Baba Siddique: మేమే చంపేశాం.. బాబా సిద్ధిఖీ హత్యపై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కీలక ప్రకటన..

|

Oct 13, 2024 | 3:17 PM

మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిద్ధిఖీ హత్యకు బాధ్యత వహిస్తున్నట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, అండర్ వరల్డ్ డాన్‌ దావూద్ ఇబ్రహీం, అనుజ్ థాపన్‌లతో సిద్ధిఖీకి ఉన్న సన్నిహితం వల్లే..

Baba Siddique: మేమే చంపేశాం.. బాబా సిద్ధిఖీ హత్యపై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కీలక ప్రకటన..
Baba Siddique Murder
Follow us on

మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిద్ధిఖీ హత్యకు బాధ్యత వహిస్తున్నట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, అండర్ వరల్డ్ డాన్‌ దావూద్ ఇబ్రహీం, అనుజ్ థాపన్‌లతో సిద్ధిఖీకి ఉన్న సన్నిహితం వల్లే ఈ హత్య జరిగిందని గ్యాంగ్‌లోని ఓ సభ్యుడు చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సల్మాన్ ఖాన్, దావూద్ గ్యాంగ్‌కు ఎవరు సహాయం చేసినా మూల్యం చెల్లించవలసి ఉంటుందని పోస్టులో హెచ్చరించారు.

మరోవైపు బాబా సిద్ధిఖీ భౌతికకాయాన్ని పోస్టుమార్టం అనంతరం ఇంటికి తరలించారు. కడసారి చూసేందుకు భారీగా తరలివస్తున్నారు అభిమానులు. ఇంటి దగ్గర భద్రత కూడా కట్టుదిట్టం చేశారు. ముంబై లైన్స్‌లోని బాబా కబ్రస్తాన్‌లో రాత్రి 8.30 గంటలకు సిద్ధిఖీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంచనాలతో నిర్వహించనున్నారు. ముంబైలోని బడా కబ్రస్తాన్‌లో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. సిద్ధిఖీ హత్య ఘటనలో పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా.. మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

బాబా సిద్దిఖీ హత్య ఘటనతో మహారాష్ట్రలో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలాయనే విషయం తేటతెల్లమవుతుందన్నారు లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ. ఈ హత్య ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో న్యాయం గెలవాలన్నారు. బాబా కుటుంబానికి రాహుల్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

సోషల్ మీడియా పోస్ట్ వీడియో..

సిద్ధిఖీ మృతిపై డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ సంతాపం తెలిపారు. సిద్ధిఖీ హత్య తమ పార్టీకి తీరని లోటు అన్నారు. హత్య వెనుక ఎవరి హస్తం ఉందో తేల్చేందుకు ఐదు టీమ్‌లను ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాలకు పంపించామని, రెండ్రోజుల్లో కుట్రదారులు ఎవరో బయటికి వస్తుందని ఆయన అన్నారు.

త్వరలోనే ఎన్నికలు.. సల్మాన్‌ ఖాన్ ఇంటి దగ్గర భద్రత పెంపు

త్వరలోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి టైమ్‌లో కాల్పుల ఘటన రాజకీయవర్గాల్లో కలకలం రేపింది. ఇకపోతే, ఈ ఏడాది ఏప్రిల్‌లో సల్మాన్‌ఖాన్‌ ఇంటి దగ్గర గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ కాల్పులకు పాల్పడింది. గత కొంతకాలంగా సల్మాన్‌ను టార్గెట్‌ చేసిన బిష్ణోయ్‌ గ్యాంగ్‌.. అతడి స్నేహితుడైన బాబా సిద్ధిఖీని హత్య చేయడంతో పలు సందేహాలు తెరపైకి వచ్చాయి. అయితే.. బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సిద్ధిఖీకి ఎలాంటి బెదిరింపులు రాలేదు.. కానీ బాబా సిద్ధిఖీకి ప్రాణహాని ఉందని అతడి స్నేహితులు చెప్పడంతో 15 రోజుల క్రితమే ఆయనకు ‘వై’ కేటగిరీ భద్రత కల్పించారు. భద్రత ఉన్నప్పటి ఆయన హత్య జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో సల్మాన్‌ ఖాన్ ఇంటి దగ్గర భద్రత పెంచారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..