Centre warns Coronavirus: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యాన్ని కొనసాగిస్తోంది. మరణ మృదంగాన్ని మోగిస్తోంది. కరోనా ధాటికి ప్రపంచం మొత్తం కకావికలమౌతోంది. మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతూనే పోతోంది. అనేక దేశాల్లో పాజిటివ్ కేసులు.. దానికి అనుగుణంగా మరణాలు బెంబేలెత్తిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడంలో, మరణాలకు అడ్డుకట్ట వేయడంలో అగ్రదేశాలు సైతం చేతులు ఎత్తేశాయి. ఈ పరిస్థితుల్లో కొత్తగా వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ స్ట్రెయిన్ మరింత గుబులు పుట్టిస్తోంది.
ఇటు భారత్‌లో కరోనా విజృంభణ ఆగడం లేదు. మూడు రోజులుగా వరుసగా రోజూ దాదాపు లక్ష కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశం మొత్తం ఆంక్షల చట్రంలోకి వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇవాళ జరుగుతున్న కేంద్ర కేబినెట్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా వేగంగా విస్తరిస్తున్న తరుణంలో వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన కఠిన ఆంక్షలపై చర్చించనుంది. ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
దేశంలో 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉధృతంగా కొనసాగుతుంది. తొలుత 60 ఏళ్లకు పైబడిన వృద్ధులకు వ్యాక్సినేషన్ ప్రారంభించింది కేంద్రం. అనంతరం ఐఎమ్‌ఏ మార్గదర్శకాలతో 45 ఏళ్ల వయసు వారందరికీ వ్యాక్సిన్ వేయాలనే నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వం. అయితే కరోనా ఉధృతి కొనసాగుతోన్న నేపథ్యంలో 45 ఏళ్ల లోపు వారికి కూడా వ్యాక్సిన్ వేయాలనే డిమాండ్ వినిపిస్తుంది. ఈ డిమాండ్‌పై కేంద్రం గతంలో స్పష్టత నిచ్చింది.
వ్యాధికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నవారిని రక్షించడమే తమ తొలి ప్రాధాన్యమని కేంద్రం తెలిపింది. ‘‘కోరుకున్న వారికి టీకాలు వేయం.. అవసరమైన వారికే వేస్తాం’’ అని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. పాశ్చాత్య దేశాల్లో సైతం దశల వారీగా టీకాలు వేస్తున్న సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ‘‘కరోనా మరణాలను టీకాల ద్వారా సాధ్యమైనంతగా తగ్గించడమే లక్ష్యం. ఆరోగ్య వ్యవస్థను కాపాడడం మరో లక్ష్యం’’ అని స్పష్టంచేశారు.
అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఓవైపు ఉధృతంగా కొనసాగుతుండగానే మరోవైపు దేశంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాలు ఇప్పటికే అనేక కట్టడి చర్యలు చేపడుతున్నాయి. దిల్లీ ప్రభుత్వం ఈ నెల 30 వరకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. గర్భిణులు, రోగులు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్ట్‌స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించేవారు తదితర వర్గాల వారికి మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ నగరంలోని పరిస్థితులు సమీక్షించి ఆంక్షలు అత్యవసరం అని చెప్పడంతో రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని కేజ్రివాల్ సర్కార్ నిర్ణయించింది.
చండీగఢ్‌లో కూడా రాత్రి పది నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. పెళ్లిళ్లు, అంత్యక్రియలు మినహా అన్ని రకాల కార్యక్రమాలపై పంజాబ్ నిషేధం విధించింది. కరోనా కేసులు అత్యధికంగా ఉన్న 11 జిల్లాల్లో ఈ ఆంక్షల్ని అమలు చేసింది. పెళ్లయినా, చావైనా 20 మందికి మించి రావడానికి అనుమతిలేదు. గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్ సహా 20 నగరాల్లో ఈ నెల 30 వరకు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. రాజస్థాన్‌లో రాత్రి 8 నుంచి ఉదయం 6 గంటలవరకు కర్ఫ్యూని అమలు చేస్తున్నారు. రెస్టారెంట్ల నుంచి హోండెలివరీకి మాత్రమే అనుమతి ఉంది. ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు బడుల్ని బంద్ చేశారు.
వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ముంబయి నగర పాలక సంస్థ మార్గదర్శకాలు జారీచేసింది. ఏదైనా హౌసింగ్ సొసైటీలో అయిదుగురికి మించి కరోనా బాధితులు ఉంటే ఆ భవనం ప్రాంతాన్ని కంటెయిన్‌మెంట్ జోన్‌గా ప్రకటిస్తారు. రాకపోకలను నిషేధిస్తారు. మార్గదర్శకాలను ఉల్లంఘించిన హౌసింగ్ సొసైటీకి రూ.20,000 జరిమానా విధిస్తామని బీఎంసీ స్పష్టంచేసింది. ఈ నెల 30 వరకు ముంబయిలోని అన్ని బీచ్‌లను మూసివేశారు. పుణె జిల్లాలో ఒకే రోజు 8,075 కేసులు వెలుగులోకి రావడంతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడిపోతున్నాయి. ముంబైలో ఆంక్షలు తీవ్రతరం కావడంతో వలస కార్మికులు ఉపాధి కోల్పోయి ఊరి బాట పట్టారు. రైళ్లు నిలిపివేస్తే కాలి నడకన వెళ్లాల్సి వస్తుందన్న భయంతో మూట ముల్లె సర్దుకొని స్వగ్రామాలకు తరలిపోతున్నారు.
తాజాగా దేశంలో కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతున్న తరుణంలో భారత వైద్య మండలి కీలక సూచన చేసింది. వేగంగా వైరస్ విస్తరిస్తున్నందున వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి. ఇందులో భాగంగా 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకాలు అందించాలని ఐఎంఏ కోరింది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ కొవిడ్ వ్యాక్సిన్ వేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఏప్రిల్ 6న లేఖ రాసింది. టీకా అవసరాన్ని వివరించింది. వ్యాక్సిన్లు వైరస్ తీవ్రతను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని, హెర్డ్ ఇమ్యూనిటీకి దోహదం చేస్తాయని ఐఎంఏ పేర్కొంది. ప్రభుత్వ సిబ్బందితో పాటు ప్రైవేట్ సెక్టార్‌ను వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో మరింత భాగస్వామ్యం చేయాలని సూచించింది. ఇది సత్ఫలితాలను ఇస్తుందని పేర్కొంది.
దగ్గర్లోని వ్యాక్సిన్ కేంద్రాల్లో ఉచితంగా టీకా అందించడంతో పాటు.. ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండా వచ్చిన వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని ఐఎంఏ తన లేఖలో ప్రధానిని కోరింది. బహిరంగ ప్రదేశాల్లోకి రావడానికి, ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సరుకులు తీసుకునే వారికి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను తప్పనిసరి చేయాలని సూచించింది.
టీకాలు అందరికి అందుబాటులోకి రావాల్సిన అవసరం గురించి ఐఎంఏ తన లేఖలో వివరించింది. ‘కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వ్యక్తిగతంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఫలితంగా కేసుల సంఖ్య తగ్గుతుంది. వ్యాధి తీవ్రతను తగ్గించి, హెర్డ్ ఇమ్యూనిటీని పెంచేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం’ అని ఐఎంఏ పేర్కొంది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ప్రైవేట్ సెక్టార్ ఫ్యామిలీ క్లినిక్స్ చురుగ్గా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఐఎంఏ సూచించింది. ఫ్యామిలీ ఫిజిషియన్లను వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగస్వామ్యం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని పేర్కొంది.
భారత వైద్య మండలి సూచన నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం భేటీ అవుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో కరోనా కట్టడికి పలు కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే భారత వైద్యమండలి సూచనలపై కేంద్ర కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా పెరిగిపోతోందని, వచ్చే నాలుగు వారాలు అత్యంత సంక్లిష్టమైనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెకండ్ వేవ్‌ని కట్టడి చేయడం ప్రజల చేతుల్లోనే ఉందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో కరోనా పరీక్షల సామర్థ్యం, ఆస్పత్రుల్లో సదుపాయాల కల్పన, వాయువేగంగా వ్యాక్సినేషన్ వంటి చర్యలపై కేంద్రం కేబినెట్ చర్చించనుంది. అయితే 45 ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియపై కేంద్ర కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.
Read Also… తమిళనాడులో మరోసారి పంజా విరుసుతున్న కరోనా.. 15 మంది రైల్వే గ్యారేజ్ సిబ్బందికి పాజిటివ్