ఉదయం నిద్ర లేవడంతో మొదలవుతుంది. రాత్రి పొద్దుపోయే వరకూ కొనసాగుతుంది. నాలిక మీద ఆ తేనీటి చుక్క పడనిదే.. కాలు కదలదు. మెదడు పనిచేయదు. ఇంకా చెప్పాలంటే అసలేమీ తోచదు. అదే టీ మహిమ. సేవించేవారికి ఇది చక్కటి పానీయం. మన దేశంలో టీ మార్కెట్ చిన్నదేమీ కాదు.
ప్రపంచంలో అత్యధికంగా టీని ఉత్పత్తి చేసే దేశాల్లో మన దేశానిది రెండో స్థానం. కాకపోతే మనం ఉత్పత్తి చేసే టీలో దాదాపు 80 శాతం దేశీయ అవసరాలకే వినియోగిస్తాం. దాదాపు 20 శాతం మాత్రమే ఉత్పత్తి అవుతోంది. మన దేశంలో కాఫీతో పోలిస్తే.. టీ వినియోగం ఎక్కువ. దాదాపుగా ప్రతీ ఇంటిలోనూ ఛాయ్ ప్రియులు ఉంటారు. రోజూ టీ తాగనిదే చాలామంది ఉండలేరు. నిత్యజీవితంలో వీరికి ఇది ఓ భాగంగా ఉంటుంది. మన దేశంలో సగటున ఒక్కొక్కరూ రోజుకు 3 కప్పుల టీని తీసుకుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. మన దేశ జనాభాలో దాదాపు 64 శాతం మంది టీ తాగుతున్నారని అంచనా. నిజానికి కాఫీతో పోలిస్తే టీ తాగేవారే మన దగ్గర ఎక్కువగా ఉంటారు. అందుకే ఇది సామాన్యుడి ఛాయ్ అని అంటారు.
మన టీ మార్కెట్ ఎంత పెద్దది అంటే.. ఇంటి అవసరాలకు ఉపయోగించే తేయాకు ఉత్పత్తి ద్వారా జరిగే బిజినెస్ 17.55 బిలియన్ డాలర్లు. మార్కెట్ అవసరాల కోసం ఉపయోగించే తేయాకు ద్వారా జరిగే బిజినెస్ 4.84 బిలియన్ డాలర్లు. అంటే మొత్తంగా 22.39 బిలియన్ డాలర్ల బిజినెస్ జరుగుతోంది. అంటే మన దేశంలో టీ బిజినెస్ దాదాపు దాదాపు రూ.2 లక్షల కోట్లు. దేశంలో అంతర్గతంగా టీ పరిశ్రమ ఉపాధి కల్పనలో కీలకంగా వ్యవహరిస్తోంది. అదే సమయంలో విదేశీ మారకద్రవ్యాన్నీ ఆర్జిస్తోంది. దీనికి కొన్ని సవాళ్లు లేకపోలేదు. కాకపోతే వాటిని అధిగమించి ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఎగుమతులు తగ్గినప్పుడు ఈ ఇండస్ట్రీ ఆదాయం గణనీయంగా పడిపోతుంది. ప్రపంచం మొత్తం మీద టీ ఉత్పత్తిని ఎగుమతి చేసే దేశాలతో పోలిస్తే.. మన దేశం వాటా 11 శాతం. ఇందులో మన పొరుగునున్న శ్రీలంక, చైనా.. అలాగే కెన్యా తరువాత మనది నాలుగో స్థానం.
