Delhi Air Pollution
వాయు కాలుష్యం రోజురోజుకూ పెరుగుతుండడంపై ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ CAQM తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. లేటెస్టుగా మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఢిల్లీ-NCR పరిధిలో ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ GRAP-4’ కింద మరిన్ని నిబంధనలను అమలు చేస్తామంది. ఈరోజు ఉదయం 8గంటల నుంచి ఈ నిబంధనలు అమలు చేస్తారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఢిల్లీలోని పాఠశాలల్లో కేవలం ఆన్‌లైన్ తరగతులే నిర్వహించనున్నట్లు సీఎం ఆతిశీ ప్రకటించారు.
GRAP స్టేజ్-4లో ఎలాంటి నిబంధనలు విధిస్తున్నారంటే..
- ఢిల్లీలోకి నిత్యావసర వస్తువులు, సర్వీసులు అందించే ట్రక్కులు మినహా మిగిలిన ట్రక్కుల ప్రవేశాన్ని నిలిపివేస్తున్నారు. LNG, CNG, ఎలక్ట్రిక్, బీఎస్-4 డీజిల్ ట్రక్కులకు మాత్రమే అనుమతి.
- ఢిల్లీ వెలుపల రిజిస్ట్రేషన్‌తో ఉన్న తేలికపాటి కమర్షియల్ వెహికల్స్ ప్రవేశంపై నిషేధం విధిస్తున్నారు. ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో ఉన్నప్పటికీ బీఎస్-4 అంతకన్నా పాత డీజిల్ రవాణా వాహనాల ప్రవేశంపై నిషేధిస్తున్నారు.
- అన్ని నిర్మాణ సంబంధిత కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేయాలని ఆదేశాలు. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్ వంతెనలు, పవర్ లైన్‌లు, పైపులైన్‌లు.. ఇలా నిర్మాణ సంబంధిత ప్రాజెక్టులను నిలిపివేయాలని ఆదేశించింది ప్రభుత్వం.
- ఇప్పటికే 1 నుంచి ఐదో తరగతి వరకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని సూచించగా.. ఇప్పుడు 6 నుంచి 9, 11 తరగతుల విద్యార్థులకు వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం ఆతిశీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అన్ని పాఠశాలలకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. GRAP-4 ఆంక్షల ప్రకారం 11-12 తరగతులు మినహా మిగతా విద్యార్థులందరికీ వ్యక్తిగత తరగతులు నిలిపివేయనున్నట్లు తెలిపారు. దీంతో స్కూళ్లన్నీ తాత్కాలికంగా మూతపడనున్నాయి.
- ఎన్‌సీఆర్ ప్రాంతంలో కార్యాలయాలన్నీ 50శాతం సామర్థ్యంతో పనిచేసేలా చూడాలని, మిగతా వారికి వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సిఫారసు చేసింది CAQM. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వొచ్చని సూచించింది.
- రాష్ట్ర ప్రభుత్వాలు కళాశాలలను మూసివేయడంతో పాటు సరి-బేసి వాహన నిబంధనలు అమలు చేయడంపై నిర్ణయం తీసుకోవాలంది ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి