నిషేధం అంచుల్లో గోబీ మంచూరియా! శాకాహార ప్రియులూ పారాహుషార్…!

|

Feb 05, 2024 | 6:05 PM

గోబీ మంచూరియా.. లొట్టలేసుకుంటూ ఇష్టంగా కాదు.. ఇకమీదట బిక్కుబిక్కుమంటూ కష్టంగా తినాల్సిందే. ఆ మాటకొస్తే తినకుండా ఉంటే ఇంకా బెటర్. అదేంటి.. గోబీ మంచూరియా మంచిది కాదంటారా.. ఆవిధంగా మా చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెట్టాలనుకుంటున్నారా? అని మీరు అడిగినా అడుగుతారు. గోబీ మంచూరియా మంచిదే.. కాలీఫ్లవర్లతో వండే క్లీన్ ఫుడ్డే. కాకపోతే దాని చుట్టూ చేసే కవరింగులు, కలరింగులతోనే ప్రమాదం పొంచి ఉంది.

నిషేధం అంచుల్లో గోబీ మంచూరియా! శాకాహార ప్రియులూ పారాహుషార్...!
Gobi Manchurian
Follow us on

గోవా, ఫిబ్రవరి 5:  వేడివేడిగా బాండలిలోంచి బైటపడగానే.. మిసమిసలాడుతూ బంగారం రంగులో మెరిసే గోబీ మంచూరియా. సాయంత్రం పూట తీసుకునే అల్పాహారాల్లో దీనికేగా మనమిచ్చే అగ్రతాంబూలం.. ఆహా ఏమి రుచి.. తినాల్సిందేగా మైమరచి. ఈవెనింగ్స్‌లో అవుటింగ్‌కి వెళ్లినప్పుడు.. ఫాస్ట్‌ఫుడ్ బండ్ల చుట్టూ ఈగల్లా ముసిరే మనోళ్లను ఎక్కువగా వెయిటింగ్‌లో ఉంచేది ఆ గోబీ మంచూరియా మాతల్లే. ఇప్పుడా హవాకు బ్రేకులు పడబోతున్నాయి. గోబీ మంచూరియా తయారీ-అమ్మకాలకు గండికొట్టేసింది గోవా ప్రభుత్వం. ఎస్.. గోబీ మంచూరియాపై గోవాలో నిషేధం అమల్లోకొచ్చేసింది. గోబీ మంచూరియా డిష్ ఇక కనిపించనే కూడదంటూ ఆర్డరేశాయి గోవా స్థానిక సంస్థలు.

క్లాలీఫ్లవర్‌ ముక్కలు, మైదా పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆలూ, ఉల్లి అన్నీ చాకచక్యంగా కలిపితే వచ్చేదే గోబీ మంచూరియా. ఎక్స్‌ట్రా ఫ్లేవర్స్ కోసం టమాటా సాసూ, సోయా సాసూ కుమ్మరిస్తారు. ఇక్కడే ఉంది అసలైన డేంజర్ గుర్తు. గోబీ మంచూరియా తయారీలో సింథటిక్ రంగులు వాడుతున్నారని, వాటిలో విషతుల్యమైన పదార్థాలు ఉన్నాయి అనేది ప్రధాన అభియోగం. పైగా.. అందులో వాడే సాస్‌లో బట్టలుతికే పౌడర్ వాడకం జరుగుతోందట. ఆరోపణలు రాగానే గోబీ మంచూరియా తయారీ స్టాల్స్ పై ఆకస్మిక దాడులు చేసి.. నో సేల్స్ బోర్డు పెట్టించారు FDA అధికారులు. గోవాలోని మపుసా, మోర్ముగావ్ నగరాల్లో ఇకనుంచి గోబీ మంచూరియా కనిపిస్తే మూసివేతే.

గోబీ మంచూరియాది యాభైఏళ్ల ఘన చరిత్ర. 1970ల్లో ముంబైకి చెందిన చైనీస్ పాపులర్ షెఫ్ నెల్సన్ వాంగ్ చికెన్ మంచూరియాను తొలిసారిగా పరిచయం చేశాడు. ఇదే ఫ్లేవర్‌ని శాకాహార ప్రియులకు అలవాటు చేసే క్రమంలో పుట్టిందే గోబీ మంచూరియా. అనతికాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పవర్‌ఫుల్ ఫాస్ట్‌ఫుడ్‌ గోబీ మంచూరియా.. ఇక మీదట అంతే ఫాస్ట్‌గా మనల్ని వదిలి పోయినా పోవచ్చు. మన ప్రభుత్వాలు కూడా ప్రజారోగ్యానికి పెద్దపీటలేసి గోబీ మంచూరియా తయారీపై కత్తి కడితే.. దానికి బానిసలైన మనం ఆ తర్వాత కరవుకోరల్లో చిక్కుకోక తప్పదు.

రెస్టారెంట్ల వెనకుండే కిచెన్‌లో గోబీని ముక్కలుగా నరకడం, వాటిని వండే విధానాన్ని చూస్తే.. ఏవగింపు కలిగి ఆ తర్వాత దాని జోలికే వెళ్లాలనిపించదు. ఐనా.. గోబీ మంచూరియా కోసం ఎక్కడెక్కడికో ఎందుకు వెళ్లడం? పానీపూరీల్లాగే బటర్‌నానుల్లాగే ఇంట్లోనే దీన్ని కూడా ఎందుకు ట్రై చెయ్యకూడదు..? పక్కా రెస్టారెంట్ రుచి రావాలంటే గోబీ మంచూరియాను ఇలా వండాలి అంటూ యూట్యూబ్ ఛానెళ్లలో వంటింటి చిట్కాలు రెడీమేడ్‌గానే దొరికేస్తున్నాయి.

ప్రమాదకరమైన సాస్ లేకుండా కూడా గోబీ మంచూరియా తయారు చెయ్యవచ్చని మీలో ఎంతమందికి తెలుసు? రంగు, హంగు లేకుండా, కెమికల్స్‌ బారిన పడకుండా రుచికరమైన గోబీ మంచూరియా చేసుకునే చిట్కాలు బోలెడన్ని. ఊర్లో గోబీ మంచూరియా కంటే ఒరిజినల్ గోబీ మంచూరియానే అలవాటు చేసుకోవడం తెలివైన పని. వింతరుచుల మాయలో పడి ఎటెటో వెళ్లిపోతున్న కొత్త తరాలకు, జిహ్వచాపల్యంతో కోరి కష్టాలు కొనితెచ్చుకునే నయా జనరేషన్‌కు ఇదొక మంచి మార్గం. గోబీ మంచూరియా మనకు గుడ్‌బై చెప్పేలోగా మనమే దానికి గుడ్‌బై చెప్పేద్దాం. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన గోబీమంచూరియాను మనింట్లోనే వండేసుకోవడం బెటర్.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..