ఫ్లాష్ సేల్స్ పేరుతో ఈ-కామర్స్ కంపెనీలు చేస్తున్న మోసాలకు త్వరలో అడ్డుకట్ట పడనుంది. ఈ మేరకు త్వరలో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకురానుంది. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో వినియోగదారుల రక్షణ(ఈ- కామర్స్)-2020 చట్టానికి సవరణలు చేసేందుకు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిపానలు చేసింది. ఈ ప్రతిపాదిత చట్ట సవరణలతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర ఈ- కామర్స్ వేదికలపై జరుగుతున్న మోసాలకు చెక్ పడనుంది. ఒక వస్తువును ఈ-కామర్స్ సైట్‌లో ప్రదర్శించి వినియోగదారులకు మరో వస్తువును అంటగట్టినా, ఉత్పాదనను, సేవను అందించడంలో విక్రేత విఫలమైనా ఆ బాధ్యత ఈ-కామర్స్ కంపెనీదే.
వినియోగదారుల భద్రత చట్టం-2019 కింద ఈ కామర్స్ కొత్త నిబంధనలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ కామర్స్-2020 పేర తెచ్చిన చట్టాన్ని గత ఏడాది జులై 23 నుంచి అమలు చేస్తోంది. వినియోగదారుల భద్రతకు సంబంధించి కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రత్వ శాఖ ఈ కామర్స్ నిబంధనలు-2020 కీలక మార్పులు చేసింది. సోమవారంనాడు(జూన్ 22) వినియోగదారుల భద్రత(ఈ కామర్స్)-2020 చట్టంలో కీలక మార్పులను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదింది.
కేంద్రం ప్రతిపాదించిన ఈ ముసాయిదా అంశాల్లో..
ఆన్ లైన్ రిటెయిలర్లకు కొత్త రిజిస్ట్రేషన్ నిబంధనలు విధించాలని ప్రతిపాదించారు. డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) వద్ద ఈ కామర్స్ సంస్థల రిజిస్ట్రేషన్ ను తప్పనిసరి చేయనుంది కేంద్రం. సైబర్ సెక్యురీటీ కార్యకలాపాలపై ప్రభుత్వం నియమించిన ఏజెన్సీతో సమాచారం పంచుకోవాలని నిర్దేశకాలు జారీ చేసింది. ప్రభుత్వ ఏజెన్సీ నుంచి ఆదేశాలు అందుకున్న 72 గంటల్లో ఈ-కామర్స్ వేదికలు స్పందించాలని ప్రతిపాదించింది. తద్వారా చట్ట ప్రకారం దర్యాప్తు, విచారణ చేయడానికి నిర్ణీత వ్యవధిలో న్యాయం అందించేందుకు వీలవుతుందని వెల్లడించింది. వినియోగ దారులు ఇంటర్నెట్‌లో వెతుకున్న వస్తువులు లేదా సేవలు కాకుండా యూజర్లను తప్పుదోవ పట్టించడాన్ని నియంత్రించే చర్యలను ప్రతిపాదించింది. వినియోగదారుల ఇబ్బందులు పరిష్కరించేందుకు ఈ-కామర్స్ సైట్లు చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారుల నియామకం తప్పనిసరి చేసింది. ఈ కామర్స్ కంపెనీలు వినియోగదారుల డేటాను సొంత లాభం కోసం ఉపయోగించకుండా చేసేందుకు ప్రస్తుతమున్న నిబంధనలు మరింత కఠినం చేయాలని ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో ఈ-కామర్స్ సంస్థల ‘ఫ్లాష్ సేల్స్’ పై నిషేధం విధించాలని ప్రతిపాదించింది. నిర్ణీత నిబంధనలు పాటించే ఈ కామర్స్ ఫ్లాష్ సేల్స్ నిషేదం ఉండదని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది. వస్తువుల ఎంపికలో వినియోగదారుల పాత్రను పరిమితం చేసే ఫ్లాష్ సేల్స్ పై నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది.
ఫ్లాష్ సేల్స్ అంటే.. అప్పటివరకు ఉన్న ధరలను తగ్గించి లేదా భారీ డిస్కౌంట్లు ఇచ్చి లేదా ఆకర్షణీయ ఆఫర్ల మేరకు నిర్ణీత కాల వ్యవధిలో చేపట్టే అమ్మకాలు. ఫ్లాష్ సేల్స్ కింద అమ్మకాలకు వస్తువు లేదా సేవలు దిగుమతి చేసుకున్న లేదా ఉత్పత్తి జరిగిన ప్రాంతం వివరాలను వెల్లడించాలని నిబంధన విధించనున్నారు. ఈ కామర్స్ సంస్థలు సవరణల ముసాయిదాపై తమ అభిప్రాయాలను తెలపడానికి జూలై 6వ తేదీ వరకు కేంద్రం గడువు నిర్ధేశించింది. గత ఏడాది జులై 23 నుంచి అమల్లోకి తెచ్చిన ఈ కామర్స్-2020 చట్టం ఉత్పత్తుల పారదర్శకతను చూడటానికి ఉద్దేశించిదని ప్రభుత్వం వెల్లడించింది.
ఈ కామర్స్ -2020 చట్టం లో కొన్ని ప్రధానాంశాలు..
1. దేశం లేదా విదేశాల్లో రిజస్టరయి భారత్ లో సరకులు, సేవలందించే ఎలక్ట్రానిక్ రిటెయిలర్లన్నింటికీ ఈ నిబంధనలు వర్తింపు
2.నిబంధనల ఉల్లంఘన జరిగితే.. వినియోగదారుల చట్టం-2019 కింద చర్యలు
3. ఈ కామర్స్ సంస్థలు సరకులు, సేవల అమ్మకం ధరలతోపాటు ఇతర చార్జీలను ప్రదర్శించాల్సి ఉంటుంది
4.సరకుల మన్నిక కాలం, సేవలు- ఉత్పత్తి జరిగిన దేశం డిస్ ప్లే చేయాలి
5. రిటర్న్, రీఫండ్, ఎక్చేంజ్, వారంటీ, గ్యారంటీ డెలివరీ, షిప్ మెంట్ తదితర సమాచారం ఈ కామర్స్ ప్లేయర్లు డిస్ ప్లే చేయాలి
6. ఈ కామర్స్ సంస్థలు క్యాన్సిల్లేషన్ చార్జీలు విధించ రాదని నిబంధన
7. ఈ కామర్స్ సంస్థలు అసాధారణ లాభాలను పొందడానికి ఆఫర్ చేసిన ధరలను మార్చడానికి వీలు లేదు
8. ఆర్బీఐ ప్రకారం వినియోగదారులు చేసే అన్ని పేమెంట్లు, రీఫండ్ అభ్యర్థలను ప్రతీ ఈ కామర్స్ సంస్థ అంగీకరించాలి.
ఎల్‌ఐసీ పాలసీలను ఆధార్‌తో లింక్ చేయడం అవసరమా..? ప్రభుత్వం ఏం చెబుతుందో తెలుసుకోండి..