Nitin Gadkari: నేను కూడా ‘ఆ కారు’ కొనలేను.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు..

|

Oct 01, 2022 | 4:15 PM

ఆయనొక కేంద్రమంత్రి, అంతేకాదు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉంటూ ఎన్నో పదవులు చేపట్టిన వ్యక్తి కూడా. ఆయన కుటుంబం వ్యాపార రంగంలో ఉంది. ఆ కంపెనీకి కోట్లాది రూపాయల టర్నోవర్ కూడా. అయితే ఓ కార్ల తయారీ సంస్థకు సంబంధించిన..

Nitin Gadkari: నేను కూడా ఆ కారు కొనలేను.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు..
Union Minister Nitin Gadkar launched first Made in India Mercedes-Benz Luxury Electric Car
Follow us on

ఆయనొక కేంద్రమంత్రి, అంతేకాదు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉంటూ ఎన్నో పదవులు చేపట్టిన వ్యక్తి కూడా. ఆయన కుటుంబం వ్యాపార రంగంలో ఉంది. ఆ కంపెనీకి కోట్లాది రూపాయల టర్నోవర్ కూడా. అయితే ఓ కార్ల తయారీ సంస్థకు సంబంధించిన ఓ ఉత్పత్తిని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ కంపెనీకి సంబంధించిన కారును తాను కూడా కొనలేనని, ఇక్కడే ఉత్పత్తి ప్రారంభిస్తే ధర తగ్గుతుందని, ప్రజలందరికి అందుబాటులోకి వస్తుందన్నారు. అలా అంటూనే తాను కూడా ఆ కంపెనీకి సంబంధించిన కారు కొనలేనంటూ సరదాగా వ్యాఖ్యానించినప్పటికి.. ఆయన వ్యాఖ్యలు మాత్రం వైరల్ అవుతున్నాయి. అసలు విషయానికొస్తే లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ మహారాష్ట్రలోని పుణేలలో గల చకన్ తయారీ యూనిట్ లో దేశీయంగా అసెంబుల్ చేసిన EQS 580 4MATIC EVని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ.. కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియాకు కొన్ని సూచనలు చేశారు. భారత్ లో సంస్థ ఉత్పత్తిని పెంచాలని, తద్వారా కార్ల ధర తగ్గుతుందని.. ప్రజలు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తారంటూ కార్ల తయారీ కంపెనీకి సూచించారు. ప్రస్తుతం ధర ఎక్కువుగా ఉండటం వల్ల తానుమ కూడా కొనే బెంజ్ కారు కొనే పరిస్థితి లేదంటూ సరదాగా వ్యాఖ్యానించి.. నవ్వులు పూయించారు.

EQS 580 4MATIC EV ధర దాదాపు 1.55 కోట్ల రూపాయలుగా ఉంది. దీంతో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెద్ద మార్కెట్ ఉంది, డిమాండ్ కూడా ఉందన్నారు. దేశంలో 15.7 లక్షల ఎలక్ట్రిక్ వెహికల్స్ రిజిస్టర్ అయ్యాయని, వీటి విక్రయాలు 335 శాతం పెరిగామన్నారు. దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా సాగుతోందని, దీంతో బెంజ్ కార్లకు మంచి మార్కెట్ ఉంటుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. భారత ఆటోమొబైల్ మార్కెట్ విలువ రూ.7.8 లక్షల కోట్లుగా ఉందని, దీని ఎగుమతులు రూ.3.5 లక్షల కోట్ల వరకు ఉన్నాయన్నారు. దీనిని రూ.15 లక్షల కోట్ల పరిశ్రమగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. భారత్ లో వాహన తయారీ పరిశ్రమకు మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
మెర్సిడెస్ బెంజ్ వెహికల్ స్క్రాపింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేయాలని కార్ల తయారీ సంస్థను కోరారు. తద్వారా కార్లకు సంబంధించిన విడి భాగాల ధరలు 30 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని గడ్కరీ పేర్కొన్నారు. తమ వద్ద ఉన్న నివేదికల ప్రకారం 1.02 కోట్ల వాహనాలు స్క్రాప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని, కేవలం ప్రస్తుతం 40 యూనిట్లు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుత అంచనా ప్రకారం ఒక జిల్లాలో నాలుగు స్క్రాపింగ్ యూనిట్లను తెరవగలమని, 2వేల యూనిట్ల వరకు ప్రారంభించడానికి అవకాశాలున్నాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

ఇలా ఉండగా నితిన్ గడ్కరీ దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు వాహనాదారుల్లో అవగాహన కల్పించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనంలోనే నితిన్ గడ్కరీ పార్లమెంట్ కు వెళ్లిన విషయం తెలిసిందే. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ద్వారా కాలుష్యం తగ్గడంతో పాటు ఇంధనాన్ని సేవ్ చేయవచ్చు. అందుకే ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహించడంతో పాటు ఆ వాహనాలను కొనుగోలు చేసేలా వాహనదారులను ప్రోత్సహిస్తుంది కేంద్రప్రభుత్వం. గతంలో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే ఉద్యోగులకు రాయితీలు సైతం ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..