Gujarat Elections 2022: గుజరాత్ ఫలితాలపై జోస్యం చెప్పిన కేజ్రీవాల్.. గతంలో తన భవిష్యవాణి నిజమైదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు..

|

Nov 28, 2022 | 5:00 AM

గుజరాత్ శాసనసభ ఎన్నికల పోలింగ్‌ సమయం సమీపిస్తోంది. మరో మూడు రోజుల్లో తొలి విడత పోలింగ్ జరగనుంది. మొదటి విడత ప్రచారానికి ఒకరోజు మాత్రమే సమయం మిగిలి ఉంది. ప్రచారం తుది దశకు చేరుకోవడంతో అన్ని పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు..

Gujarat Elections 2022: గుజరాత్ ఫలితాలపై జోస్యం చెప్పిన కేజ్రీవాల్.. గతంలో తన భవిష్యవాణి నిజమైదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు..
Delhi Cm Arvind Kejriwal
Follow us on

గుజరాత్ శాసనసభ ఎన్నికల పోలింగ్‌ సమయం సమీపిస్తోంది. మరో మూడు రోజుల్లో తొలి విడత పోలింగ్ జరగనుంది. మొదటి విడత ప్రచారానికి ఒకరోజు మాత్రమే సమయం మిగిలి ఉంది. ప్రచారం తుది దశకు చేరుకోవడంతో అన్ని పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పారు. తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం పక్కా అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ, పంజాబ్‌ ఎన్నికల్లోని ఫలితాలే గుజరాత్‌లో పునరావృతమవుతాయంటూ చెప్పుకొచ్చారు. గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన సూరత్‌లో మీడియాతో మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 31 నుంచి పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. 27 ఏళ్ల బీజేపీ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, ఆ పార్టీకి విశ్రాంతినివ్వాలని గుజరాత్ ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులంతా ఎన్నోసార్లు ఆందోళన చేపట్టినా, బీజేపీ ప్రభుత్వం వారికి వ్యతిరేకంగా వ్యవహరించిందని, ఈసారి తమ పార్టీ అధికారంలోకి వస్తే వచ్చే ఏడాది జనవరి నుంచే పాత పింఛను విధానం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇది మాటలకే పరిమితం కాదని, పంజాబ్‌లో ఇప్పటికే దీనికోసం నోటిఫికేషన్‌ విడుదల చేశామని కేజ్రీవాల్ తెలిపారు. ఉద్యోగులందరి సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం వెంటాడుతుందని, ప్రజల్లో కాంగ్రెస్‌ ప్రస్తావనే లేకుండా పోయిందని అరవింద్ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. 27 ఏళ్లలో తొలిసారి బీజేపీ భయపడుతోందన్నారు. అనుమానముంటే ఎవరికి ఓటు వేస్తారో.. ప్రజల్ని మీరే అడగండి.. కచ్చితంగా వాళ్లు ఆమ్ ఆద్మీ పార్టీకే వేస్తామని చెబుతారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌ ప్రజల స్పందన చూస్తుంటే తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోందని విశ్వాసం వ్యక్తంచేశారు. చాలా రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించామని, కానీ, గుజరాత్‌లో వస్తోన్నంత స్పందన మరెక్కడా రాలేదని తెలిపారు.

మరోవైపు తన భవిష్యవాణి చాలా సందర్భాల్లో నిజమవుతూ వచ్చిందని, గతంలో ఢిల్లీ, పంజాబ్ ఎన్నికల్లోనూ తన జోస్యం నిజమైందన్నారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక సీటు రాదని చెప్పానని అదే జరిగిందన్నారు. గుజరాత్‌ ఎన్నికల ఫలితాల తర్వాత తన భవిష్యవాణి నిజం కాబోతుందని ధీమా వ్యక్తం చేశారు అరవింద్ కేజ్రీవాల్. డిసెంబర్ 1, 5వ తేదీల్లో రెండు విడతల్లో గుజరాత్‌ శాసనసభ ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. 8వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..