AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆలయానికి వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 12 మంది మృతి!

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శీతలా మాత ఆలయం సమీపంలో అదుపుతప్పిన వరి ధాన్యం లోడ్‌తో ఉన్న ట్రక్కు భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఐదు నుంచి ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆలయానికి వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 12 మంది మృతి!
Gwalior Truck Accident
Balaraju Goud
|

Updated on: Oct 18, 2026 | 8:04 AM

Share

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శీతలా మాత ఆలయం సమీపంలో అదుపుతప్పిన వరి ధాన్యం లోడ్‌తో ఉన్న ట్రక్కు భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఐదు నుంచి ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

బారికేడ్లను ఛేదించి ఆలయం గోడను ఢీకొన్న ట్రక్కు

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం (అక్టోబర్ 18) తెల్లవారుజామున సుమారు 1.30 గంటల సమయంలో ఛినోర్ వైపు నుంచి శీతలా మాత ఆలయం దిశగా వరి ధాన్యంతో నిండిన ట్రక్కు వస్తోంది. ఆలయం పరిసరాల్లో నవరాత్రుల నేపథ్యంలో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతోపాటు పోలీసు చెక్‌పోస్టు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే ట్రక్కు అదుపుతప్పి బారికేడ్లను ఛేదించుకుంటూ ముందుకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఆలయ గేటు, బయటి గోడను ఢీకొట్టడంతో అక్కడున్న భక్తులు ప్రమాదానికి గురయ్యారు.

39 మందిని ఆసుపత్రికి తరలింపు

ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 39 మందిని ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. వారిలో 12 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు చికిత్స కొనసాగిస్తున్నారు. క్షతగాత్రుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు పోలీసులు కూడా గాయపడినట్లు సమాచారం.

ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు

గ్వాలియర్ కలెక్టర్ రుచికా చౌహాన్, ఎస్‌ఎస్‌పీ ధర్మవీర్ సింగ్ ఘటనపై వివరాలు వెల్లడించారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అంబులెన్సులు, ఇతర వాహనాలను పంపించి సహాయక చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. నవరాత్రుల సందర్భంగా ఆంక్షలు, పోలీసు చెక్‌పోస్టు ఉన్నప్పటికీ ట్రక్కు ఆ మార్గంలోకి ఎలా ప్రవేశించిందనే అంశంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ట్రక్కులో సాంకేతిక లోపాలు ఉన్నాయా? డ్రైవర్ నియంత్రణ కోల్పోవడానికి కారణాలేమిటి? అనే విషయాలను తెలుసుకునేందుకు ఆర్టీఓ బృందాన్ని రంగంలోకి దించారు.

ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే?

ట్రక్కు వేగంగా దూసుకొచ్చి దుకాణాలతోపాటు అక్కడున్న ప్రజలను ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. కొందరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని, ఈ ప్రమాదంలో తన సోదరుడు కూడా గాయపడ్డాడని వివరించాడు. ఈ ఘటనతో ఆలయ పరిసరాల్లో విషాద వాతావరణం నెలకొంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us