దేశంలో కొన్ని రాష్ట్రాల్లో తేయాకు సాగు అధికంగా ఉంటుంది. అసోం, పశ్చిమబెంగాల్.. ఈ రెండు ఫస్ట్ ప్లేసులో ఉంటాయని చెప్పచ్చు. ఇంకా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, తమిళనాడు, నాగాలాండ్, కర్ణాటక, మిజోరం, ఉత్తరాఖండ్, మేఘాలయ.. ఇలా ఈ రాష్ట్రాలో టీ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో చూస్తే.. మన దేశంలో మొత్తం ఉత్పత్తి అయిన తేయాకు.. దాదాపు 135 కోట్ల కేజీలు ఉంటుంది. ఇందులో ఎలాగూ దాదాపు 20 శాతం విదేశాలకు ఎగుమతి అయిపోతుంది. దీనికి ఉదాహరణగా చెప్పాలంటే.. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో 20 కోట్ల కేజీల టీ ఉత్పత్తిని మన దేశం ఎక్స్ పోర్ట్ చేసింది. ప్రపంచంలో టీని ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాలపరంగా చూస్తే.. మన దేశం వాటా 23 శాతం. అందుకే ప్రపంచంలో అధికంగా తేయాకును ఉత్పత్తి చేసే దేశాలలో చైనా నెక్స్ట్ ప్లేస్ లో.. మనమే ఉంటాం.
మన దేశంలో తొలుత తేయాకును పండించింది ఈస్టిండియా కంపెనీయే. అసోంలో దీని ఉత్పత్తిని ప్రారంభించింది. ఆ తరువాత దేశంలో వివిధ ప్రాంతాలకు అది విస్తరించింది. వాతావరణం అనుకూలించడంతో కొన్ని రాష్ట్రాలు దీనిని ఎక్కువగా పండిస్తాయి. 174 సంవత్సరాల వెనక్కు వెళితే.. ప్రపంచంలో తేయాకు ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాల లిస్టును తిరగేస్తే.. అందులో కచ్చితంగా మనముంటాం. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ పరిశ్రమను అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగా 1953లో ఓ చట్టాన్ని తీసుకువచ్చింది. దాని ద్వారా మన టీ బోర్డును ఏర్పాటు చేశారు. మన దేశంలో తేయాకు సాగును పెంచడంతో పాటు దీని బిజినెస్ ను కూడా పెంచాలి. ఈ బోర్డు ముఖ్య ఉద్దేశం ఇదే. ఈ బోర్డు.. కేంద్రంలో వాణిజ్య, పరిశ్రమల శాఖ కంట్రోల్ లో ఉంటుంది. ఈ టీబోర్డు తన పనిని 1954 నుంచి ప్రారంభించింది. ఈ బోర్డు ఆఫీస్ కోల్ కతా లో ఉంటుంది. దేశవ్యాప్తంగా దీనికి 17 కార్యాలయాలు ఉన్నాయి. అయితే టీ లో క్వాలిటీని పెంచడం కోసం 2021లో స్పెషల్ స్కీమ్ ను కూడా కేంద్ర ప్రభుత్వం లాంఛ్ చేసింది. దీని ద్వారా టీ పరిశ్రమలను ఏర్పాటు చేయడాన్ని ప్రోత్సహించి కొన్ని రాయితీలిస్తుంది. దీంతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయి. కొత్త పారిశ్రామికవేత్తలను తయారుచేయడానికి అవకాశం ఉంటుంది. ఇది దేశ ఆర్థికవ్యవస్థకు ఊతమిస్తుంది.
