు చేశారు CJI ఎన్వీరమణ. పిటిషన్ల విషయంలో సీనియర్, జూనియర్ న్యాయవాదులన్న వివక్ష చూపించొద్దని స్పష్టమైన సూచనలు చేశారు. ఇటీవల జరిగిన జార్ఖండ్ జడ్జి హత్య కేసును సుమోటోగా తీసుకుంది సుప్రీంకోర్టు. జడ్జిల భద్రతపై అన్ని రాష్ట్రాలకూ నోటీసులు పంపింది..ఇక కోర్టుల్లో మౌలిక వసతుల కొరత నివారణకు జాతీయ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం ప్రత్యేక చొరవ చూపుతున్నారు.
ఈ మధ్య కాలంలో పెగాసస్ స్పైవేర్ అంశంపై దేశరాజకీయాల్ని కుదిపేసింది. పార్లమెంట్ సమావేశాల్ని మొత్తం స్తంభింపజేసింది. స్పైవేర్ బారిన పడిన వాళ్లలో న్యాయమూర్తులు కూడా ఉండటంతో ఈ ఇష్యూని సీరియస్‌గానే టేకప్ చేసింది సుప్రీం కోర్టు..హ్యాకింగ్ వార్తలు నిజమైతే… తీవ్రంగా పరిగణిస్తామని కేంద్రాన్ని హెచ్చరించింది. ఇక సోషల్ మీడియా , వెబ్ పోర్టల్స్‌పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు జస్టిస్ ఎన్వీరమణ. ప్రతి విషయాన్ని మతకోణంలో చూస్తున్నాయని మండిపడ్డారు. ఇది దేశంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా సంస్థలు కేవలం బలవంతులకే స్పందిస్తున్నాయని, సామాన్యుల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయనిఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహంవ్యక్తం చేసింది.
హైదరాబాద్ లో అంతర్జాతీయ అర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు జస్టిస్ ఎన్వీ రమణ కల. ఇటీవలే ఆ దిశగా తొలిఅడుగు పడింది. ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. దీనికోసం జస్టిస్ ఎన్వీరమణ ప్రత్యేక చొరవ చూపారు. ఇక ఇటీవల CJI ప్రత్యేకంగా చొరవ తీసుకొని భార్యాభర్తలను కలిపిన ఘటన చాలా ప్రత్యేకం. వీడిపోవాలనుకున్న వారిని ఒక్కటి చేశారు.. 20 ఏళ్లుగా దూరంగా ఉన్నవారిని కలిపారు. మాతృ భాష తెలుగులోనే వారి వాదలను విని భార్యాభర్తలను ఒప్పించి కలిసి ఉండాలని ఆశీర్వదించారు. వాస్తవంగా సుప్రీం కోర్టు స్థాయిలో వాది, ప్రతివాదులను కోర్టుకు పిలవరు. వారి తరఫు న్యాయవాదులే వాదిస్తుంటారు. అయితే, ఇక్కడే జస్టిస్ ఎన్వీ రమణ తన ప్రత్యేకత చాటుకున్నారు. సుదీర్ఘ కాలంగా దూరంగా ఉన్న భార్యాభర్తల మనోగతాన్ని స్వయంగా వారితో మాట్లాడి తెలుసుకున్నారు. జీవితంలో ముందుకు సాగేలా నచ్చజెప్పారు.
ఇవే కాదు తన కెరీర్‌లో ఎన్నో ప్రధాన తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు జస్టిస్ ఎన్వీ రమణ. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా సమాచార హక్కు పరిధిలోకి వస్తుందని చెప్పిన ధర్మాసనంలో జస్టిస్ రమణ ఒకరు. దేవాలయాల్లో అర్చకుల నియామకం ఆగమశాస్త్రం, రాజ్యాంగ పరమైన ఆదేశాలు, సూత్రాలకు అనుగుణంగా ఉండాలని జస్టిస్ రమణ ఆధ్వర్యంలోని ధర్మాసనం పేర్కొంది. అర్చకులను నియమించడం లేదా తొలగించడం ఆర్టికల్ 14 ఉల్లంఘన కిందకు రాదని వ్యాఖ్యానించింది. మహిళలు చేసే ఇంటిపని, వారి భర్తలు ఆఫీసుల్లో చేసే పనులకంటే ఏమాత్రం తక్కువ కాదని జస్టిస్ రమణ పేర్కొన్నారు.