Kishan Reddy: కేంద్రం నుంచి సాయం చేస్తాం.. అయ్యప్ప భక్తులకు సౌకర్యాలు కల్పించండి.. కేరళ సీఎం విజయన్‌కు కిషన్ రెడ్డి లేఖ

|

Dec 16, 2023 | 8:32 PM

స్వామియే శరణం అయప్ప.. శరణు ఘోషతో శబరిమల మార్మోగుతోంది. మరోవైపు రికార్డుస్థాయి రద్దీతో భక్తులకు చుక్కలు కన్పిస్తున్నాయి. భక్తులు లక్షల్లో పోటెత్తడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. కాలుతీసి కాలు కదపలేదని పరిస్థితిలో ఎంతో మంది భక్తులు అయ్యప్పను దర్శించుకోకుండానే వెనుదిరుగుతున్నారు. ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలనంతగా భక్తుల రద్దీ అంతకంతకూ పెరుగుతోంది.

Kishan Reddy: కేంద్రం నుంచి సాయం చేస్తాం.. అయ్యప్ప భక్తులకు సౌకర్యాలు కల్పించండి.. కేరళ సీఎం విజయన్‌కు కిషన్ రెడ్డి లేఖ
Pinarayi Vijayan - Kishan Reddy
Follow us on

స్వామియే శరణం అయప్ప.. శరణు ఘోషతో శబరిమల మార్మోగుతోంది. మరోవైపు రికార్డుస్థాయి రద్దీతో భక్తులకు చుక్కలు కన్పిస్తున్నాయి. భక్తులు లక్షల్లో పోటెత్తడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. కాలుతీసి కాలు కదపలేదని పరిస్థితిలో ఎంతో మంది భక్తులు అయ్యప్పను దర్శించుకోకుండానే వెనుదిరుగుతున్నారు. ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలనంతగా భక్తుల రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. కొండ కింద పంబ నుంచి సన్నిదానం వరకు క్యూలైన్లు కిక్కిరిసిపోతున్నాయి.ఘాట్ రోడ్డులో ఎక్కడికక్కడ ఆగిపోయిన వాహనాలు నిలిచిపోయాయి. దర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ట్రావెన్కోర్ దేవస్థానం స్వామి దర్శన సమయాన్ని గంటపాటు పెంచినప్పటికీ… పోటెత్తుతున్న భక్తులకు స్వామి దర్శనం గగనమవుతోంది. శబరిమలలో రద్దీ అంతకంతకు పెరుగుతున్నా.. క్యూలైన్ల క్రమబద్దీకరణ, భద్రతా ఏర్పాట్లు మాత్రం అరకొరగానే ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. రద్దీని కంట్రోల్‌ చేయడంలో ప్రత్యామ్నాలు ఏర్పాటు చేయడంలో ..భక్తులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ట్రావెన్‌కోర్‌ బోర్డ్‌, కేరళ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి క్షేత్రంలో కనీస ఏర్పాట్ల లేమి కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కేరళ ముఖ్యమంతి పినరయి విజయన్‌కు కిషన్ రెడ్డి లేఖ రాశారు. శబరిమలలో అయ్యప్పస్వాములకు కనీస సౌకర్యాలు కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన లేఖలో తెలిపారు.

అయ్యప్ప స్వామి భక్తులు 40 రోజులపాటు చేసే ఆధ్యాత్మిక భావనతో కూడిన మండల దీక్ష ఆ తర్వాత.. శబరిమలలో కొలువైన స్వామివారిని దర్శించుకోవడం హిందూ ధర్మంపట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసానికి నిదర్శనమంటూ కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ప్రతి ఏటా నవంబర్ నుంచి జనవరి మధ్యలో కోటి మందికిపైగా భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి మండల దీక్షను పూర్తిచేసుకుని అయ్యప్పస్వామి దర్శనం కోసం కేరళ రాష్ట్రంలోని శబరిమలకు వస్తున్నారన్నారు. ప్రతిఏటా శబరిమలకు తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే భక్తుల సంఖ్య 15 లక్షలకు పైగానే ఉంటుందని లేఖలో వివరించారు. అయితే ఈసారి శబరిమలలో అయ్యప్పస్వామి సన్నిధానంలో ఏర్పాట్లు సరిగాలేని కారణంగా భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు.. భక్తుల ద్వారా, పత్రికలు, ఛానళ్లలో వస్తున్న వార్తల ద్వారా తెలుస్తోందని తెలిపారు. ఇటీవల శబరిమల అయ్యప్ప సన్నిధానంలో.. దర్శనం సందర్భంగా కనీస ఏర్పాట్లులేక తొక్కిసలాటలో ఓ బాలిక చనిపోయిన విషయం తెలిసి చాలా బాధపడ్డానన్నారు.

కిషన్ రెడ్డి ట్వీట్..

శబరిమలలో అయ్యప్పస్వాములకు తీవ్ర అసౌకర్యం ఎదురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తరపున తగిన సంఖ్యలో ఉద్యోగులను, ఇతర సిబ్బందిని శబరిమలలో మోహరించి.. భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలంటూ కిషన్ రెడ్డి విజయన్ ను కోరారు. శబరిమలకు భక్తులు పాదయాత్ర మార్గాల్లో.. భోజనం, నీరు, వైద్యంతో సహా స్వాములకు అవసరమైన ఇతర ఏర్పాట్లను వెంటనే చేయాలని లేఖలో ప్రస్తావించారు. భక్తులకు ఏర్పాట్లు చేసే విషయంలో.. పంబానది పరిసరాలు, సన్నిధానం వరకు పాదయాత్ర, ట్రెక్కింగ్ జరిగే ప్రాంతాల్లో భక్తులకు సహాయం చేసే విషయంలో.. స్వచ్ఛంద సేవాసంస్థల (NGO)ను కూడా భాగస్వాములను చేసేదిశగా చొరవతీసుకోవాలని కోరారు. ఈ విషయంలో వీలైనంత త్వరగా.. ప్రత్యేక చొరవతీసుకుని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగాన్ని మోహరించి అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు కిషన్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..