2021 చివరిలో టీ పరిశ్రమ ఆశ్చర్యపోయే ఘటన చోటుచేసుకుంది. చెప్పాలంటే.. ఈ ఇండస్ట్రీ చరిత్రే సృష్టించింది. మామూలుగా అయితే కేజీ టీపొడి ఎంత ఉంటుంది? మార్కెట్ లో ఉన్న కంపెనీ, క్వాలిటీని బట్టి రూ.1000 రూపాయిల లోపు ఉంటుంది. కానీ అసోంలోని ఓ గోల్డ్ టీపొడి గురించి తెలిస్తే మాత్రం షాకవుతారు. అది కేజీ రూ.99,999 పలకడంతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు. మనోహరి గోల్డ్ గా ఈ టీ పొడి ఫేమస్. అప్పట్లో నాలుగైదేళ్లపాటు రికార్డు స్థాయిలోనే దీని రేటు ఉండేది. అక్కడ సంవత్సరానికి సుమారు 5 లక్షల కేజీల టీపొడిని ఉత్పత్తి చేస్తారు. కానీ ఈ 5 లక్షలలో కేవలం 5 కేజీలు మాత్రమే గోల్డ్ తేయాకు ఉంటుంది. దీని స్పెషల్ ఏంటంటే.. మొక్కల నుంచి తేయాకును తెల్లవారుజామున మాత్రమే తీయాలి. ఇలాంటి క్వాలిటీ తేయాకు రకాలు మన దేశంలో ఉన్నాయి. కానీ వాటికి సరైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తే.. బ్రాండింగ్ వస్తుంది. అప్పుడు బిజినెస్ పెరుగుతుంది. దీంతో అలాంటి దానిని ఉత్పత్తి చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. భారత్ 25కు పైగా దేశాలకు టీని ఎగుమతి చేస్తోంది. అందులో ప్రధాన దేశాలను చూస్తే.. రష్యా, ఇరాన్, యూఏఈ, యూకే, జర్మనీ, చైనా ఉన్నాయి. ఇక వీటితోపాటు ఈ లిస్టులో పోలాండ్, కెనడా, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, సింగపూర్, శ్రీలంక, కెన్యా, జపాన్, ఆస్ట్రేలియా కూడా ఉన్నాయి.
మన దేశంలో టీ అంటే.. పాలు, పంచదార, టీపొడి మిశ్రమంతో తయారుచేసేదే. కానీ కొంతమంది గ్రీన్ టీ, బ్లాక్ టీ.. ఇలా రకరకాల ఛాయ్ ని టేస్ట్ చేస్తారు. మన దేశం నుంచి ఎక్కువగా ఉత్పత్తయ్యే టీ పొడి రకాలను చూస్తే.. మసాలా, గ్రీన్, బ్లాక్, లెమన్, రెగ్యులర్, హెర్బల్ రకాల టీపొడులు ఎక్కువగా ఎక్స్ పోర్ట్ అవుతాయి. ఒకవేళ మన పొరుగు దేశాలైన చైనా, శ్రీలంక నుంచి ఎగుమతులు తగ్గితే.. ఆ మేరకు మన ఎక్స్ పోర్ట్స్ పెరుగుతాయి. అయితే ఆ దేశాల ఎగుమతులు పెరిగితే.. మనపై ఆ ఎఫెక్ట్ తప్పదు. ఈ పరిస్థితి నిజంగా మారాల్సిందే. అయితే క్వాలీటీ ఉన్న తేయాకును ఎక్కువగా పండించే దేశం శ్రీలంక అనే చెప్పాలి. అందుకే దానికి ప్రపంచంలో చాలా దేశాల్లో గిరాకీ ఉంటుంది. దీనివల్లే ఆ రకాన్ని వారు ఎక్కువగా సాగు చేస్తారు. మరి మన దగ్గర అలాంటి టీపొడి లేదా అంటే.. ఉంది. కానీ చాలా తక్కువగా.. అంటే మన మొత్తం ఉత్పత్తి చేసినదానిలో దీని వాటా కేవలం 9.56 శాతం మాత్రమే. అంటే మన దేశం కూడా ఇలా ప్రపంచంలో ఎక్కువగా డిమాండ్ ఉన్న రకాల సాగుకు ప్రయత్నించాలి. అప్పుడే మన ఎగుమతులు కూడా పెరుగుతాయి. మంచి బిజినెస్ జరుగుతుంది. అది దేశీయంగా కోట్ల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందించే ఛాన్సుంది. ఇక దేశంలో టీ ఉత్పత్తిలో 17 శాతాన్ని సాగు చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలు 3 ఉన్నాయి. అవి.. తమిళనాడు, కేరళ, కర్ణాటక.
