AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గంటల ప్రయాణం.. నిమిషాల్లో గమ్యం.. భారత్‌లో మారుతున్న ప్రయాణ ముఖచిత్రం..

భారత్‌లో మౌలిక వసతుల అభివృద్ధి ప్రయాణ ముఖచిత్రాన్ని మారుస్తోంది. వంతెనలు, సొరంగాలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, వేగవంతమైన రైళ్లతో అనేక మార్గాల్లో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతోంది. 2026 టైమ్‌టేబుల్‌లో 549 రైళ్ల వేగాన్ని పెంచినట్లు రైల్వే శాఖ తెలిపింది. భవిష్యత్‌లో హైస్పీడ్ రైల్ కారిడార్లు అందుబాటులోకి వస్తే నగరాల మధ్య ప్రయాణ సమయం మరింత తగ్గే అవకాశం ఉంది.

గంటల ప్రయాణం.. నిమిషాల్లో గమ్యం.. భారత్‌లో మారుతున్న ప్రయాణ ముఖచిత్రం..
India Infrastructure
Shaik Madar Saheb
|

Updated on: Sep 24, 2026 | 10:22 AM

Share

నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మప్రభుత్వం సులభమైన రవాణా, మౌలిక వసతులపై కీలక దృష్టిసారించింది. దీంతో భారత్‌లో మౌలిక వసతుల అభివృద్ధి కేవలం కొత్త రహదారులు, వంతెనలు, రైల్వే మార్గాల నిర్మాణానికే పరిమితం కావడం లేదు. ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకునే ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడం కూడా ఈ మార్పులో కీలకంగా మారింది. వంతెనలు, సొరంగాలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఆధునిక రైలు సేవలతో గతంలో గంటల తరబడి పట్టిన ప్రయాణాలు ఇప్పుడు చాలా తక్కువ సమయంలో పూర్తవుతున్నాయి.

వంతెనలతో తగ్గిన ప్రయాణ దూరాలు

నదులు, లోయలు, క్లిష్టమైన భూభాగాల కారణంగా గతంలో ప్రయాణికులు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది. కొత్త వంతెనల నిర్మాణంతో ఈ సమస్య తగ్గింది.

అస్సాంలోని భూపేన్ హజారికా సేతు (ధోలా–సాదియా వంతెన) రుపాయి నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌లోని మేకా/రోయింగ్‌ ప్రాంతాల మధ్య ప్రయాణ సమయాన్ని సుమారు 6 గంటల నుంచి గంటకు తగ్గించింది.

అదే రాష్ట్రంలోని బోగీబీల్ వంతెన బ్రహ్మపుత్ర నదిపై రైలు, రోడ్డు అనుసంధానాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో ధేమాజీ–దిబ్రూగఢ్ మధ్య గతంలో దాదాపు ఒక రోజు పట్టే ప్రయాణం ఇప్పుడు సుమారు 1–2 గంటల్లో పూర్తవుతోంది.

మహారాష్ట్రలోని అటల్ సేతు (ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్) ముంబై–నవీ ముంబై మధ్య ప్రయాణాన్ని సుమారు 2 గంటల నుంచి 20 నిమిషాలకు తగ్గించింది.

బిహార్‌లోని కోసి రైల్ మహాసేతు నిర్మాణంతో నిర్మాలి–సరాయ్‌గఢ్ మధ్య రైలు ప్రయాణం సుమారు 8 గంటల నుంచి 30 నిమిషాలకు తగ్గింది. దూరం కూడా దాదాపు 300 కిలోమీటర్ల నుంచి 22 కిలోమీటర్లకు తగ్గింది.

అరుణాచల్‌ప్రదేశ్‌లోని సిస్సేరి నది వంతెన పసీఘాట్–రోయింగ్ మధ్య ప్రయాణ సమయాన్ని సుమారు ఐదు గంటల మేర తగ్గించింది.

India Travel Time Reduction

India Travel Time Reduction

కొండలను ఛేదిస్తున్న సొరంగాలు

దేశంలోని పర్వత ప్రాంతాల్లో ప్రయాణ సమయాన్ని తగ్గించడంలో సొరంగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కొండలను చుట్టి వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా మార్గాన్ని కల్పిస్తున్నాయి.

హిమాచల్‌ప్రదేశ్‌లోని అటల్ టన్నెల్ రోహ్‌తాంగ్ పాస్‌ను బైపాస్ చేస్తూ మనాలి–సర్చూ మార్గంలో ప్రయాణ సమయాన్ని సుమారు 4–5 గంటల మేర తగ్గించింది. 9.02 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగం లాహౌల్–స్పితికి అన్ని కాలాల్లో రాకపోకలకు ఉపయోగపడుతోంది.

