
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న కాలంలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రిటైర్డ్ అధికారులు, ఉద్యోగుల రాజకీయ తటస్థతపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులకు సైతం సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఎన్నికల నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ప్రధాన ఎన్నికల అధికారులకు ఈసీ ఈ మేరకు అధికారిక లేఖ రాసింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరించడం వంటి కార్యకలాపాలకు రిటైర్డ్ సిబ్బంది పూర్తిగా దూరంగా ఉండాలని ఆదేశించింది.
వేటిపై నిషేధం ఉంటుందంటే ?
ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాలు లేదా జిల్లాల్లోని ఎన్నికల అధికారులను ఈ రిటైర్డ్ వ్యక్తులు అధికారిక చర్చల కోసం పిలవకూడదని స్పష్టం చేసింది. వీడియో కాన్ఫరెన్స్‌లు లేదా సమావేశాలు నిర్వహించడంపై కూడా నిషేధం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే రాజకీయ తటస్థ నిబంధనలు వీరికి కూడా వర్తిస్తాయని ఈసీ పేర్కొంది. తమ పేరు, పదవీ ప్రతిష్ట, అధికారాన్ని ఏ రాజకీయ పార్టీ లేదా అభ్యర్థికి అనుకూలంగా ఉపయోగించకూడదని హెచ్చరించింది.
ఈ ఆదేశాలు ఎందుకు ఇచ్చారంటే ?
రిటైర్డ్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాల్లో తిరిగి నియమితులై వివిధ హోదాల్లో పనిచేస్తూ ఎన్నికల సమయంలో అధికార ప్రభావం చూపుతున్నారనే ఫిర్యాదులు గతంలో వచ్చాయి. ఇప్పటివరకు వారి రాజకీయ తటస్థత, ప్రవర్తనపై స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడంతో ఈ ఖాళీని పూరించేందుకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థలు, కమిటీలు, కార్పొరేషన్ల ఉద్యోగులకు కూడా ఎంసీసీ నిబంధనలు వర్తిస్తాయని గతంలోనే స్పష్టం చేసిన ఈసీ, ఇప్పుడు రిటైర్డ్ వర్గాన్ని కూడా దాని పరిధిలోకి తీసుకొచ్చింది.
ఈసీ ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను ఉల్లంఘించే వారిపై అత్యంత తీవ్రంగా స్పందిస్తామని, కఠిన చర్యలు ఉంటాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేసేలా చూడాలని ఆదేశించింది.ఎన్నికల స్వేచ్ఛ, న్యాయం, తటస్థతను కాపాడేందుకు ఈ చర్య తీసుకున్నట్లు ఈసీ అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రాల్లో ఎంసీసీ అమలులో ఉన్న కాలంలో రిటైర్డ్ అధికారులు, ఉద్యోగులు ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఉండాలని ఈసీ హెచ్చరించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..