దేశంలో తేయాకు పరిశ్రమ సుమారు 35 లక్షల మందికి ఉపాధిని కల్పిస్తోంది. నిజానికి ఇంతకంటే ఎక్కువమందికే ఈ ఇండస్ట్రీ ఉద్యోగాలను కల్పించే అవకాశముంది. కానీ ప్రకృతిలో వస్తున్న మార్పులు, వర్షాలు, వాతావరణంలో మార్పులు.. తేయాకు సాగుపై ప్రభావం చూపిస్తున్నాయి. దిగుబడి తగ్గిపోయేలా చేస్తున్నాయి. 2022 నాటికి దేశవ్యాప్తంగా తేయాకును సాగు చేస్తున్న విస్తీర్ణం 6.19 లక్షల హెక్టార్లు. ప్రస్తుతం అయితే.. మన దేశంలో 6.40 లక్షల హెక్టార్లలో తేయాకును మనవాళ్లు సాగు చేస్తున్నారు. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే.. ఈశాన్య రాష్ట్రాలవారికి ఈ సాగే జీవనాధారం అని చెప్పాలి. పైగా అక్కడి టీ ఎస్టేట్స్ లో పనిచేసేవారిలో మహిళల వాటా 50 శాతానికి పైగానే ఉంటుంది. నిజానికి మహిళల వాటా ఈ స్థాయిలో ఉండడం స్వాగతించదగ్గ విషయమే అయినా.. వారి సంక్షేమం కోసం చేసిన చట్టాలు సరిగా అమలు కాకపోవడం నిజంగా ఆవేదన చెందాల్సిన విషయం. వాళ్ల జీవనం దారుణంగా ఉందని.. సాక్షాత్తూ పార్లమెంటరీ స్థాయీ సంఘమే చెప్పిందంటే.. అక్కడున్నవారి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
మన దేశంలో తేయాకు సాగులో చిన్న రైతుల పాత్రను తీసేయలేం. మొత్తం ఉత్పత్తిలో 52 శాతం వాటాతో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. కానీ పెట్టుబడితోపాటు, కార్మికుల కొరత వీరిని వేధిస్తోంది. దీనికి తోడు భారీగా మార్కెటింగ్ చేసుకునే అవకాశం వీరికి తక్కువ. అందుకే ఈ సదుపాయాన్ని కల్పించాల్సిన అవసరముంది. దేశీయంగా పోటీలో నిలవడంతోపాటు అంతర్జాతీయంగా పోటీ పడాలి. అంటే ప్రపంచస్థాయిలో ఎలాంటి రకాలకు డిమాండ్ ఉందో వాటిని ఇక్కడ ఉత్పత్తి చేయగలగాలి. దీంతోపాటు ఫ్లేవర్లను పెంచాలి. వినియోగదారుల అభిరుచులు దేశాన్ని బట్టి మారిపోతాయి. వారి టేస్ట్ కు తగ్గట్టుగా ఉత్పత్తులను అందించగలిగితే.. ఎక్స్ పోర్ట్స్ పెరుగుతాయి. దీనివల్ల టీ ఇండస్ట్రీ లాభపడుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికీ తోడ్పడుతుంది. అంతిమంగా.. తేయాకును సాగు చేసే రైతులు లాభపడతారు. అది వారితోపాటు దేశానికీ మంచిదే.
మన టీ బోర్డు.. అంతర్జాతీయ ఎగ్జిబిషన్స్ లో మన స్టాల్స్ ను ఏర్పాటు చేయడంతో పాటు కొనుగోలుదారులు, వినియోగదారులతో కలిసి స్పెషల్ మీటింగ్స్ పెట్టడం, ట్రేడ్ డెలిగేషన్స్ కు చొరవ తీసుకోవడం చేయాలి. మార్కెట్ సర్వేలు చేయడం, వాటిని విశ్లేషించడం, వినియోగదారుల అభిరుచి ఎలా మారుతుందో పసిగట్టడంతోపాటు దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. అలాగే దీనికి సంబంధించిన సమాచారాన్ని తేయాకు ఉత్పత్తిదారులకు, దిగుమతిదారులకు అందివ్వాలి. ప్రస్తుతం ఇవన్నీ చేస్తున్నా.. ఈ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెడితే కచ్చితంగా టీ పరిశ్రమ ఇంకా మంచి బిజినెస్ చేస్తుందని చెప్పవచ్చు.
మరిన్ని ప్రీమియం కథనాల కోసం.. TV9 News యాప్ డౌన్లోడ్ చేసుకోండి