జమ్మూకశ్మీర్‌లోని డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ టన్నెల్ ప్రయాణ దూరాన్ని సుమారు 30 కిలోమీటర్లు తగ్గించి, జమ్మూ–శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు రెండు గంటలు తగ్గించింది.

అదే ప్రాంతంలోని బనిహాల్–ఖాజీగుండ్ రోడ్ టన్నెల్ సుమారు 16 కిలోమీటర్ల దూరాన్ని తగ్గించడంతో పాటు ప్రయాణ సమయాన్ని దాదాపు 1.5 గంటలు తగ్గించింది.

అరుణాచల్‌ప్రదేశ్‌లోని సెలా టన్నెల్ సుమారు 13 వేల అడుగుల ఎత్తులో నిర్మించబడింది. దీని వల్ల తేజ్‌పూర్–తవాంగ్ మార్గంలో ప్రయాణ సమయం గంటకు పైగా తగ్గడంతో పాటు అన్ని వాతావరణ పరిస్థితుల్లో కనెక్టివిటీ మెరుగుపడింది.

Travel

Travel

ఎక్స్‌ప్రెస్‌వేలతో వేగంగా మారుతున్న రోడ్డు ప్రయాణం

దేశవ్యాప్తంగా నిర్మిస్తున్న యాక్సెస్‌ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలు నగరాల మధ్య ప్రయాణ వేగాన్ని పెంచుతున్నాయి.

ఢిల్లీ–మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేతో ప్రయాణ సమయం సుమారు 2.5 గంటల నుంచి 50 నిమిషాలకు తగ్గింది.

బెంగళూరు–మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా మూడు గంటల వరకు పట్టే ప్రయాణం సుమారు 75 నిమిషాలకు తగ్గింది.

2026లో అందుబాటులోకి వచ్చిన ఢిల్లీ–డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ ఢిల్లీ–డెహ్రాడూన్ ప్రయాణ సమయాన్ని ఆరు గంటలకు పైగా ఉన్న స్థాయి నుంచి సుమారు 2.5 గంటలకు తగ్గిస్తోంది.

ముంబై–నాగ్‌పూర్ సమృద్ధి మహామార్గ్ ద్వారా రెండు నగరాల మధ్య దాదాపు 16 గంటల ప్రయాణం సుమారు 8 గంటలకు తగ్గింది.

అహ్మదాబాద్–ధోలేరా ఎక్స్‌ప్రెస్‌వేతో అహ్మదాబాద్–ధోలేరా మధ్య దూరం 100 కిలోమీటర్ల నుంచి 83 కిలోమీటర్లకు, ప్రయాణ సమయం 2 గంటల 15 నిమిషాల నుంచి సుమారు 45 నిమిషాలకు తగ్గింది.

ఢిల్లీ–అమృత్‌సర్–కట్రా ఎక్స్‌ప్రెస్‌వేలో మొదటి దశ అందుబాటులోకి రావడంతో ఢిల్లీ–అమృత్‌సర్ ప్రయాణం సుమారు 8 గంటల నుంచి 4 గంటలకు, ఢిల్లీ–కట్రా ప్రయాణం సుమారు 14 గంటల నుంచి 6 గంటలకు తగ్గేలా మారుతోంది.

పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌వే రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు 33 గంటల నుంచి 12 గంటలకు తగ్గించే లక్ష్యంతో రూపొందిస్తున్నారు.

Vande Bharath

Vande Bharat

రైల్వేలోనూ వేగం పెరుగుతోంది

రోడ్లతో పాటు రైల్వే ప్రయాణంలోనూ సమయం ఆదా అవుతోంది. 2026 రైల్వే టైమ్‌టేబుల్ ప్రకారం దేశవ్యాప్తంగా 549 రైళ్ల వేగాన్ని పెంచారు. వీటిలో 20 రైళ్లు గంట లేదా అంతకంటే ఎక్కువ సమయం ఆదా చేసేలా వేగవంతమయ్యాయి. మరో 48 రైళ్లలో 31–59 నిమిషాలు, 105 రైళ్లలో 16–30 నిమిషాలు, 376 రైళ్లలో 5–15 నిమిషాల వరకు ప్రయాణ సమయం తగ్గింది.

దేశంలో ఆధునిక రైలు ప్రయాణానికి ప్రతీకగా మారిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కూడా పలు మార్గాల్లో ప్రయాణ సమయాన్ని తగ్గిస్తోంది.

న్యూఢిల్లీ–వారణాసి వందే భారత్ సర్వీస్ గత సేవలతో పోలిస్తే సుమారు 40–50 శాతం వేగంగా ప్రయాణాన్ని పూర్తి చేస్తోంది.

కత్రా–శ్రీనగర్ వందే భారత్ తో ప్రయాణ సమయం సుమారు 2–3 గంటల వరకు తగ్గింది. జమ్మూ–శ్రీనగర్ పొడిగించిన సర్వీస్ కూడా ఈ ప్రాంత కనెక్టివిటీని మెరుగుపరుస్తోంది.

బనారస్–ఖజురాహో, ఎర్నాకుళం–బెంగళూరు, లక్నో–సహారన్‌పూర్ మార్గాల్లోనూ వందే భారత్ రైళ్లు గత సేవలతో పోలిస్తే ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాయి.

ఇక హౌరా–గువాహటి వందే భారత్ స్లీపర్ సర్వీస్ సరాయ్ ఘాట్ ఎక్స్‌ప్రెస్‌తో పోలిస్తే దాదాపు మూడు గంటల సమయాన్ని ఆదా చేస్తూ, ప్రయాణాన్ని సుమారు 17 గంటల నుంచి 14 గంటలకు తగ్గిస్తోంది.

హైస్పీడ్ రైళ్లతో గంటల ప్రయాణం నిమిషాల్లోకి

భవిష్యత్‌లో హైస్పీడ్ రైలు మార్గాలు కూడా ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించే అవకాశం ఉంది.

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ 508 కిలోమీటర్ల పొడవుతో, గంటకు 320 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడిపేలా రూపొందిస్తున్నారు. ఈ మార్గంలో ప్రయాణ సమయం సుమారు 1 గంట 58 నిమిషాలకు చేరేలా ప్రణాళిక ఉంది. ఇందులో థానే క్రీక్ కింద సుమారు 7 కిలోమీటర్ల పొడవైన దేశంలోని తొలి అండర్‌సీ రైలు టన్నెల్ కూడా ఉంది. తొలి సర్వీస్‌ను 2027 ఆగస్టులో ప్రారంభించాలనే లక్ష్యం ఉంది.

అదే విధంగా 2026–27 కేంద్ర బడ్జెట్‌లో ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లు ప్రకటించారు. దాదాపు 4,000 కిలోమీటర్ల మేర విస్తరించే ఈ కారిడార్లకు సుమారు రూ.16 లక్షల కోట్ల పెట్టుబడి అంచనా ఉంది.

ప్రతిపాదిత కారిడార్లలో ఢిల్లీ–వారణాసి 3 గంటల 50 నిమిషాలు, వారణాసి–పట్నా–సిలిగురి 2 గంటల 55 నిమిషాలు, చెన్నై–బెంగళూరు 1 గంట 13 నిమిషాలు, బెంగళూరు–హైదరాబాద్ 2 గంటలు, చెన్నై–హైదరాబాద్ 2 గంటల 55 నిమిషాలు, ముంబై–పుణే 48 నిమిషాలు, పుణే–హైదరాబాద్ 1 గంట 55 నిమిషాలు వంటి ప్రయాణ సమయాలను లక్ష్యంగా పెట్టుకున్నారు.

కిలోమీటర్ల కంటే.. ఆదా అవుతున్న గంటలే కీలకం

భారత్‌లో మౌలిక వసతుల అభివృద్ధి ప్రభావం ఇప్పుడు రహదారులు, వంతెనలు, రైల్వే లైన్ల సంఖ్యలో మాత్రమే కనిపించడం లేదు. ప్రజలు తమ గమ్యస్థానాలకు ఎంత త్వరగా చేరుకుంటున్నారు అనేదే దాని ప్రత్యక్ష ఫలితంగా మారుతోంది. వంతెనలు నదులు, లోయలను దాటిస్తున్నాయి. సొరంగాలు కొండలను ఛేదిస్తూ నేరుగా మార్గాలను అందిస్తున్నాయి. ఎక్స్‌ప్రెస్‌వేలు రోడ్డు ప్రయాణ వేగాన్ని పెంచుతున్నాయి. ఆధునిక రైళ్లు, హైస్పీడ్ కారిడార్లు రైలు ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తున్నాయి. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య దూరం కంటే ప్రయాణానికి పట్టే సమయం తగ్గుతూ.. ప్రజలకు రోజువారీ జీవితంలో విలువైన సమయం ఆదా అవుతుందంటూ పలువురు పేర్కొంటున్నారు.

Follow Us